Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణ అరటి పండు తప్ప తినదు.. ఆనంద్ యాపిల్ ఒక్కటే తింటాడు.. ఇందిరకు ఈత పళ్ళంటే ప్రాణం.. ఉమ ఉసిరి కాయలు కొరికి కోరికీ తింటుంది. గట్టి పళ్ళు ఆమెవి.. అ- అరటి ఆ ఆపిల్ ఈ ఈత ఉ ఉసిరి. క- కమలా ఇలా అన్ని అక్షరాలతో పండ్లున్నాయి. ఐతే కొన్ని
పండ్లపేర్లు చెప్తేనే కొందరికి పడదు.. నోట్లో పండ్లు లేని వారు కూడా తినగల పండ్లు చాలానే ఉన్నాయి. ఒక్కో పండులో ఉండే మనకు మేలు చేసే విటమిన్లు, లవణాలూ తెలిస్తే ఎవ్వరూ ఒక్క పండు కూడా వదలరు. ఆయా కాలాల్లో లభించే ప్రత్యేక ఫలాలను తినడం ఎంతో మంచిది. 'మన ఆరోగ్యం మన చేతుల్లోనే' - అనేమాట వాస్తవం. మన ఆరోగ్యానికి, జీర్ణక్రియసరిగా ఉండనూ అవినాభావ సంబంధం ఉంది. దీనికోసం పేగుల్ని శుభ్రం చేసే పీచుపదార్థాలు అవసరం. పీచు ఆహారనాళాలను శుభ్రం చేస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. కనుక పీచు పదార్థాలు అధికంగా ఉన్న పండ్లు తినడం ఉత్తమం. శరీర పెరుగుదలకు, గాయాలు, పుండ్లు మానడానికి, దంతాలు, వ్యాధిని రోధక శక్తిని పెంచుకునేందుకూ, చిగుళ్ల ఆరోగ్యానికి సి-విటమిన్ అవసరం. శరీరంలో ఎర్రరక్త కణాలవద్ధికి అవసరమైనవన్నీ పండ్లలో బాగా లభిస్తాయి.
ఆయుర్వేద ఆహార సిద్ధాంతాల ప్రకారం- పండ్లను ఆహారంతో పాటు కాకుండా, విడిగా తింటేనే తేలిగ్గా జీర్ణం అవుతాయి. శరీరానికి అవసరమైన కీలక విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. కాబట్టి పండ్లను ఎప్పుడు తిన్నా కూడా మంచి పోషకాహారం తీసుకున్నట్లే. అల్పా హారంగా కూడా పండ్లను తినవచ్చు. మన చేతి నుండి నోట్లోకి ప్రతిరోజూ తప్పక రెండు మూడు రకాల పండ్లైనా వెళ్లాలి. పండ్లు తినేవారికి రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్యం దరి చేరదని ఖరాఖండిగా చెప్పవచ్చు. అనేక రకాల పండ్లు అనేక రుచులలో మనకు ప్రకతి మాత ప్రసాదిస్తున్నది.. తీపు, పులుపు, వగరు ఏ రుచైనా సరే సంవధ్ధిగా పోషకాలున్న పండ్లను మనం తప్పక తినాలి. ఎన్నో రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారంగా మన ఆరోగ్య రక్షకాలుగా వున్నా మనం సరిగా గుర్తించి వర్తించక రోగాలను కొని తెచ్చుకుంటున్నాం.
కొన్ని పండ్లూ అరటి, ఆపిల్ వంటివి అన్ని కాలాల్లో లభిస్తాయి. కొన్ని మామిడి, పుచ్చ వంటివి వేసవిలో లభిస్తాయి. కొన్ని పండ్ల నుండి ఐస్‌క్రీమ్‌లు, కేకులు తయారు చేస్తారు. నిమ్మ, ద్రాక్ష వంటి కొన్ని పండ్ల నుండి రసం తీసి జ్యూస్‌గా తాగుతాం. అక్షర క్రమంలో పండ్ల గురించీ కొద్దిగా చూద్దాం-
అరటిపండు
ఇది అనేక రంగుల్లో, ఆకా రాల్లో ఉంటుంది. పండిన పండ్లు పండు ముసలి వారు సైతం సులువుగా తిని జీర్ణీంచుకోగలరు. పసి బిడ్డల నుండీ ముదుసలుల వరకూ అరటి మంచి పోషకాహారం. దీన్ని పేదల ఆపిల్ అంటారు. అరటి పండు చౌక, ఆపిలు ఖరీదు. అరటిపండులో సుమారుగా74 శాతం నీరు ఉంటుంది. 23 శాతం కార్బోహైడ్రేట్లు, 1 శాతం ప్రోటీనులు, 2.6 శాతం ఫైబరు ఉంటుంది. అరటి పండు తియ్యని రుచి కలిగి ఉంటుంది. అరటిపండు మంచి శక్తినిస్తుంది. దీన్లో పొటాషియం ఉండటాన రక్తపోటుతో బాధపడుతున్న వారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు లో చాలా ఔషధ గుణాలున్నాయి. అరటిలో బరువు తగ్గింస్తుంది. మలబద్ధకం మాయం. రక్తహీనత, మూత్ర పిండాల సమస్య, బీపీ, గుండె సమస్యలకు ప్రతిరోజూ అరటి తినడం మంచిదని వైద్య శాస్త్రం వెల్లడిస్తోంది. అరటి పండ్లు తినడం వల్ల రోగ నిరోధశక్తి పెరుగుతుంది. త్వరగా అనారోగ్యం బారిన పడం. ఈ పండు ఎముకలకు గట్టిదనాన్నిస్తుంది. కొవ్వు తక్కువ, ఆమ్లాలు తక్కువగానే ఉంటాయి. దీనిలోని ఖనిజ లవణాలు, పోషకాలు జీర్ణక్రియను సాఫీ చేస్తాయి. ప్రతి రోజూ ఒక అరటి పండు తప్పక తినాలి. అరటి పండు ఫైల్స్ తగ్గిస్తుంది సుఖ విరేచనం అవుతుంది. ఎర్రరక్తకణాలో ఇనుము శాతాన్ని పెంచి రక్తహీనత కలుగకుండా చేస్తుంది. సహజంగా బరువు తగ్గించు కోవాలనుకునేవారు అరటి పండు తినాలి.
అంజీర ఫలము
ఆరోగ్యానికి అంజీర ఫలము. అంజీరాన్ని మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. అత్తి పండుగా చాలామందికి తెలుసు. మేడిపండు చూడ మేలిమై ఉండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు పిరికివానిమదిని బింకమీలాగురా అన్నాడు వేమన..!
అలా ఈ మేడిపండు శతకాల్లోకీ ఎక్కింది. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడి పండుగా పిలిచే ఈ పండు అనారోగ్యాన్ని దూరం చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ. అంజీర ఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు అధికంగా ఉంటాయి. కడుపులో మంట, అజీర్తి సమస్యతో బాధపడేవారికి ఈ పండు ఎంతో మేలుచేస్తుంది. దీనిలోని పొటాషియం గుండెకు రక్తప్రసరణ సరిగా జరిగేందుకు, దేహ పుష్టికి సహకరిస్తుంది. బరువు తగ్గిందుకోను ఈ పండు పనిచేస్తుంది. ఇనుము, క్యాల్షియం, పీచు ఆకలిని తగ్గిస్తాయి. నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడుపులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి ఉపకరిస్తుంది. బాగా ఎండిన అంజీర్లలో మినరల్స్ అధికం. మల బద్ధకాన్ని మాయం చేస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్, కఫాన్ని తగ్గిస్తుంది. మనకు అందుబాటూలో ఉండే అంజీర కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటాయి.
వంద గ్రాముల పండ్లలో పోషకాలు
పిండి వదార్థం - 19 గ్రా, పీచు వదార్థాలు - 3 గ్రాములు, చక్కెర - 16 గ్రాములు, కొవ్వు - 0.3 గ్రాములు, ప్రొటీన్లు - 0.8 గ్రా, విటమిన్ 'బి6' - 110 గ్రా, శక్తి - 70 కిలో.కె.
వందగ్రాముల ఎండిన పండ్లలో పోషకాలు పిండివదార్థాలు - 84 గ్రాములు, చక్కెర - 48గ్రాములు, పీచు వదార్థం - 10 గ్రాములు, కొవ్వు -0.3 గ్రాము, ప్రొటీన్లు - 3 గ్రాములు. ఈ పండును విరిచి తినవచ్చు. అత్తి పండు విరిచి నప్పుడు లోపల సన్నని పురు గులు ఉం టాయి కనుక జాగ్రత్తగా విదిలించి తినాలి. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది.
కర్బూజాపండు
ఇది దోస రకానికి చెందింది. దీని వాసనను అను సరించి వీటికి మస్క్ మెలన్ అనే పేరు కూడా ఉంది. జలకర్బూజ - ఎండా కాలంలో అంతా ఈ పండుకోసం పోటీ పడతారు.
కస్తూరి కర్బూజ - ఒక రకం పుచ్చకాయ.
కసాబ కర్బూజ - దీనికి పచ్చటి రంగులో నున్నటి తొక్క మీద చారికలు ఉంటాయి.
మధురపు కర్బూజ - ఆకుపచ్చ రంగులో ఉన్న గుజ్జు ఎంతో తియ్యని రసమతో ఉంటుంది.
అమెరికా కేంటలూప్ - దీనికి తొక్క మీద గుండ్రటి చారలు ఉంటాయి. లోపల గుజ్జు పసుపు పచ్చగా ఉంటుంది. ఈ పండు వేసవిలో చాలా చలువ చేయడమే కాక, క్యాలరీలు లేని తీపిదనాన్నిస్తాయి. లేత నారింజ రంగులో వుండే దీని గుజ్జు రుచిగా వుంటుంది. వేసవిలో ఎండవేడి తగ్గించే మధురఫలం. అధిక బరువును తగ్గింస్తుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, మూత్ర పిండాల్లో రాళ్లు రాకుండా ఆపుతుంది. పీచు అధికంగా లభించే ఈ పండును కొద్దిగా తిన్నా, కడుపు నిండుతుంది. మలబద్ధకం దూరం. ఈ పండులో లభించే విటమిన్ 'ఏ' కంటిచూపుకు, విటమిన్' సీ' శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి గుండెనొప్పి, క్యాన్సర్ లాంటి రోగ కారకాలపై పోరాటం, ఫోలిక్ ఆమ్లం గర్భిణులకు వరం, బాలింతలు ఈ పండును తీసుకోవటం వల్ల పాలు బాగా పడతాయి. చర్మంపై దురదలు, ఎగ్జిమా కలిగిన వారికి ఈ పండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఖర్బూజా రసాన్ని ప్రతిరోజూ తీసు కోవటం వల్ల ఎసిడిటీ, అల్సర్లు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు ఫటాఫట్ మాయం. ఈ పండు తొక్కను కషాయం లా చేసి కొబ్బరినీటితో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు మటుమాయం. ఆయుర్వే దంలో కూడా ఈ రసాన్ని చాలా రకాల అరోగ్య సమస్యల నివారణకు సూచిస్తారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మల బద్దకం, మూత్ర నాళ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి పరిస్థితుల్లో ఈ గుజ్జుని తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలుచేస్తుంది. కిడ్నీలలో రాళ్లు రాకుండా నివారిస్తూ, వద్ధాప్యంలో ఎముకల బలానికి తోడ్పడతాయి.
దీనిలోని పోషక విలువలు100 గ్రాలకు సుమారుగా ఇలా ఉంటాయి.
నీరు - 95.2 గ్రా., ప్రొటీన్ - 0.3 గ్రా., క్రొవ్వు - 0.2 గ్రా., పీచు - 0.4 గ్రా., కెరోటిన్ - 169 మైక్రో గ్రా., సి విటమిన్ - 26 మి.గ్రా:, కాల్షియం: 32 మి.గ్రా., ఫాస్పరస్ - 14 మి.గ్రా., ఇనుము - 1.4 మి.గ్రా., సోడియం - 204.8 మి.గ్రా., పొటాషియం - 341 మి.గ్రా., శక్తి - 17 కిలో కాలరీలు.
బొప్పాయి పండు
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఈ బొప్పాయిని పరందపు కాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని కూడా పిలుస్తుంటారు. బొప్పాయి పండులో వున్నన్ని విటమిన్లు మరెందు లోనూ లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారం గా తీసుకుంటే ఆరో గ్యం చాలా మెరుగ వుతుం దని అంటు న్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ 'ఏ', విటమిన్ 'బీ', విటమిన 'సీ', విటమిన్ 'డీ'లు వున్నాయి. బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు లభిస్తాయి. దీనిలోని పెప్సిన్ అనే పదార్థం వలన జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. పొట్ట సంబంధమైన జబ్బులను మాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగప డుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం పొట్టే కదా! ఆ జబ్బులను మాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించమంటున్నారు వైద్యులు..
బొప్పాయిలో పోషక విలువలు
మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధికంగా విటమిన్ ఎ లభిస్తుంది. దీనితో పాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో బాగా లభిస్తాయి.
100 గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించేవి
40 క్యాలరీలు -1.8గ్రా., పీచు - 9.8గ్రా, కార్బోహైడ్రేట్లు - 0.6గ్రా, ప్రోటీన్లు - 10మి.గ్రా., మెగ్నీషియం - 257మి.గ్రా.- పొటాషియం - 3 మి.గ్రా., సోడియం - 24మి.గ్రా., కాల్షియం - 61.8 మి.గ్రా., విటమిన్-సి, విటమిన్ ఎ (6 శాతం), బీటా కెరోటిన్ (3శాతం), విటమిన్ బి1 (3శాతం), బి2 (3 శాతం), బి3 (2 శాతం), బి6 (8 శాతం) ఉంటాయి.
కొలెస్ట్రాల్ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు. ఇన్ని పోషకాలున్న బొప్పాయిని ఎవరు తినకుండ ఉండగలరు?
మామిడిపండు
మామిడిని ఆంగ్లంలో మ్యాన్గో అంటారు. ఇది భారత దేశపు జాతీయ ఫలం. వేసవి ఫలం. వేసవిలో అధికంగా లభి స్తాయి. మామిడిపళ్ల రసం ఇష్టపడని వారే ఉండరు. మామిడి తాండ్ర రాజమండ్రి ప్రసిధ్ధి. దీన్ని వీరు తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువ. దీని ఆకులను 'చూత పత్రి' అని కూడా అంటారు. తాజా మామిడి పండులో పదిహేను శాతం చక్కెర, ఒక శాతం మాంసకత్తులు, గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి విటమిన్లు ఉంటాయి. మామిడి క్యాన్సర్ నివారిణి అని నిపుణులు అంటున్నారు. మామిడి రకాల్లో చాలానే ఉన్నాయి. కేవలం ఇది వేసవి ఫలం కావటాన అందరూ తప్పక తింటారు.
ఆరోగ్య ప్రయోజనాలు
సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. పరిశోధనల ప్రకారం, విటమిన్ ఎ వద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లు తింటే నిమిషాలలో శక్తి పుంజుకుంటుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు, మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి.కాబట్టి మలబద్ధకంతో బాధపడే వారు సపోటాలను వాడవచ్చును. సపోటా పండ్లలో మాంసకత్తులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెం ట్. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్సు గుణాలను కలిగి ఉన్నాయి. ఇవి హానిచేసే సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి.
పోషకాలు విటమిన్ 'ఏ 'కంటిచూపుకు, విటమిన్ 'సీ',. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు, ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపించాలి.
శక్తి - 141 కాలరీలు, నీరు, - 132.60 గ్రా, పిండిపదార్ధము (కార్బోహైడ్రేట్స్) - 33.93 గ్రా, మాంసకత్తులు (ప్రోటీన్) - 0.75 గ్రా, పీచుపదార్థం - 9.01 గ్రా, మొత్తం కొవ్వుపదార్ధము - 1.87 గ్రా, సాచ్యురేటెడ్ కొవ్వు. ఇన్ని సుగుణాలున్న సపోటాను తిననివారు ఉండరు
నేరేడుపండ్లు
జామూన్ అనే ఈ నేరేడు పండు నీలం రంగులో పెద్ద ద్రాక్ష ఆకార్మలో ఉంటుంది. నోట్లో వేసుకోగానే కాస్త వగరుగా, తీయగా ఉండే ఈ నేరేడు అరోగ్యానికి చాలామంచిది. ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారణి. నేరేడు పండ్లు శక్తిని కలిగించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాక, కొన్నిరకాల రోగాలనూ రాకుండా చేయగలవు. నేరేడు పండ్లలో చాలా రకాలున్నాయి. 1. గుండ్రంగా పెద్దగ వుండే ఒక రకం. 2. కోలగా వుండి పెద్దగా వుండే రకం. వీటిని అల్ల నేరేడు అని అంటారు. 3. గుండ్రంగా వుండి చిన్నవిగా వుంటాయి. వీటి చిట్టి నేరేడు అని అంటారు. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో అధికం. భారతీయుల అత్మీయ గ్రంధమైన రామాయణంలో శ్రీరాముడు పద్నాలుగేళ్ళు వనవాసం చేసినపుడు, ఎక్కువగా ఈ పండ్లనే ఆహారంగా స్వీకరించినట్లు భారతీయుల విశ్వాసం. అందుకనే భారత దేశంలోని గుజరాత్, వివిధ ప్రాంతాల్లో దీనిని దేవతా ఫలంగా భావిస్తారు. దీనిలో అనేక పోషకాలూ, శరీరానికి చేసే ఉపకారాలూ ఉన్నాయి. జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు స్పూన్లు ఇస్తే తగ్గిపోతాయి. కాలేయం పనితీరు సరిచేస్తుంది.
శుభ్రం చేసేందుకు కూడా నేరేడు చక్కగా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు, మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు. కాలేయం పని తీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పని చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.
నేరేడు పండ్లలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మంగనీస్, జింక్, ఐరన్, విటమిన్, సీ, ఎ రైబోప్లెవిన్, నికోటిన్ ఆమ్లం, కొలైన్, ఫోలిక్, మాలిక్ యాసిడ్లు ఉంటాయి. దీనిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్తకణాలను వద్ధి చేస్తుంది. అనీమియా తగ్గుతుంది. నేరేడు వ్యాధి నిరోధకశక్తిని ఇవ్వడమేకాక ఎముకలకు పుష్టినిస్తుంది. నేరేడు పండుకు గుండెవ్యాధులను నివారించే శక్తి ఉంది.
వందగ్రాముల్లో పోషకాలు : తేమ- 83.7గ్రా, పిండి పదార్థం - 19 గ్రా, మాంసకత్తులు - 1.3గ్రా, కొవ్వు - 0.1గ్రా, ఖనిజాలు - 0.4గ్రా, పీచు పదార్థం - 0.9గ్రా, క్యాల్షియం - 15-30మి.గ్రా, ఇనుము - 0.4మి.గ్రా నుండి 1మి.గ్రా, సల్ఫర్ - 13మి.గ్రా, విటమిన్ సి - 18మి.గ్రా.
ప్రకృతి మనకు అందించే చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషకాహారం. వండేపని లేకుండా చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించే వివిధరకాల పండ్లు మనకు చేసే మేలు గుర్తించి చక్కగా మన ఆర్థిక శక్తిని బట్టి వెల తక్కువైన, అందుబాటులో ఉండే పండ్లను తిని హాయిగా, ఆరోగ్యంగా పసిపిల్లల్లా గెంతుదామా! రోగ నిరోధకశక్తిని సంపూర్ణంంగా పొంది కరోనాకు తరిమి కొడదామా! ఒన్, టూ, త్రీ.... రన్...!!!
అనాస
అనాస ఆంగ్లంలో పైనాపిల్ అనేది ఒక పండు. అనాస శాస్త్రీయ నామం ఎకోమోసస్. ఇది వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. రుచి పుల్లగానూ, తియ్యగానూ కూడా ఉంటుంది. దీన్లో పొటాషియం, సోడియం అధికంగా ఉంటాయి. దీన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటిని కాపాడుతాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది మధుమేహం, హదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి. అనాస పండు రుచి పుల్లపుల్లగా, తీయతీయగా కూడా ఉంటుంది. ఇది తాగితే వాంతులు
తగ్గుతాయి. పచ్చ కామెర్ల వ్యాధికి ఈ రసంవిరుగుడు అనవచ్చు.
ఆపిల్
ఇది రోసేసి కుటుంబానికి చెందిన పండు. దీన్ని తెలుగులో గ్రామ ప్రాంతాల వారు సీమ రేగిపండు అంటారు. అమెరికాలో వేసవిలో పుష్కలంగా కాసే పండు ఇది. మన దేశంలో కాశ్మీర్ పండు ఇది. 'రోజుకి ఒక యాపిల్ తిను- వైద్యులకు దూరంగా ఉండు' అనేది నుడి.. నానుడి.. పెక్టిన్ బాగా ఉండే యాపిల్ తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా పెరిగి పొట్ట శుభ్రంగా ఉంటుంది. సుఖ విరేచనకారి. రుచికి రూచీనూ. పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు సహకరిస్తుంది, పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచే బ్యూటీరేట్ రసాయనాన్నీ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు తక్కువగానూ ఉంటాయి. సోడియం తక్కువ గానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. కంటికింపుగా, నున్నంగా ఆకర్షణీయంగా గులాబి, ఎరుపు, ఆరంజి రంగుల్లోని ఆపిల్ చూడగానే ఆకర్షిస్తుంది.
జామ పండు
జామ లేదా జామి ఆంగ్లంలో గోవ అంటారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఎరుపైనా, తెలుపైనా చేసే మంచి మాత్రం ఒక్కటే. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీ వర్ణం కలిగి తియ్యగా, కొన్నింటికి నిండా విత్తనాలు ఉండి కమ్మని వాసన వస్తాయి. స్ట్రా బెర్రీ జామ బ్రెజిల్ దేశంలో పుట్టింది. ఈ పళ్ళూ ఎర్రగా ఉంటాయి. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ రంగులో ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉంటాయి. జామతో కూడా జాములు, రసాలు చేస్తారు. పోషక విలువలు అందించే పండ్లోలో జామ పళ్లను 'మేలైనవిగా' చెప్తారు. వీటిలో విటమిన్ 'ఏ', విటమిన్ 'సి' అధికంగా లభిస్తాయి. ఒక జామపండులో విటమిన్ 'సి' ఒక నారింజ పండులో కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. వీటిలో మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. కాలరీలు 36-50, తేమ 77-86 గ్రా, పీచు 2.8-5.5. గ్రా, ప్రొటీన్స్ 0.9-1.0 గ్రా, కొవ్వు 0.1-0.5 గ్రా, యాష్ 0.43-0.7 గ్రా, కార్బోహైడ్రేట్లు 9.5-10 గ్రా, కాల్షియం 9.1-17 గ్రా, పాస్ఫరస్ 17.8.30 మి.గ్రా, ఐరన్ 0.30-70 మి.గ్రా, కెరోటీన్ (విటమన్ 'ఏ') 200-400, ఎస్కార్బిక్ ఆవ్లుము (విటమిన్ 'సి') 200-400 మి.గ్రా., ధియామిన్ (విటమిన్ బి1) 0.046 మి.గ్రా, రిబోప్లేవిన్ (విటమిన్ బి2) 0.03-0.04 మి.గ్రా, నియాసిన్ (విటమిన్ బి3) 0.6-1. 068 మి.గ్రా. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జామ ఏడాది పొడవునా లభించినా, శీతాకాలంలోనే వీటి పంట, రుచి అధికం. కమలా పండులో కంటే 5 రెట్లు అధికంగా విటమిను 'సి' ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతకు సహకరిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం హాయిగ తినవచ్చు, నీటిలో కరిగే బి,సి విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్-ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు.
దానిమ్మ
అంటే పొమగ్రనేట్. దీని చెట్టును ''దామిడీ వక్షమ్'' అంటారు. లలితా సహస్ర నామా ల్లో అమ్మవారికి 'దాడిమి కుసమ ప్రభ' అనే నామం కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామము Punica granatumµ'. పండ్ల జాతులలో మేలైనది. తినడానికి రుచిగా ఉంటుంది. దీనిలో విటమిను -ఎ, సి, ఇ, బి5, ఫ్లవనోయిడ్స్ ఉన్నాయి. దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. పండులోని 'ఇల్లాజిక్ యాసిడ్'ను చర్మంపై రాస్తే సూర్యకిరణాల వేడి నుంచి రక్షణ లభిస్తుంది. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ల సమూహమే దానిమ్మ. ఫ్రీరాడికల్స్ అడ్డుకుని వద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. రోజూ దానిమ్మ తిని తిరిగి టీనేజర్స్ కావచ్చన్న మాట. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను రానివ్వవు. దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను అవసరమైన రీతిలో వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో స్టేట్ బ్యాంక్ లాకర్లోనో ఉన్నట్టే. ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ మంచిది. ఆస్టియో ఆర్థ్రయిటిస్‌తో బాధ పడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరేచనాలతో బాధపడే వారికి మంచి మందు ఇది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత తగ్గిస్తాయి. అల్సర్లను తగ్గిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
కమలాపండు
దీన్నే ఆరంజ్ అనీ, నారింజ అనీ అంటారు. నాగపూర్ నారింజ ఆరంజి రంగులో ఉండగా, దేశవాళీ నారింజ, ఆకు పచ్చ రంగు లో ఉంటాయి. రంగే దైనా ప్రయోజనాలు ఒకటే. కొన్ని కొద్దిగా పుల్లగా ఉంటే కొన్ని తియ్యగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. శరీర కాంతిని పెంచి, చర్మానికి మదుత్వం కలిగిస్తుంది.
చర్మ సంబంధమైన వ్యాధులు మాయం. అరకప్పు కమలా పండు రసంలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే తీవ్రమైన జ్వరం కూడా తగ్గుతుంది. ఒక గ్లాస్ ఆరంజి రసం తాగితే బలం వస్తుంది. ప్రతిరోజూ ఒక నారింజ పండు రెండు నెలలు తింటే రక్తవద్ధి అవుతుంది. రసం తాగేకంటే అలాగే తొనలు తినడం మంచిది. పళ్లకు గట్టితనం కలిగించను. ఈ పండ్లు ఉపకరిస్తాయి. కమలా పండులోని క్యాల్షియం, భాస్వరం, ఇనుము, విటమిన్ సి వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన ఎనర్జీని ఇస్తాయి.
పుచ్చకాయ
ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఇష్టం వున్నా లేకున్నా తినేది పుచ్చకాయనే. దీన్ని వివిధ ప్రాంతాల వారు వేరు వేరు నామాలతో పిలుస్తారు. కళింగ మాండలికంలో రామ దోసకాయ అనీ, తెలంగాణ మాండలికంలో పుచ్చకాయ, కలింగేరికాయ అనీ, రాయలసీమ మాండలికంలో కలింగరి కాయ, కర్బూజ కాయ అనీ పిలిస్తారు. ఎలా పిలిచినా రుచీ, అవసరం ఒక్కటే కదా! లోపల ఎర్రగా ఉండే ఈ పుచ్చకాయ వేసవి ఫలం అనవచ్చు. అన్ని సీజన్లలో పుచ్చకాయలు లభిస్తున్నా వేసవి కాలంలో పుచ్చకాయలకు ప్రత్యేక నాణ్యత, రుచీ ఎక్కువగా ఉంటాయి. బి విటమిన్లు, పొటాషియం అధికంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, దీనిలోని పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటి నాయిడ్స్, బీటా కెరోటిన్లు పుఉంటాయి. వీటితో పాటు విటమిన్-బి6, విటమిన్-సీ, పీచు పదార్థాలు కూడా పుచ్చకాయలో ఉంటాయి. మిగిలిన పండ్లకన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. 100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో సుమారుగా ఈ విధంగా పోషకాలు ఉంటాయి.
నీరు - 95.2 గ్రా., ప్రోటీన్ - 0.3 గ్రా., కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా., పీచు పదార్థాలు - 0.4 గ్రా., కెరోటిన్ - 169 మైక్రో గ్రా., సి విటమిన్ - 26 మి.గ్రా., కాల్షియం - 32 మి.గ్రా., ఫాస్ఫరస్ - 14 మి.గ్రా., ఇనుము - 1.4 మి.గ్రా., సోడియం - 104.6 మి.గ్రా., పొటాషియం - 341 మి.గ్రా., శక్తి - 17 కిలో కాలరీలు
మరి ఇన్ని పోషకాలున్న పుచ్చకాయను తినని వారు పిచ్చివారే అనుకోవాలి.
సపోటా
'సపోటా' అనే పేరు వినగానే నోరూరడం ఖాయం. సపోటాకు మరోపేరు 'చికూ'. మామిడి, అరటి, జాక్ వంటి పండ్ల విభాగానికి చెందిన ఈ పండు అధిక కాలరీలు గల రుచికరమైన పండు. నోస్ బెర్రీ, సపోడిల్లప్లం, చికూ సపోటా మొదలైనవి దీని ఇతర పేర్లు. భారతదేశంలో 'చిక్కూ' లేదా 'సపోటా' అంటాం. సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండు అటు పండ్లు లేని ముసలి వారికీ, ఇటు పసిబిడ్డలకూ అంటే ఒక ఏడాదిపిల్లలకు సైతం పెట్టవచ్చు. తియ్యని ఈ గుజ్జు పిల్లలు చప్పరిస్తారు. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్, టన్నిన్ లు ఉన్నాయి. దీని రుచి తియ్యగా ఉండడం వల్ల, షేక్స్‌లో బాగా ఉపయోగిస్తారు.
బత్తాయి
పెద్ద నిమ్మపండులా కనిపించినా రుచి మాత్రం తీపే. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అంటారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని సాధారణంగా ఒలుచుకుని తింటారు. కొందరు రసం తాగుతారు. జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి రసం తాగుతారు.
పోషక విలువలు - విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని నివారిస్తుంది. ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరుతుంది. దీన్లో ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతో పాటు ఇతర జీర్ణరసాలు, ఆమ్లాలు విడుదలయ్యేందుకు సహకరిస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఈ రసం తొందరగా జీర్ణమై రక్తంలో కలిసి పోతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పార దోలుతాయి. ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
పనస
దీన్ని జాక్ ఫ్రూట్ అంటాం. ఇది అన్ని పండ్లలాగా ఒకరే ఒకపండు తినలేరు. ఒకపండులోని తొనలు కనీసం వంద నుండి మూడు వందల వరకూ ఉంటాయి. కమ్మదనమూ చెప్పలేం. నోట్ళో నీరూరవలసిందే సుమా! దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీ మీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.
పండ్లు మానవుడికి ప్రకతి ప్రసాదించిన అపురూపమైన వరాలు అని చెప్పుకున్నాం కదా!. పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. దీనిని సంస్కతంలో 'స్కంధఫలం' అని, హిందీలో 'కటహక్-కటహర్-చక్కీ' అని, బంగ్లాలో 'కాంటల్' అని, మరాఠిలో 'పణస' అని, ఆంగ్లంలో 'ఇండియన్ జాక్ ఫ్రూట్' అని అంటారు.
వైద్య పరముగా : జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. జారుడు గుణము కలిగి వున్నందున మలబద్దకం నివారిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గుతుంది, విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధకశక్తిని పెరుగుతుంది. ఫైటో న్యూట్రియంట్స్, ఐసోఫ్లేవిన్స్ ఉన్నందున కాన్సర్ నివారణకు సహకరిస్తుంది. పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది.
దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పిండి పదార్థాలు చక్కెరలు, పీచు పదార్థలకు బ్యాంక్ అనవచ్చు.
విటమిన్-ఎ, విటమిన్- బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం ఐరన్ సోడియం పొటా షియం పాస్ఫరస్ మెగ్నీషియం మాంగనీస్ జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మరింకెందు కాలస్యం పదండిపోదాం 'పనస' కొనేందుకు 'నస' లేకుండా.
- ఆదూరి హైమావతి,
8790224030