Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడబ్ల్యూసీ ఇండియా వెల్లడి
న్యూఢిల్లీ : డిజిటల్ వేదికలు, యాప్స్‌తో ఆర్థిక మోసాలు ఎక్కువ అవుతున్నాయని ఓ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. భారతదేశంలో జరిగిన అన్ని మోసాల సంఘటనలలో సగానికి పైగా సామాజిక మాధ్యమాలు, రిమోట్ వర్క్, ఇ-కామర్స్, డెలివరీ అప్లికేషన్స్, కాంటక్ట్‌లెస్ చెల్లింపులు, పిన్‌టెక్ వేదికలు తదితర వాటితోనే అధికంగా చోటు చేసుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా వెల్లడించింది. పీడబ్ల్యూసీ గ్లోబల్ ఎకనామిక్ క్రైమ్ అండ్ ఫ్రాడ్ సర్వే 2022 రిపోర్ట్ ప్రకారం.. డిజిటల్ వేదికల వల్లే 26శాతం పైగా భారతీయ సంస్థలు 1 మిలియన్ డాలర్లు (రూ.8.2 కోట్లు) మోసపోయాయి. 44శాతం మంది నేరస్తులు ఆర్థిక లాభం కోసమే మోసానికి పాల్పడ్డారని పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, కన్స్యూమర్ ప్రొడక్ట్స్, రిటైల్, విద్యా, వైద్యం తదితర విభిన్న రంగాలకు చెందిన 111 సంస్థలను సర్వే చేసినట్టు పీడబ్ల్యూసీ తెలిపింది.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ వినియోగదారులు, సంస్థలు వేగంగా కొత్త వేదికలను స్వీకరిస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా ఫోరెన్సిక్స్ సర్వీసెస్ భాగస్వామి పునీత్ గార్కేల్ అన్నారు. ''సగటున, ఒక భారతీయ కంపెనీ నేడు దాని సాధారణ వ్యాపార కార్యకలాపాలలో భాగంగా ఐదు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లతో పనిచేస్తుంది. ఈ-కామర్స్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, హోమ్ డెలివరీ మోడల్‌లు, రిమోట్ వర్కింగ్ ఆవిర్భావం, పలు ఆవిష్కరణలు మోసగాళ్ల ప్రవేశానికి మార్గాలను సులభతరం చేశాయి'' అని పునీత్ పేర్కొన్నారు. వీటి పట్ల అభివృద్ధి చెందుతున్న సంస్థలు అవగాహన కలిగి ఉండాలన్నారు. తమను తాము రక్షించుకోవడానికి మోసం నివారణ, గుర్తింపు వ్యూహాలలో తగినంతగా పెట్టుబడి పెట్టాలని సూచించారు. భారతదేశంలోని 10 ప్లాట్‌ఫారమ్ మోసాలలో నాలుగు అంతర్గత నేరస్థులచే జరిగినవేనని ఈ రిపోర్ట్ పేర్కొంది. బలమైన అంతర్గత నియంత్రణలు ఉంటే అన్ని ప్లాట్‌ఫారమ్ మోసాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ తగ్గించవచ్చని సూచించింది.