Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సంవత్సరం బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం. స్వాతరత్య్ర పోరాట మలి దశ చరిత్ర, ప్రత్యేకించి రాజ్యాంగ పరిషత్ చర్చల గురించిన తాజా అధ్యయనాలు ఆధునిక భారతీయత నిర్మాణంలో బాబా సాహేబ్ అంబేద్కర్ పాత్రను మళ్లీ మదింపు చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయి.
అంబేద్కర్ గురించి అనేక వ్యాఖ్యానాలు, పరిచయాలు, ఉటంకింపులూ ఉన్నాయి. ప్రధానంగా అణగారిన తరగతులు, ప్రత్యేకించి దళితులు అందునా ఈ మధ్య కాలంలో ఎదిగి వచ్చిన దళిత మధ్యతరగతి అంబేద్కర్‌ను తమ ప్రతినిధిగా చూసుకుని మురిసిపోతోంది. తప్పేమీ కాదు. సమాజంలో పైకెదగాలని ప్రయత్నించే ఏ వర్గమైనా, తరగతి అయినా తమ దారి సులభతరం చేయటానికి కృషి చేసిన ముందు తరాల వారిని ఆత్మాభిమాన చిహ్నాలుగా ప్రదర్శించుకోవటం, 21వ శతాబ్దిలో అస్తిత్వ ఉద్యమాల మౌలిక లక్షణం. కానీ అంబేద్కర్ గురించిన ఈ రకమైన చిత్రీకరణ, చిహ్నీకరణ నిజానికి అంబేద్కర్ సాగించిన విశాలమైన కృషినీ ఆయన వ్యక్తిత్వాన్నీ మసకబారుస్తుందని చెప్పకతప్పదు.
నేటి భారతం ఓ చారిత్రక సంధ్య ముంగిట్లో ఉన్నది. ఈ సంధ్య రేపటి పొద్దుకు వెదజిమ్మాల్సిన వెలుగు రేఖలు పోగేసుకుంటుందా లేక సుదీర్ఘమైన చీకటి రాత్రులను దేశం ముందు పరుస్తుందా అన్న సందేహం అందరి మెదళ్లల్లో మొగ్గెత్తుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ జయంతి జరుపుకోవటం అంటే ఆయన గురించి, ఆయన కృషి గురించీ ఉన్న సాంప్రదాయక అవగాహన నుండి వైదొలగి, వర్తమాన పరిణామాల నేపథ్యంలో ఆయన కృషిని పున:సమీక్షించుకోవాల్సి వస్తోంది.
ఆధునిక ప్రజాతంత్ర భారత నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అద్వితీయం. అల్పసంఖ్యాక వర్గాల హక్కుల కోసం రాజ్యాంగ పరిషత్ వేదికగా ఆయన సాగించిన పోరాటం అసామాన్యమైనది. రాజ్యాంగం గురించి మాట్లాడుకునేటప్పుడు పీఠిక గురించి చెప్పుకోకుండా ఉండలేం. 81 పదాల సముదాయమైన రాజ్యాంగ పీఠిక దాన్ని ఆమోదించుకునే నాటికి ప్రపంచంలోని అత్యుత్తమైన మానవ విలువలు, ప్రజాతంత్ర హక్కులు, అవకాశాలను ఉల్లేఖిస్తోంది. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గురించి కొనియాడటం కొత్తేమీ కాదు. ఆయన ముసాయిదా రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ పరిషత్ కమిటీకి అధ్యక్షుడుగా ఉన్నాడనీ, రాజ్యాంగాన్ని అక్షరబద్ధం చేసిన బృందానికి ఆయన నాయకుడనీ మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే అంబేద్కర్ కారణంగానే నేడు భారతదేశంలో అమలు జరిగే రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత దక్కిందన్నది కూడా వాస్తవం. కానీ అంబేద్కర్ నిజమైన ప్రతిభను అర్థం చేసుకోవాలంటే కేవలం రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించటం వరకే చూస్తే సరిపోదు.
భారత రాజ్యాంగాన్ని ఎవరు ఎందుకు చదువుతున్నారు అన్నదాన్ని బట్టి రాజ్యాంగం ఆయా వర్గాలకు, తరగతులకు ఆ విధంగా దర్శనమిస్తోంది. రాజ్యాంగాన్ని పాలకవర్గం తన కళ్లద్దాల నుండి చూస్తే పక్కా బూర్జువా వ్యవస్థ మనుగడకు కావల్సిన వ్యక్తిగత ఆస్థిహక్కుకు పెద్ద పీట వేసినదిగా కనిపిస్తోంది. అదే దళితుల కోణంలో చూస్తే రిజర్వేషన్లకు పెద్ద పీట వేసిన రాజ్యాంగంగా కనిపిస్తోంది. కానీ విశాల ప్రజానీకర కళ్లతో చూస్తే ప్రాధమిక హక్కులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాధాన్యత కనిపిస్తోంది. రాజ్యాంగానికి ప్రాధమిక హక్కుల భాగం గుండెకాయ వంటిది. అందుకే రాజ్యాంగంలోని ఏ భాగంతోనైనా పాలకపపక్షాలూ, వర్గాలూ ఆడుకోవచ్చని మనకు కనిపిస్తోంది. అనిపిస్తోంది.
కానీ నిజానికి అంబేద్కర్‌ను ఏ ఒక్క వర్గానికో పరిమితం చేయబోయే ముందు రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన పాత్రను, దాని చారిత్రక నేపధ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాలకు రాజ్యాంగం ఎటువంటి భరోసా కల్పించాలన్న అంశంపై అంబేద్కర్ అవగాహనను అర్థం చేసుకోవాలి. దీనికి గాను అంబేద్కర్ రాసిన స్టేట్ అండ్ మైనారిటీస్ గ్రంధాన్ని తప్పక చదవాలి. ప్రత్యేకించి నేడు భారతదేశం ప్రయాణిస్తున్న దారిలో నిల్చున్నప్పుడు భారతీయ సమాజానికి అంబేద్కర్ అందించిన సేవలను అర్థం చేసుకోవడానికి ఈ గ్రంధం మరింత దారిదీపంగా నిలుస్తుంది.
స్టేట్ అండ్ మైనారిటీస్ అన్న రచనను వెలువరించటానికి ముందు ఇదే పత్రాన్ని ప్రాధమిక హక్కుల అడ్వయిజరీ కమిటీకి, మైనారిటీలు, ఆదివాసీలు, విస్మృత ప్రాంతాలకు కల్పించాల్సిన రక్షణల గురించి అధ్యయనం, ప్రతిపాదనలు చేసే రాజ్యాంగ ఉపసంఘానికి అంబేద్కర్ సమర్పించారు. ఈ రెండు కమిటీలు అంబేద్కర్ ప్రతిపాదించిన పత్రాన్ని స్వీకరించి రాజ్యాంగంలో పొందుపర్చటానికి సిద్ధపడలేదు. అయినా వెరవని అంబేద్కర్ ఏకంగా ఓ పుస్తక రూపంలో ప్రచురించి దేశవ్యాప్త చర్చకు తెరతీశారు. అఖిల భారత షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం శీర్షికలో కనిపించినంత వరకే చూస్తే ఇదేదో దళితులకో మైనారిటీలకో సంబంధించిన అంశంగానే పొరపాటుపడే అవకాశం ఉంది. కానీ ఈ పుస్తకానికి రాసిన పీఠిక ''భారతీయులమైన మేము'' అన్న మకుటంతో మొదలువుతుంది. ఈ పీఠికను కొనసాగిస్తూ అంబేద్కర్ ''మా అభివృద్ధికి అవసరమైన సుపరిపాలన, స్వపరిపాలను అందించుకునేందుకూ, స్వేఛ్చా స్వాతంత్య్రాలూ, సంతోషం, వాక్స్వాతంత్య్రం, మతపరమైన స్వేఛ్చను ప్రసాదించుకోవటానికీ, అణగారిన వర్గాలకు మెరుగైన అవకాశాలు అందించటం ద్వారా సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు తొలగించటానికీ, భయం, ఆకలి, కొరతల నుండి ప్రజలందరికీ స్వేఛ్చను ప్రసాదించటానికి'' నూతన రాజ్యాంగం లక్ష్య నిర్దేశం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ లోతులు గమనించినప్పుడు అంబేద్కర్ అందరివాడే తప్ప ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు కొందరివాడు కానేకాదని స్పష్టమవుతుంది.
అప్పటి వరకూ సమాజంలో సమాన హక్కులు అవకాశాలు పక్కన బెట్టి కనీసం సాటి వ్యక్తులుగా పౌరసమాజం చేత గుర్తింపు పొందని వారికి సాధ్యమైనంత మెరుగ్గా హక్కులు కల్పించటమే కాక, ఆయా హక్కులు ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడకుండా నేరుగా రాజ్యాంగ హక్కులుగా మార్చటానికి అంబేద్కర్ అనుసరించిన ఎత్తుగడల రీత్యా ఆయన్ను తరచూ మిగిలిన సామాజిక తరగతులు అపార్థం చేసుకోవడానికి అవకాశమిచ్చింది. అంబేద్కర్ పట్ల రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులకు ఉన్న వ్యతిరేకత కూడా సాధారణ ప్రజలూ అంబేద్కర్‌ను అపసవ్య దృష్టితో చూడటానికి కారణమైంది.
తొలిసారి 1970 దశకంలో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం శరద్ పవార్ నాయకత్వంలో అంబేద్కర్ సంకలనాలను వెలువరించే ప్రయత్నం ప్రారంభించటంతో అంబేద్కర్ సారస్వతం గురించి ఆసక్తి, పరిశోధనలూ మళ్లీ మొదలయ్యాయి. 21 వ శతాబ్దంలో అస్తిత్వ ఉద్యమాలు విస్తరించటంతో అంబేద్కర్‌ను హక్కుల ప్రతీకగా చూసే యువతరం పరిశోధకుల కొత్త చూపు మొదలైంది. ఆయన అవగాహన నిరంతరం ఇచ్చిపుచ్చుకునే వైఖరితో ముందుకు సాగింది. మొండిగా తాను చెప్పింది ఒప్పుకుంటేనే ముందడుగు లేదంటే పలాయనం అన్న వైఖరితో ఎన్నడూ అంబేద్కర్ వ్యవహరించలేదు. మెరుగైన సామాజిక లక్ష్యాలు సాధించటానికి నెహ్రూ, పటేల్ సంవాదంలో అనేక సందర్భాల్లో అంబేద్కర్ ఓ మెట్టు దిగి వ్యవహరించారని రాజ్యాంగ పరిషత్ చర్చలు అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. తాను ఎవరికైతే ప్రాధమిక రక్షణలు కల్పించాలని, దానికి రాజ్యాంగాన్ని సాధనంగా వాడుకోవాలని తలంచాడో ఆయా వర్గాలు, ప్రజల పట్ల అంబేద్కర్‌కు ఉన్న నిబద్ధత చిత్తశుద్ధి కొన్ని విషయాల్లో ఆయన్ను రాజీపడేలా చేశాయి.
ముసాయిదా రాజ్యాంగానికి దిశా నిర్దేశం చేస్తూ జవహర్ లాల్ నెహ్రూ 1947 జూలై 18 రాజ్యాంగ పరిషత్‌లో మాట్లాడుతూ ''రాజ్యాంగ పరిషత్ వచ్చే సమావేశాల్లో చర్చించటానికి కావల్సిన ముసాయిదా రాజ్యాంగ ప్రతిని రూపొందించేందుకు ఓ డ్రాఫ్టింగ్ కమిటీని నియమించాలని ప్రతిపాదిస్తున్నాను. రాజ్యాంగ లక్ష్య నిర్దేశ పత్రంలోనే పీఠిక గురించి కూడా ప్రస్తావన ఉన్నది. రాజ్యాంగ ముసాయిదా మలి ప్రతిలో పీఠికను కూడా పొందుపర్చాల్సి ఉంది. అయితే లక్ష్య నిర్దేశ పత్రంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈ మార్పులు మూల సారాంశానికి భంగం కలగకుండా చేయాలి'' అని ప్రతిపాదించారు. ఈ మేరకు 1947 ఆగస్టు 29న డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైంది. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, బి.ఆర్.అంబేద్కర్, మరియు కె.ఎం.మున్షిలు కూడా డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కమిటీ తన తొలి సమావేశంలోనే అంబేద్కర్‌ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నది.
రాజ్యాంగ పీఠిక గురించి చర్చించటానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ ముందుకు మూడు సార్లు చర్చకు వచ్చింది. అంతిమంగా ఫిబ్రవరి 21, 1948న జరిగిన సమావేశంలో ''భారతీయులమైన మేము...'' అన్న మకుటంతో ఉన్న పీఠిక రాజ్యాంగ పరిషత్ ఆమోదానికి సిద్ధమైంది. ఈ పీఠికలోనే భారతీయులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, విశ్వాసాలు, మతారాధాన విషయంలో స్వేఛ్చ, హౌదాల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వం అందించటం, భారతీయుల మధ్య సోదరభావాన్ని పెంపొందించటం లక్ష్యంగా రాజ్యాంగం పని చేస్తుందని, ఈ రాజ్యాంగాన్ని భారతీయులమైన మేము మాకు మేమే సమర్పించుకుంటున్నామని చెప్పబడింది.
సాధారణంగా పీఠికలోని లక్ష్యాలు, ముందుచూపు, ప్రజాతంత్ర లక్షణం, స్వభావం రీత్యా అప్పటి వరకూ కాంగ్రెస్‌లోనే ఈ ధోరణులకు ప్రతినిధిగా నిలిచిన నెహ్రూయే పీఠికకు కర్త అని భావించబడుతూ ఉండేది. నిజానికి పీఠిక అంబేద్కర్ విరచితమని తెలిసినవారు బహు కొద్ది మాత్రమే. ఈ విషయాన్ని రూఢ పర్చుకోవడానికి అంబేద్కర్ రాసిన స్టేట్ అండ్ మైనారిటీస్ గ్రంధంలోని ముందుమాటను, తర్వాత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ప్రతిపాదించిన పీఠిక పాఠాన్ని పోల్చి చూడవచ్చు. రాజ్యంగ లక్ష్య నిర్దేశ పత్రం ద్వారా నెహ్రూ స్థూలంగా రాజ్యాంగానికి దిశ, దశ నిర్దేశించిన మాట వాస్తవమే అయినా నేటి భారతీయులందరూ అనుభవిస్తున్న హక్కులను పీఠికలోనే పొందుపర్చటంలో మాత్రం అంబేద్కర్ చేసిన పోరాటం కారణం అన్నది చరిత్ర కాదనలేని సత్యం.
తర్వాతి కాలంలో రాజ్యాంగ పీఠిక కూడా రాజ్యాంగపు మౌలిక లక్షణాల్లో ఒకటనీ, పీఠికను సవరించటం అంటే రాజ్యాంగ మౌలిక లక్షణాలనూ, స్వభావాన్నీ సవరించటమేనని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. నేడు ఇదే రాజ్యాంగపు మౌలిక లక్ష్యాలు, లక్షణాలూ ప్రశ్నార్ధకమవుతున్నాయి. వాక్స్వాతంత్య్రం, మత స్వాతంత్య్రం, సమాన హక్కులు, అవకాశాలతో కూడిన ఆధునిక భారత నిర్మాణం కలగా మిగిలిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన న్యాయ వ్యవస్థ కూడా పాలకవర్గం చేతుల్లో బందీ అవుతున్న సందర్భాలు గత దశాబ్ద కాలంలో కోకొల్లలు.
విమర్శ లేనిదే సత్యనిరూపణ జరగదు. విమర్శను స్వీకరించటానికి సిద్ధం కాని నాయకుడూ పాలకుడూ ఎక్కువ కాలం చరిత్రలో ఏలుబడి సాగించిన సందర్భాలు చరిత్రలో లేవు. పరిస్థితులు అనుకూలించో, ప్రగతి శీల శక్తులు తమ బలాన్ని బలగాలన్నీ సమీకరించుకోవటంలో పొరపాటు పడితేనో, ఏమరుపాటుకు గురైతేనో అటవంటి సందర్భాల్లో మాత్రమే దుర్మార్గపు పాలకులు ఏలుబడి సాపేక్షంగా దీర్ఘకాలం మనుగడ సాగిస్తుంది. అంతమాత్రాన వందల ఏళ్లు పరిపాలించిన రాజ కుటుంబాలు సైతం చివరకు అంతర్గత బాహ్య శక్తుల తిరుగుబాట్లకు బలయ్యాయి. చరిత్రలో నాజీ నియంత హిట్లర్ అధికారానికి వచ్చినంత తేలిగ్గా ఏ నియంతా అధికారానికి రాలేదు. నాజీ పాలనకు సోపానంగా మారిన పార్లమెంటరీ వ్యవస్థలను దుంపనాశనం చేయటంలో హిట్లర్ వ్యవహరించినంత తెంపరితనంతో ఏ నియంతా వ్యవహరించలేదు. అయినా ప్రజాస్వామిక వ్యవస్థలు బలం పుంజుకున్న తర్వాత, అదే జర్మనీ దాదాపు నాజీ వ్యవస్థను నామరూపాలు లేకుండా చేయటానికి చేయని ప్రయత్నం లేదు.
అయినా అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, మధ్యయుగాల తరహాలో మతం పాలకవర్గం చేతుల్లో సాధనంగా మారుతున్న తీరు, భారతీయులు తమ దేశాన్ని అంబేద్కర్ ఊహించిన ప్రజాస్వామిక ప్రజాతంత్ర దేశంగా నిలుపుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటానికి తెరతీయాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. అయితే ఈ నవ భారత నిర్మాణ పోరాటంలో అంబేద్కర్ సార్వత్రిక హక్కుల స్పూర్తిగా నిలుస్తాడు. కొందరివాడుగా కాక అందరివాడుగా ముందుకొస్తాడు. ఆధునిక ప్రజాతంత్ర భారత నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నెహ్రూ దార్శనికత, అంబేద్కర్ నిబద్ధత, కమ్యూనిస్టుల కార్యాచరణ మేళవించుకుని ముందుకు సాగే మహౌద్యమ నిర్మాణానికి నడుం కట్టాల్సి వస్తుంది.
అంబేద్కర్‌ను ఆకాశానికెత్తేందుకు సిద్ధమవుతున్న పాలకవర్గాలు, అంబేద్కర్ ఆశయాలను పాతాళానికి తొక్కేయకుండా, అంబేద్కర్ ఆశించిన ప్రజాతంత్ర భారత నిర్మాణాన్ని కాలదన్నకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదులందరిపైన, ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులపై ఉన్న ఉమ్మడి బాధ్యత. తమ మధ్య ఉన్న అంతరాలను అపార్ధాలను తొలగిస్తూ ఈ శక్తులు చేతులు కలపాల్సిన సమయం ఇది. ఈ చారిత్రక బాధ్యతను విస్మరిస్తే అంబేద్కర్ విగ్రహాలు ఆకాశాన్ని చుంబిస్తూనే ఉంటాయి. కానీ ఆయన ఆశయాలు మాత్రం పాతాళపు లోతుల్లో పాతిపెట్టబడుతూ ఉంటాయి.
- కొండూరి వీరయ్య,
9871794037