Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2020వ సంవత్సరం సంక్షుభిత కాలంగా మనముందు నుంచుంది. కోవిడ్-19 బాదితులకు జబ్బునో, మరణాన్నో పరిచయం చేసిన సంవత్సరం. ఉద్యోగాలు పొగొట్టుకున్న కోట్ల మంది ప్రజలకు జీవనాధారం కోల్పోయిన సంవత్సరం. ఇంటికే పరిమితమైన కోట్ల మంది బాల బాలికలకు మానసిక సమస్యలు కల్గించిన సంవత్సరం. అలాగే నియంత్రుత్వపు రాజ్యానికి వ్యతిరేకంగా నిలుచున్న ప్రజా సమూహాలు తమ సాహ సానికి చాలా ఎక్కువ ధర చెల్లించిన
సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక శాంతియుత ఉద్యమం ' పౌర సవరణ చట్టం' వ్యతిరేకంగా బయలు దేరితే, సంవత్సరాంతానికి రైతు ఉద్యమం రూపంలో మన కళ్ళముందుకు వచ్చింది.
ప్రజల నిరసనను ఎంత నల్ల చట్టాలైనా ఎంతోకాలం ఆపలేవు. కరోనా వైరస్ దాడి అటు పిమ్మట లాక్ డౌన్ విధింపు ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్షలాది మంది రైతులను ఢిల్లీ సరిహద్దులకు రాకుండా ఏ శక్తి అడ్డుకోలేక పోయింది.
ఘాజి పూర్ సరిహద్దు
నేను నా మిత్రులు స్వేచ్ఛా టి.వి తెలుగు యూట్యూబ్ చానల్ తరపున సందర్శించిన మొట్టమొదటి ప్రాంతం ఇది. దీన్ని ఢిల్లీ ఘాజీపూర్ సరిహద్దుగా పిలుస్తారు. రైతులను ఢిల్లీలోకి మరింతగా రాకుండా పోలీస్‌లు రక్షణ కంచెలను ఏర్పాటు చేసిన ప్రాంతం అది. బ్యారికేడ్ దిమ్మెలు, ముళ్ళతీగలు, క్రేన్లతో మాత్రమే ఎత్తగలిగిన ఇనుప దిమ్మెలు రోడ్డుకు అడ్డంగా పోలీసులకు, రైతులకు మద్య వేయబడ్డ ఆ ప్రాంతానికి చేరుకోవటం మాకు అంత సులభం కాలేదు. ఆ ప్రాంతానికి ఎవరిని రానివ్వకుండా పోలీస్‌లు అనేక వరుసలలో అడ్డంగా నిలుచోని ఉన్నారు. మా ట్యాక్సీ డ్రైవర్ అనేక సందుగొందుల గుండా తిప్పి మమ్మల్ని కిలోమీటర్ల పొడువున నిలిచి ఉన్న వాహన శ్రేణి వద్దకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకువెళ్ళ గలిగాడు.
రోడ్డుకి ఇరువైపుల వందల కొద్దీ ట్రాక్టర్లు, రోడ్డుమీద డేరాలు, ట్రాక్టర్లపై డేరాలు, ప్రతి డేరానిండా మనుషులు. ఒక్క క్షణం పాటు మనుషులు ఇలా ఎలా రోడ్లపై జీవిస్తారు. అన్న గగుర్పాటు కలిగింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది రైతులు ఆ ట్రాలీ ఇళ్లలోనే నెలల తరబడి ఉంటున్నారు. అక్కడ ఉన్న ఫ్లై ఓవర్ పేమెంట్ పైన చాపలు, పరుపులు పరుచుకొని అనేక మంది రైతులు కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిలో కొంతమంది నవంబర్ 26 నుండి అక్కడ ఉంటున్నవారే. మమ్మలను చూడగనే ఆప్యాయంగా చారు తాగి వెలుదురు గాని రండి అని ఆహ్వానించారు. తెలంగాణ నుంచి వచ్చామని తెలియగానే
తెలంగాణ సాయుద రైతాంగ పోరాటం మాకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని వారు చెప్పడం విశేషం. ఎంతకాలం ఇలా ఉంటారు ప్రభుత్వం మీ మాట వింటుందనుకుంటు న్నారా? అని ప్రశ్నించాం వారందరి సమాధానం ఒక్కటే ప్రభుత్వం విని తీరాల్సిందే అప్పటిదాక ఇక్కడనుంచి కదిలేది లేదు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేసిన ప్రభుత్వం మాకోసం ఈ మాత్రం చేయలేదా? అని కూడా వారు ప్రశ్నించారు.
మేము వెళ్ళేసరికి అక్కడ వున్న పోడియం వద్ద ఓ మహిళా రైతు ఆవేశ పూరితంగా ప్రసంగి స్తుండటం మా కంట పడింది. ఆ ట్రాక్టర్లు వరుస మధ్యలోనే ఒక టెంట్ లో ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం కనబడింది.
రోడ్డుమీద తాత్కలికంగా ఏర్పాటు చేసిన నీటిని శుద్ధిచేసే యంత్ర పరికరాలు కనబడ్డాయి. అనేక రైతు సంఘాల బ్యానర్లు, డిమాండ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. మేము వెళ్ళిన కాసేపటికే రాకేష్ తికాయత్ అక్కడికి చేరుకున్నారు. వందలాది మీడియా మిత్రులు ఆయనను చుట్టుముట్టారు. బ్యారికేడ్ల వద్ద నుంచి మీటింగ్ ప్రదేశానికి చేరుకోవడానికి, మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వడానికి, ఆయనకు గంటకు పైగా సమయం పట్టింది. మేము అక్కడే యువజన కాంగ్రెస్ వారు ఏర్పాటు చేసిన భోజన శాలలో మా లంచ్ ముగించుకొని మళ్ళి రైతులతో మాట్లాడేందుకు కదిలాము. 400 ట్రాక్టర్లతో బులందషేర్ ప్రాంతం నుంచి వచ్చిన రైతు సంఘనాయకులు డీ.పి.సింగ్ తో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నాం. అక్కడి రైతులకు ఇప్పుడు చేసిన మూడు వ్యవసాయ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలసు.
టెకీ సరిహద్దు
రెండవ రోజు మా బృందం టెకీ ప్రాంతంలో పర్యటించింది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద వున్న రైతుల సంఖ్య కంటే ఇక్కడ రైతుల సంఖ్య చాలా ఎక్కువ. 25 కిలోమీటర్ల పొడవున ట్రాక్టర్లలో రైతులు బారులు తీరి ఉన్నారు. ఇక్కడ హరియానాకు చెందిన జాట్ రైతులు, గుజ్జరులు ఎక్కువ. ఇక్కడ కూడా రైతులకు పోలీసులకు మద్య పలు అంచల బ్యారికేడ్ల దిమ్మెలు, ఇనుపకంచె కనిపించాయి మేము 'ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష సమితికి చెందిన ఒక టెంట్లో రైతులతో చాలా సేపు ముచ్చటించాము. భగత్ సింగ్ సమకాలీనలు కూడా ఒకరిద్దరు తారసపడ్డారు. ఇంటివద్ద మీ కోసం మీ బిడ్డలు ఎదురు చూడటం లేదా? అని మేము ప్రశ్నించాం, నిజమే ఎదురు చూస్తున్నారు. కాని చట్టాలు వెనక్కి తీసుకునే దాకా మేము వెనక్కి మళ్ళె ప్రశక్తే లేదు అని దడనిశ్చయంతో వారు బదులిచ్చారు. అక్కడే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిద్యం వహించిన ఒక యువ కబాడీ ప్లేయర్ కూడా కనబడ్డారు. మీరెందుకు ఇందులో ఉన్నారు? అని మేము ఆయనని ప్రశ్నించినప్పుడు నా తండ్రి, సోదరులు రైతులే వారి కష్టం నాదికాదా? అని ఆయన తిరిగి మమ్మల్ని ప్రశ్నించారు. ముంబాయికి చెందిన ఒక యువ వైద్య విద్యార్ధి డాక్టర్ జైన్ మాకు అక్కడే తారస పడ్డాడు. మీకు ఇక్కడ ఏమి పని? అని ప్రశ్నించాను. ఆయన గత డిశంబర్ నెల నుంచి తండ్రి నుంచి అడిగి తెచ్చుకున్న లక్ష రూపాయల సొమ్ముతో రైతులకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఆయన మాటలలో రైతులపట్ల ఎంతో సహానుభూతి కనిపించింది. రైతులు తమ కష్టాన్ని బయటకు చెప్పుకోటానికి ఇష్టపడరు. శారీరక ఇబ్బందుల గురించి చెప్పేందుకు ముందుకురారు ఎంతో అనునయిస్తే గాని వారు తమ శారీరక సమస్యల గురించి మాట్లాడరు. ఈ దేశం కోసం శ్రమిస్తున్న రైతు ఇంత కష్టంలో ఉంటే నేనెలా ఊరికే కుర్చోగలను? నాకుతోచింది చేసేందుకే ఇక్కడ ఉంటున్నాను అని ఆయన బదులిచ్చారు. మరోచోట హుక్కా పిలుస్తున్న మరో వృద్దరైతు బృందం కనబడింది. అంతకు ముందు రోజు తీవ్ర మనోవేదనతో అక్కడే చెట్టుకు ఓ రైతు ఉరి వేసుకున్నాడు .
అయినా ఆ రైతుల కళ్ళలో ఒక సడలని దీక్ష చూశాము. ప్రభుత్వం పై ధర్మాగ్రహం చూశాము.
ఒక రైతు మోడీని గురించి దూషణలకు దిగితే, మరో రైతు వారించడం చూశాము. సమ్యమనం కోల్పోవద్దనీ, వ్యక్తులు మనకు ముఖ్యం కాదనీ, ప్రభుత్వ విదానాలు ముఖ్యమని ఆయన మాట్లాడారు. ఎన్ని రోజులైన వేచి ఉంటాము ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తేల్చుకునే, ఇంటికి వెళ్తాం అని వారు చెప్పారు. ఆ రోజంతా ఆ 25 కిలోమీటర్లు నడుస్తూ రైతులను పలకరిస్తూ, వారి మాటలను వింటూ, మేము మా సమయాన్నే మరిచి పోయాము. పూర్తిగా చీకటి పడిపోయింది. మెట్రోపిల్లర్లకు వారు అమర్చుకున్న మైకులు ద్వారా సందేశాలు వింటూ సాగిపోయాము.
సింగి సరిహద్దు
మూడవ రోజు అన్నింటికంటే అతి పెద్ద పోరాట స్థలి సింగుకు వెళ్ళాలి అనుకున్నాం. ఇది కర్నాల్ రోడ్డుపై ఉంది. ఇక్కడ పోలీతో పాటు ప్యారా మిలిటరీ బలగాలు కూడా ఉన్నాయి. కాని పోలీస్‌లు మమ్మలను ముందుకు వెళ్ళ నివ్వలేదు. దానితో 70 కిలోమీటర్లు చుట్టూ, తిరిగి పానిపట్టు వద్ద మేము ఆ రైతు పోరాట కేంద్రానికి చేరుకో గలిగాం. ఇక్కడ ఉన్న జన సందోహం చూస్తే ఇదో యాత్రాస్థలి అనుకుంటాం వెలుతున్న ప్రతి ప్రయాణికుడికి మంచి నీళ్ళు, వేడి వేడి జిలేబీలు, పులకాలు, జ్యూస్ బాటిల్స్, అరటిపళ్ళు అక్కడి రైతులు అందిస్తూనే ఉన్నారు. తాము పోరాటం చేచూ, తామే ఆహరం అందిస్తూ, సందర్శకుల ఆకలి తీరుస్తూ సాగుతున్న ఏకైక ప్రజా ఉద్యమం ఇదెక్కటైనేమో! ఇక్కడ ప్రధానంగా సిక్కులు కనిపిం చారు. దేశ దేశాలనుంచి వారి పిల్లలు వారి కోసం పంపుతున్న సహయంతో ఈ టెంట్లు వేసుకు న్నామని వారు సగర్వంగా టెంట్ల ముందు బోర్డులు పెట్టారు. ఆ రోజు ఆదివారం కావడంతో టెంట్లలో రోజుల తరబడి ఉంటున్న కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆడవాళ్ళు, పిల్లలు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లపై వచ్చారు. 35 కిలోమీటర్లు నడిస్తేగాని మేము మీటింగ్ జరిగే ప్రదేశానికి చేరుకోలేకపోయాం . అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన సౌహర్షి ప్రతినిధులు తమ సందేశాలను వినిపిస్తూండటం మాకంట పడింది. మీటింగ్‌కు ఒక ప్రక్కన మన కొత్తగూడెంకు చెందిన కార్మిక, కర్షక సంఘాల బ్యానర్ కూడా తెలుగులో మాకంట పడింది. పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక యువ నాయకుడు రెబల్ సదానంద మాతో చాలా సేపు ముచ్చటించారు. ఓ చిన్న రైతు దాన్యం దర మరో రాష్ట్రం లో ఎక్కువ ఉంది అని అక్కడకు ఎలా తీసుకువెళతాడు
అనుకుంటున్నా? మోడీకి ఈ విషయం ఎందుకు అర్థం కావడంలేదు? అని ఆవేశంగా ప్రశ్నించాడు. మీటింగ్ ప్రదేశానికి ముందు ఉన్న తాత్కాలిక గ్రంధాలయంలో భగత్ సింగ్ పుస్తకాలు చదువుతూ అనేక మంది యువకులు కనబడ్డారు. నిజానికి సింగ్ బోర్డర్ ప్రత్యేకం ఏమిటంటే ప్రతి టెంట్ పై భగత్‌సింగ్ బొమ్మనో, ఆయన ఇచ్చిన ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదమో కనబడుతూనే ఉంది. అక్కడే పుట్ పాత్ పైన అందరిపాద రక్షలను ఉచితంగా శుభ్రం చేసి ఇస్తున్న ఇద్దరు సిక్కు సోద రులు తారసిల్లారు. మీరెందుకు ఈ పని చేస్తున్నారు? అని అడిగాము. ఆ ఇద్దరిలో ఒకరు నెలకు లక్షన్నర జీతం తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగి సెలవు పెట్టిమరీ అన్నకు తోడుగా ఉండేందుకై వచ్చినారు. మేము టెర్రరిస్ట్ల్లా, దేశద్రోహుల్లా కనబడుతు న్నామా? అని వారే నన్ను ఎదురు ప్రశ్నించారు. ఈ దేశం కోసం యుద్ధాలలో ప్రాణాలు అర్పించిన అనేక కుటుం బాలు ఉన్న ప్రాంతం మాది అని సగర్వంగా బదులిచ్చారు. సేవ చేయడం ఒక్కటే తెలుసుమాకు.
వేల కిలోమీటర్లు నడిచి ఇక్కడకు చేరుకున్న రైతుల పాదాలకు వారి పాద రక్షలు శుబ్రం చేయడం ద్వారా మాకతజ్ఞతలు తెలియ జేస్తున్నాం అని చెప్పారు. ఈ అవకాశం లబించినందుకు ఉప్పొంగిపోతున్నాం అని కూడా అన్నారు. ఇక చిన్న పిల్లల హడావుడి అయితే చెప్ప నక్కరలేదు జాతీయ జెండాలు చేతబూని గలీ గలీ మే శూర్ హై,
మోడీ చోర్ హై, అంటే హుషార్ గా అరుస్తూ పరుగులు పెడుతున్నారు. ఏ రైతులను కదిలించినా ఉద్యమాన్ని నీరు కార్చేందుకై జనవరి 26న దీప్ సిద్ధు నాయకత్వంలో కొందరు ఎలా ప్రయత్నం చేసారో కళ్ళకు కట్టినట్లు చెపుతున్నారు. మోడీ మీడియాముందు మీరు తట్టుకోగలరా? అనే సందేహం నేను వ్యక్త పరిస్తే ఇదిగో మీరు తెచ్చిన స్వేచ్ఛ ఉంది కదా ఇలాంటి స్వేచ్ఛా గొంతుకలు ఎన్నో ఇక్కడకు వస్తాయి. వాటి ముందు అబద్దపు మీడియా వక్ర భాష్యాలు పనిచేయవు అని వారు నమ్మకంగా మాట్టాడారు.
ప్రతి చోట వారి నమ్మకం, వారీ ధీరత్వం నన్ను ఆశ్చర్య చకిరితుడిని చేసింది. ఇంత సుదీర్ఘకాలంగా ఇప్పటి వరకు ఏ పోరాటం సాగలేదు. గొప్ప అవగాహనతో, అద్భుతమైన సమన్వయంతో వందలాది రైతు సంఘాలు చేస్తున్న ఈ సాహసోపేతమైన పోరాటం గెలిచితీరాలి. అప్పుడే రాజ్యం యొక్క నియంతృత్వ పోకడలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. అలా జరగాలన్న కోరికతో, రైతు కోసం మిగిలిన ప్రజలందరు కలిసివస్తారన్న నమ్మకంతో అక్కడినుంచి వెనుదిరిగాం.
- ఐవి రమణ రావు,
9848809990