Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషా ప్రస్థానంలో డిజిటల్ సోషల్ మీడియాది ఒక గొప్ప మలుపు. జడలు విరబోసుకుంటున్న ఇంగ్లీష్ భాష ముందు తెలుగు భాష కనుమరుగవుతుందేమో, తెలుగు సాహిత్యం ఇక ముందు అంతరించి పోతుందేమో అని బాధపడుతున్న భాషా, సాంస్కృతీ ప్రేమికుల ఆశలకు కొత్త చిగుళ్ళను తొడిగింది సోషల్ మీడియానే! ఏ ఇంగ్లీష్ విద్య, ఏ టెక్నాలజీ వల్ల మనదైన తెలుగు భాషకు ముప్పు వాటిల్లుతుందేమో అని అనుమానపడిన ప్రజలకు అదే ఇంగ్లీష్, అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుగు భాషకు నూతన సాంకేతిక వేదికలపై కొత్త ఊపిరులుదుతున్న దృశ్యాన్ని ప్రస్తుతం చూస్తున్నాం. గత వందేండ్ల కాలంలో వచ్చిన తెలుగులో సాహిత్యం కన్నా ఎక్కువగా ఈ పదేండ్లలో వచ్చిన బ్లాగ్లు, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సాంకేతిక సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా రాశిలో, వాసిలో సృష్టించబడింది అనేది ఈ మధ్య సర్వేలో వెల్లడైన అంచనా. మాతృభాష, సంస్కతి పట్ల ప్రేమ ఉన్న న్యూ జెనరేషన్ టెక్నాలజికల్ యువత ఈ అనూహ్య పరిణామానికి కారకులు. సృజనాత్మకత, సాంకేతికత సంపూర్ణంగా తెలిసిన ఈ తరం యువతరం తెలుగులో విస్తృతమైన సమాచార నిధిని నిర్మిస్తున్నారు. తెలుగు భాషకు కొత్త వేదికను, నవ్యరూపును అందిస్తున్నారు! దీనివల్ల సంప్రదాయ విధానాలకతీతంగా నవీన సాంకేతిక మాధ్యమాలలో తెలుగు భాష తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది!!
ద్రవిడ భాషలలో తెలుగు భాషకు, తెలంగాణా భాషకు ఉన్న మూలాలు అత్యంత ప్రాచీనమైనవి. ప్రాక్చరిత్ర కాలంలో తెలుగు భాష గోండి, కుయి వంటి గిరిజన, ఆదివాసీ భాషల నుంచి పుట్టిందని భాషా శాస్త్రవేత్తలు ఎన్నెన్నో పరిశోధనల తర్వాత నిర్ధారించారనేది సత్యం. ఆ తర్వాత క్రీ.పూ. 2600 సంవత్సరాల ప్రాంతంలో జైనం, బౌద్ధంతో పాటు వారి సాహిత్యం, మత ప్రచారం వల్ల ప్రాకత భాష ప్రధాన భాషగా ప్రాచీన కాలంలో విలసిల్లిందని తెలుస్తోంది. దీనిని బట్టి ''జనని సంస్కతంబు ఎల్ల భాషలకును'' అనే మాట సంపూర్ణ సత్యం కాదనీ, కాల క్రమంలో సంస్కత భాషా ప్రభావం వల్ల తెలుగు భాషలో సంస్కత పదాల వాడుక పెరగడం వల్ల తెలుగు భాష నిత్య వ్యవహారంలో అంతర్భాగం అయ్యాయని కూడా తెలుస్తోంది. అలా తెలుగు భాష ప్రాచీనకాలం నుంచే ఇతర భాషల ''ఆదాన - ప్రదానాల'' వల్ల ప్రభావితమవుతూ వచ్చి, మధ్యయుగ కాలంలో పారశీక, అరబిక్, ఉర్దూ భాషలతో ప్రభావితం అయింది. దేశంలో 12వ శతాబ్దం నుంచి ఆరంభమైన ఇస్లాం చక్రవర్తుల పాలన, దక్షిణాదిలో, ప్రస్తుత తెలంగాణా ప్రాంతంలో 15వ శతాబ్దం నుండి గోల్కొండ కుతుబ్ షా చక్రవర్తులు, ఆ తర్వాత 17వ శతాబ్దం నుంచి ఆసఫ్ జాహీ నిజాం చక్రవర్తులు, బ్రిటిష్ పాలన వల్ల ఉర్దూ, పర్షియన్ భాషలు, పదాలు, సంస్కతులు తెలంగాణాలో మమేకమై పరస్పర ప్రభావానికి లోనయ్యాయి.
తెలుగు భాషా రూపాంతరాలు
ఆధునిక కాలం వచ్చిన తర్వాత బ్రిటీష్ వారి ప్రభావం వల్ల తెలుగు భాష ఎన్నో రూపాంతరాలను సంతరించుకుంది. బ్రిటిష్ పాలన వల్ల ఇంగ్లీషు సంప్రదాయాలు, ఇంగ్లీష్ శైలి, సాహిత్య ప్రక్రియలు, కవిత్వం, సంప్రదాయాలు కూడా తెలుగులోకి వచ్చాయి. అలాగే ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదం పొంది తెలుగు భాషను మరింత సుసంపన్నం చేశాయి. ఆ ప్రభావం వల్ల తెలుగులో ఉదారవాద పవనాలు బలంగా వీచి, ప్రజల భాషకు పట్టం కట్టాలి అనే ఆలోచన వల్ల ''వ్యవహార భాష ఉద్యమం'' అనేది మొదలయింది. వాడుక భాషకీ, ప్రజల భాషకి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో గిడుగు రామ్మూర్తి పంతులు లాంటి వారు ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టిన తర్వాత పుస్తకభాష, గ్రంథాల భాష, కావ్యభాష, పరిపాలనా భాషగా కూడా ప్రజల భాష ఉండాలనే ఆలోచన అందరికీ మొదలైంది. అది జాతీయోద్యమ స్ఫూర్తిని కూడా కలిగి ఉండటం వల్ల, దానికి దేశభక్తి ఆలోచన కూడా తోడు కావడం వల్ల అది సర్వజనామోద యోగ్యతను సంపాదించి ముందుకు వెళ్ళింది. ఆ క్రమంలోనే ఛందోబద్ధమైన పద్యాలు రాయడం కన్నా ప్రజల భాషలో స్వేచ్ఛా వచనాలు, వచన కవిత్వం (Free Verse) రాయడం అనేది గొప్పది అనే విషయమనేది కూడా చర్చకు వచ్చింది. ఇలా వచన రచనల వల్ల సామాన్యులకి కూడా కవిత్వం అర్థమవుతుంది. కవిత్వంలోని అంతరార్థం సాధారణ పాఠకులకు కూడా అవగతమై దాని పరమార్థం నెరవేరుతుందనే ఆలోచన రావడం వల్ల చాలా మంది భావకవులు, అభ్యుదయ భావుకులు, ఫ్రీవర్స్ ఫ్రంట్ లాంటి సంస్థను స్థాపించిన కుందుర్తి, శ్రీశ్రీ లాంటి కవులందరూ ప్రజల భాషలో పద్యాలకు బదులుగా కవిత్వం రాయడం, స్వేచ్ఛా గీతాన్ని రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కవిత్వం, సాహిత్యం ప్రజాస్వామ్యీకరణ చెందింది.
ఆధునిక కవిత్వంలో కొత్త ప్రయోగాలు
ఇప్పుడు కవిత్వమంటే వచన కవిత్వంగానే ఉంది. అయినప్పటికీ మరొక పాయ ఛందోబద్ధమైన రచన కూడా కొనసాగుతుంది. తెలంగాణ ప్రాంతంలో కవి పండితులు లేరు అన్న మాటను ''గోల్కొండ పత్రిక'' సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి సవాలుగా తీసుకొని 354 మందితో 'గోల్కొండ కవుల సంచిక'ని ప్రత్యేకంగా ప్రచురించి, పద్యకవిత్వం తెలంగాణ ప్రాంతంలో కూడా ఉందని నిరూపించిన సందర్భం చరిత్రలో ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కూడా తెలంగాణ ప్రాంతంలో పద్యకవితా సంప్రదాయం అలాగే శిష్ట భాషా సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మార్గ, దేశి గ్రామ్య భాషలతో పాటు మాండలిక భాష కూడా కొనసాగుతుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఇటీవలి కాలంలో నిలుస్తున్నాయి ఇప్పటికీ పద్య కవులు ఛందో రీతిలో ప్రబంధాలు, శతకాలు, పద్యాలు రాస్తున్నారు. ఇది అంతా ఒకవైపు అయితే వచన కవిత్వంలో కూడా ఎన్నో ప్రయోగాలు ఆధునిక కవులు చేస్తూ వస్తున్నారు. అలాగే ఇతర సాహితీ ప్రక్రియలైన కథ, విమర్శ, నవలల్లో కూడా రచనలు సంప్రదాయ రీతులలో విస్తారంగా వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం.
ఇంటర్నెట్ ఆగమనం
తెలుగు భాష, సాహిత్యం వందలాది ఏండ్ల కాలం నుంచి శాసనాలలో, రాతి శిలలు, రాగి ఫలకాల మీద, తాళపత్ర గ్రంథాలలో విరాజిల్లింది. ఆ తర్వాత ఆధునిక అచ్చుయంత్రాలు రావడంతో తెలుగు భాష, పేపర్ మాధ్యమంగా పుస్తకాలు, పత్రికలలో విస్తారంగా ప్రచురితమై అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవన్నీ 2000 నూతన మిలీనియం నుంచి సంప్రదాయ విధానాలుగా మారి పోయాయి. ఇంటర్నెట్ ఆగమనం, వెబ్సైట్లు, బ్లాగ్లు వంటి వర్చువల్ అంతర్జాల వేదికలు రావడం, అవి ప్రపంచంలోని ఏ మూలకైనా, ఏ క్షణమైనా తక్షణమే సమాచారాన్ని, విషయాన్ని అందించే సౌలభ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి నవ్య సాంకేతిక విధానాలుగా మారిపోయి తెలుగు భాష, సాహిత్యం, రచనలు అన్నీ కొత్త వేదికలపై కొలువుదీరాయి. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరికీ 'గూగుల్' వేదికగా ఎన్నెన్నో విషయాలు, విశేషాలు తెలియవచ్చాయి. ఆ క్రమంలో తెలుగు భాష కూడా వేగంగా, సవివరంగా విస్తరించడం మొదలయింది. వీటికి తోడు, 2010 అనంతరం వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ల వల్ల తెలుగు భాష మరింత విస్తారంగా ప్రపంచ స్థాయికి వెళుతున్నది అని చెప్పడంలో ఆశ్చర్యము లేదు. ఎవరైతే తెలుగు మాట్లాడగలిగి తెలుగు లిపిని రాయలేని ఆధునిక కాలపు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకున్న యువత ఉన్నారో వారికి ఈ ఇంటర్నెట్ ఆధారిత భాషాంతరీకరణ (Transliteration) మాధ్యమం ద్వారా లిపిని రాయడం సులభమైపోయింది. వారి ఆలోచనలు వ్యక్తం చేయడా నికి ఇది ఆధారంగా రూపొం దింది. ఈ క్రమంలో చాలా అక్షర దోషాలు అలాగే భాషా పరమైన దోషాలు జరు గుతూ వస్తున్న విషయాన్ని గమనించి చాలామంది భాషా ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
భాషపై సాధన అవసరం
ఇంటర్నెట్, వెబ్సైట్లు, బ్లాగులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటన్నింటిలో కూడా తెలుగులో విస్తారమైన సాహిత్యం, రచనలు జరుగుతూ వస్తున్నాయి. ఇవి రాస్తున్న వాళ్ళు అందరు కూడా ఇటీవలి యంగ్ జనరేషన్ కావడం, అలా యువతరం కూడా సాహిత్యం వైపు ఆకర్షింపబడటం ఇక్కడ విశేషం. సాంకేతిక పరిజ్ఞానం లాంటి ఐటీ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, సంస్కృతి, భాషా సాహిత్యం, కవిత్వం, పండుగలు, ఉత్సవాల పట్ల ఎంతో ఉత్సాహంతో వారి బ్లాగ్‌లలో, ఫేస్బుక్ పేజీలలో, గ్రూప్‌లలో విస్తారంగా రాస్తూ తమ అనుభవాలు, జ్ఞాపకాలు తెలుగునేలతో వారికి ముడిపడి ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అయితే ఈ పరిణామ సందర్భంలోనే భాషాపరమైన దోషాలు విషయపరమైన లోపాలు, సమాచారపరమైన తప్పులు కూడా అనివార్యంగా, అనుకోకుండా, అనూహ్యంగా దొర్లుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగు లిపితో నేటితరం యువతకి అంతగా పరిచయం లేకపోవడమే అని చెప్పొచ్చు. రెండు మూడు దశాబ్దాల కాలం నుంచి ఆర్థిక స్థితి మెరుగు పడడం, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు నివ్వాలనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం విద్యావిధానానికి పిల్లల్ని అలవాటు చేయడం, ఆ పిల్లలు ఇప్పుడు ఎదిగి వివిధ దేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేసే స్థితికి రావడం లాంటి కారణాల వల్ల ఈతరం యువతరం తెలుగు భాష మాట్లాడ గలుగుతారు కానీ రాయలేని, రాయడం తెలియని ఒక వింత పరిస్థితికి వచ్చిందనేది కాదనలేని సత్యం. ఆ క్రమంలో చాలా మందికి తెలుగు భాషకు సంబంధించిన ఎన్నో అంశాలు తెలియడం లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ ప్రాతిపదికగా భాషాంతరీకరణం ద్వారా, యూనికోడ్ విధానం ద్వారా రాస్తున్న వారికి ఈ భాషా దోషాల నివారణ కోసం మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని వల్ల తెలుగు భాష విరూపణం చెందకుండా, తన సహజత్వాన్ని కోల్పోకుండా, సజీవంగా, రాబోయే తరాలకి కూడా అందుబాటులోకి వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
ఏ యువత అయితే నవీన సాంకేతిక పరిజ్ఞానంతో తమ భావాలని మాతభాష తెలుగులో వ్యక్తం చేస్తున్నారో, వారందరికీ ఒక మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడొచ్చింది. వాక్య నిర్మాణం గురించి, విరామ చిహ్నాలు గురించి, ప్రశ్నార్ధకాల గురించి లేదా ఉటంకింపులు గురించిన విషయాలను, భాషా నియమాలను, లిఖిత రూపంలోని వ్యాకరణ సూత్రాలను నేటి 'నెట్ తరాని' కి తెలియజేయాల్సి ఉంది. రాసే అంశం ప్రథమ పురుషలోనా, ద్వితీయ పురుషలోనా, ఏ అంశం ద్వారా వ్యక్తం చేస్తున్నామనే విషయంలో ఎలాంటి వాక్య నిర్మాణం ఉండాలి అనే అంశాల గురించి కూడా ప్రస్తుత ఇంటర్నెట్ ఆధారిత యువతరానికి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సప్‌లోని వేర్వేరు గ్రూపులలో ప్రస్తుత యువతరం, వారు రాస్తున్న విధానం, వారు ఉపయోగిస్తున్న పదాలు, ఆ పదాల ఉచ్ఛారణ దగ్గరి నుండి భాషా వివరాలను, విశేషాలను, సవరణలను వారికి సూచనలుగా అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సూచనలు కేవలం ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి పోస్ట్ చేసిన రచనకు, లేదా కవితకు మాత్రమే పరిమితం చేయకుండా దాన్ని మొత్తం అందరికీ అర్ధమయ్యేలాగా భాషా విశేషాలను, రాతలోని మెళకువలను ఈ తరానికి విస్తృతంగా తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుత సమకాలీన నవతరం వారు రాస్తున్న తెలుగు రచనలలో దొర్లుతున్న తప్పులను, భాషాపరమైన దోషాలను సరిచేసే దిశగా ఆన్లైన్ వేదికగా భాషా నిపుణులతో చర్చలను, ఇంటరాక్టివ్ సెషన్స్‌ను, నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు పెరిగింది.
తెలుగు భాషలో రెండంచెల వ్యూహం
అలాగే డిజిటల్ సోషల్ మాధ్యమాలలో రాయడానికి కావలసిన ఫాంట్, యూనికోడ్, ఇతర సాంకేతిక ఉపకరణాల గురించిన అవగాహనను, తెలుగు సమాచారాన్ని, ఇంగ్లీష్‌లోకి ఇతర భాషలలోకి సులభంగా భాషాంతరీకరణ చేయడానికి అనువుగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నవ్య సాంకేతికతను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం భాషా సాంస్కృతిక శాఖ వికీమీడియన్ ఆదిత్య పకిడె సారధ్యంలో 26 మార్చి, 2022న రవీంద్రభారతిలో అవగాహనా సదస్సును నిర్వహించి నూతన యువ రచయితలకు ఎన్నెన్నో మెళకువలను నేర్పించడంలో సక్సెస్ అయింది. ఇలా ఇంటెర్నెట్ డిజిటల్ వేదికలలోకి తెలంగాణా అంశాలను తెలుగు భాషలో వ్యాప్తి చేయడం కోసం రెండంచెల వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తుండటం గమనించవచ్చు. 1) సమాచారాన్ని నిక్షిప్తంచేయడం (అప్ లోడింగ్, పోస్టింగ్), 2) ఎడిటింగ్, విస్తరణ. ఆన్లైన్ వేదికగా ఇప్పటి వరకు తెలుగు భాష, సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై తగినంత సమాచారం నిక్షిప్తమై లేకపోవడం వల్ల మొదట ఈ అంశాలను, సమాచారాన్ని అప్ లోడ్ / పోస్టింగ్ చేయడం మీదనే కేంద్రీకరించారు. రెండో దశలో, నిక్షిప్తమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంభవించే తాజా పరిణామాలను అనుసరించి అప్డేట్ చేయడం, మార్పులు చేయడం, విస్తరించడం జరుగుతోంది. అయితే సమాచారాన్ని నిక్షిప్తం చేయడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కనుక ఈ రెండు దశలు ఏకకాలంలో కొనసాగడం అవసరం. ఇలా తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన ఈ ఎనిమిదేండ్ల కాలం నుంచీ తెలంగాణా భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, పురోగతిలపై డిజిటల్, సామాజిక మాధ్యమాలు, బ్లాగ్లు, యూట్యూబ్, వెబ్ సైట్ లలో నిక్షిప్తం చేస్తున్న సమా చారం సాధికా రికంగా, కచ్చి తత్వంగా ఉండేలా చర్యలు తీసు కోవడం ఉంటు న్నది. అయితే ఈ కృషి నిరంతరం కొనసాగాల్సి ఉంది.
విజ్ఞాన సర్వస్వం 'వీకీపీడియా'
అలాగే ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన సమాచారానికి సంబంధించి ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వంగా పేరెన్నికగన్నది వికీపీడియా. వికీపీడియా తెలుగు విభాగంలో తెలంగాణాకు సంబంధించిన ఎన్నెన్నో వ్యాసాలను రచించే బాధ్యతను భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా డిజిటల్ మీడియా స్వీకరించి తెలుగు వికీపీడియన్ల కోసం ప్రత్యేక సదస్సులను ఏర్పాటు చేసింది. అలా 2021 డిసెంబర్ 19న తెలుగు వికీపీడియా వార్షికోత్సవం, జన్మదిన వేడుకలను, ఆ తర్వాత 2022 ఏప్రిల్ 24న, మళ్ళీ మే 29, 2022న వికీ పీడియన్లతో సమావేశాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించి, ఎప్పటికప్పుడు తెలంగాణా అంశాల రచనలపై జరుగుతున్న పురోగతిని సమీక్షించి, ముందుకు వెళుతోంది. ప్రపంచ రికార్డు సృష్టించిన వికీపీడియన్ ప్రణరురాజ్ వంగరి, సంతోష్ పవన్‌ల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడమే కాక, ప్రస్తుతం తెలంగాణాకు సంబంధించిన సమస్త సమాచారం వేలాది వ్యాసాల రూపంలో అత్యధికంగా తెలుగు వికీపీడియాలో నిక్షిప్తమై ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.
'ఈబుక్స్' పై ఆసక్తి
ఈ పరిణామాన్ని ముందుగానే గుర్తించిన భాషా సాంస్కృతిక శాఖ నెటిజెన్లు, యువ నెట్ రచయితల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను 2018లోనే ఏర్పాటు చేయడం ప్రారంభించింది. భవిష్యత్ తరాలలో ఆన్లైన్ చదువులు, ఈ-బుక్స్ పఠనం పెరుగుతుందనే అంచనాతో డిజిటల్ మాధ్యమాలలో ''తెలంగాణ సాహిత్యం-కళలు-సంస్కృతి-పండుగలు'' అనే పేరిట రెండు రోజుల రాష్ట్రస్థాయి సదస్సును రవీంద్రభారతిలో నిర్వహించింది. 2018 అక్టోబర్ 12, 13 తేదీలలో ఎంపిక చేసిన యువ రచయితల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో వివిధ సోషల్ మీడియాలలో వేర్వేరు రచనలు, సాహితీ ప్రక్రియలలో తెలంగాణా కవిత్వం, సాహిత్యం, కళలు, సాంస్కృతిక విశేషాలు, పండుగలు, జాతరలు వంటి అంశాలపై తగిన సమాచారాన్ని రచయితలకు అందజేసి, వాటిని డిజిటల్ మాధ్యమాలలో, సోషల్ మీడియాలో నిక్షిప్తం చేసే చర్యలు చేపట్టారు. నిజానికి డిజిటల్ మాధ్యమాలలో, ఆన్లైన్లో తెలంగాణా చరిత్ర, సంస్కృతి, ప్రదేశాలు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాలు, వాస్తు శిల్పం వంటి అంశాల మీద తగినంత సమాచారం అందుబాటులో లేదు. ఈ లోపాన్ని భర్తీ చేయడంలో ఈ సదస్సు విజయవంతం అవడమేకాక, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన అన్ని పుస్తకాలను, కాపీరైట్ నియమాలను సడలిస్తూ వాటిలోని సమాచారాన్ని డిజిటల్ మాధ్యమాలలో ప్రచురించే వీలును కల్పించడం జరిగింది. దాని వల్ల అప్పటి వరకూ అంతగా తెలియని తెలంగాణాకు సంబంధించిన ఎంతో అరుదైన, విలువైన సమాచారం డిజిటల్ రూపంలోకి నిక్షిప్తమైంది.
'కరోనా' నేర్పిన పాఠం
ఇదే సందర్భంలో 2020 నుంచి 2022 వరకూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా విలయతాండవాన్ని కూడా ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఈ కాలంలో ప్రజలందరూ గృహాలలోనే ఉండటం, నవతరం సాఫ్ట్వేర్ ఉద్యోగులు ''వర్క్ ఫ్రం హోం'' లో ఉండటం వల్ల, సాధారణంగా జరిగే వ్యాపకాలు, పనులు అన్నీ స్తంభించిపోవడం వల్ల తమ ఖాళీ సమయాన్ని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా గడిపారు. దీని వల్ల తెలుగులో విస్తారమైన రచనలు, సాహిత్యం, భాషా విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ధోరణి తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకు ఒకింత మేలు చేసిందనే చెప్పాలి. అయినప్పటికీ అనివార్యంగా కొన్ని సమాచార దోషాలు, భాషా దోషాలు, వాక్య దోషాలు ఆన్ లైన్ వేదికలలో దొర్లుతూ వస్తుండటాన్ని గమనించవచ్చు. సరైన రచయితలు, ఎడిటింగ్ చేయగల నిపుణుల కొరత వల్ల ఈ తప్పులను సవరించడంలో ఆలస్యం జరుగుతోంది. అలాగే ఈ రచయితలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారు, నిత్య జీవితంలో వేర్వేరు ఉద్యోగ వ్యాసంగాలలో కొనసాగుతున్న వారు కావడం వల్ల పూర్తి స్థాయిలో ఈ దిశగా కృషి చేయలేక పోతున్నారు. మరో వైపున ఈ స్వచ్ఛంద రచయితలు చేస్తున్న కృషిని, సమన్వయం చేసి, మార్గదర్శకత్వం చేసే నిర్ధిష్ట యంత్రాంగం కూడా ఏర్పాటు కావలసి ఉంది. ఇది లేకపోవడం వల్ల ఇప్పటివరకు జరిగిన కృషి ఎంత అనేది అంచనాకు అందకుండా పోతున్నది. అయినప్పటికీ డిజిటల్ మాధ్యమాలలో జ్ఞాన సమాచార నిక్షిప్తాన్ని ఒక బృహత్ కార్యంగా భావించి, నిత్య యజ్ఞంలా నెటిజనులు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది తెలుగు భాషకు, సాహిత్యానికి, తెలంగాణాకు చేస్తున్న సేవగా భావించవచ్చు. ఇలాంటి చర్యలు పూర్తిగా ప్రయోజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా, తెలుగు భాష వ్యాప్తికి దోహదంగా ఉంటున్నాయి. ''అలాగే ఫాంట్ లు'', యూనికోడ్ విషయంలో కూడా టెక్నికల్ అంశాలు మరింత సరళతరం కావడం వల్ల తెలుగులో రాద్దామని అనుకునే ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువతకు ఒక నవ మార్గదర్శనంగా ఉండి భవిష్యత్ తరాలకు విలువైన 'సమాచారనిధి'ని అందించడం ఇప్పుడు సాధ్యమవుతున్నది. దీనివల్ల ఇప్పుడు తెలుగు భాష గృహాలకు, రచ్చబండలకు, జనావాసాలకు, కూడలులకు మాత్రమే పరిమితం కాక, వర్చువల్ ప్రపంచంలో, సోషల్ మీడియాలో కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, భవిష్యత్తులో కూడా తెలుగు భాష చిరంజీవిగా నిలుస్తుందనే ఆశను బలోపేతం చేస్తున్నది.
- మామిడి హరికృష్ణ
కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి
సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ