Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా పూర్వం రంగాపురం అనే గ్రామంలో రామయ్య అనే వర్తక వ్యాపారి నివసించేవాడు. అతనికి ఒక్కగానొక్క కుమారుడు రాజు, అదే గ్రామంలోనే బడికి వెళ్ళేవాడు. కొడుకును బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలని రామయ్య కోరిక. చదువుతో పాటు వ్యాపారంలో మెళకువలు నేర్పించి, బాగా డబ్బు సంపాదించే మార్గాలను కూడా కుమారునికి చెప్పేవాడు. రామయ్య వర్తక వ్యాపారమే కాకుండా డబ్బు అధిక వడ్డీలకు ఇచ్చి ప్రతి నెల వసూలు చేసేవాడు. ఇతను చాలా పట్టుదల గల మనిషి, సహాయం చేసే గుణం కాదు.
చుట్టుపక్కల గ్రామాల్లోకెల్లా రామయ్య పెద్ద షావుకారు. భార్య లక్ష్మీ గహిణి. రామయ్య వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు ఇంటి ఖర్చులకు గాను, భార్యకు తగు పైకం ఇచ్చి వెళ్ళేవాడు. అది దినుసులు వేసే డబ్బాలో దాచుకునేది. ఒకరోజు దాచిన డబ్బులు పోయాయని భర్తతో చెప్పింది లక్ష్మీ. అన్ని చోట్లా వెదికిన దొరకలేదు. బయటి నుంచి ఎవరు వచ్చినా వసారాలో నుంచి అటే వెళ్ళేవారు. తప్పిదం మనలోనే వుంటుందిలే అనుకుని వదిలేసారు.
మరొకసారి కూడా ఇలానే డబ్బు పోవడం వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది. ''అసలు మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, డబ్బులు ఎవరు తీసుకున్నారు'' అంటూ అయోమయంలో పడ్డాడు రామయ్య.
''ఎవరు వచ్చినా బయటే వుండి పలకరించి వెళతారు, లోపలికి ఎవరూ రారు కదా'' అనుకున్నారు.
ఒకరోజు రాజుకు పాఠాలు చెప్పే మాస్టారు రామయ్య ఇంటికి వచ్చాడు. ఎన్నడూ రాని మాస్టారు వచ్చేపాటికి రామయ్య మంచి మర్యాదలు చేసి వచ్చిన విషయం అడిగాడు
''మీ అబ్బాయి ఈ మధ్య బడికి రోజూ ఆలస్యంగా వస్తున్నాడు, ఎందుకు ఆలస్యమని అడిగితే సమాధానం చెప్పడు'' అన్నాడు మాస్టారు.
''రాజు.. ఎందుకు బడికి ఆలస్యంగా వెళుతున్నావు, ఇంట్లో నుండీ సరైన సమయానికే బయలుదేరుతున్నావు కదా'' అంటూ అడిగింది లక్ష్మీ, రాజు మౌనంగా వుండిపోయాడు.
ఆ రోజు గట్టిగా మందలించి వదిలేసారు, ఐనప్పటికి కూడా బడికి ఆలస్యంగానే వస్తున్నాడని మరోమారు పిర్యాదు చేసాడు మాస్టారు.
కొడుకు బెంగ ఒక పక్క, ఇంట్లో అందరూ వుండగానే దాచుకున్న డబ్బు ఎవరో ఎత్తుకెళ్తున్నారని మరో బెంగ, ఈ రెండు నమ్మశక్యం కానివే.. కానీ నమ్మాల్సిందే.. డబ్బు ఎలా పోతోందో కనుక్కోవాలని, రామయ్య కొద్ది రోజులు వ్యాపారానికి వెళ్ళడం మానేసాడు, ఈ సారి డబ్బు దినుసులు డబ్బాలో కాకుండా పెట్టెలో దాచింది లక్ష్మీ. ఆ పెట్టెలో దాచిన డబ్బుల్ని కుమారుడు రాజు దొంగలిస్తుంటే చూసింది లక్ష్మీ.. తన కళ్ళును తానే నమ్మలేకపోయింది. ఇన్నాళ్లూ డబ్బులు దొంగలిస్తున్నది మన కుమారుడేనని భర్తతో కూడా చెప్పింది.
''కొడుకు ప్రయోజకుడు అవుతాడనుకుంటే, దొంగ అయినాడు, దొంగతనం చేస్తున్నాడంటే, వీడు ఏదో చెడు వ్యసనానికి అలవాటు పడ్డాడు, అందుకే బడికి కూడా ఆలస్యంగా వెళుతున్నాడు, వీడి తంతు కనిపెట్టాలి'' అనుకున్నాడు రామయ్య.
ఆ రోజు ఉదయాన్నే రాజుకు కానకుండా.. రామయ్య, లక్ష్మీ ఇద్దరూ వెనుకనే వెళ్ళారు. రాజు బడికి వెళ్ళకుండా నేరుగా ఒక దేవాలయం వద్దకు వెళ్ళాడు, అక్కడున్న బిచ్చగాళ్ళను చేరదీసి, తలా ఒక్కరికి తన దగ్గర వున్న కాసులు పంచడం చూసి రామయ్య నివ్వెరబోయాడు.
చెంతకు వెళ్ళి ''ఏంటి నాయనా ఇది'' అన్నాడు రామయ్య.
''మనిషిగా పుట్టినందుకు నేను చేస్తున్న న్యాయం. ఇది జనాల వద్ద అధిక వడ్డీలతో సంపాదించిన అల్ప సొమ్ము, అందుకే ధర్మంగా అనాధలకు, దివ్యాంగులకు, అందులకు పంచుతున్నాను. సాటి పేద మనిషిని బతికించడం కోసం, ఇలా చేయడం కూడా న్యాయమే అని నా మనసు చెప్పింది'' అంటూ బడికి వెళుతున్న కుమారున్ని చూసి ''అబ్బాయి ప్రయోజకుడైనాడు లక్షీ..'' అంటూ చాలా సంతోషపడ్డాడు రామయ్య.
బడికి ఆలస్యంగా ఎందుకు వస్తున్నాడో తెలిసాక మాస్టారు రాజును మెచ్చుకున్నాడు.
- నరెద్దుల రాజారెడ్డి
సెల్: 9666016636