Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తటస్థంగా ఉన్న జీవనతటాకాన్ని
అల్లరిఅలలై కదిలిస్తారు,
బండలా ఉన్న కొండలాంటి మనసును
చల్లని మంచులా కరిగిస్తారు,
దట్టంగా చుట్టేసిన మబ్బులను
రెక్కల పరుగులతో బయటికి నెట్టేస్తారు!
ఉక్కిరిబిక్కిరి చేసే ఊపిరికి
మళ్ళీ మళ్ళీ ప్రాణం పోస్తారు,
యంత్రంలా సాగే ప్రయాణాన్ని
అర్థవంతం చేస్తారు,
తడిగా ముడుచుకుపోతే
నిప్పురవ్వలై చురుక్కుమంటారు,
ఎడారిగా నిస్తేజమైపోతే
చినుకులై మొలకెత్తిస్తారు,
అడివిలాంటి జీవితంలో
మల్లెలై వికసించి మకరందమౌతారు!
వాళ్ళ అందమైన అలకలు
కోపాన్ని ఎత్తుకుపోయే సీతాకోకలు,
చీకటి జీవితంలో వెలిగే నక్షత్రాలు
విశ్వంలో విహరించే సూర్యచంద్రులు,
పసితనాన్ని పంచిపెట్టి
వయసును మరిపించే శక్తిప్రదాతలు!
వారి అడుగుల అలికిడి లేనిది
ఏ ఇంటి వాకిలీ నిద్ర లేవదు,
వారి రాగాలు వినని ఏ హదయమూ
నవరసాలను పండించలేదు!
ప్రపంచం ఎలా నడవాలో
పసితనాన్ని చూసి నేర్చుకోవాలి,
జీవితాన్ని ఎలా బతికించాలో
పసిమనసును చూసి నేర్చుకోవాలి!
- పుట్టి గిరిధర్
9491493170