Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట ఆచార్య ఆత్రేయ పేరు తెలియని పద్యం, నాటకం, సినిమా రచన ఉండవు. ఈ మూడు ప్రక్రియలలోనూ ఆత్రేయ కలం కదం తొక్కినా ఆయన సినీ కవిగానే ఎక్కువ మందికి తెలుసు. తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది కవులున్నా ఆయన మనసు కవిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పాటలు మనసు చేత, మనసు కొరకు మనసే రాసిన పాటల్లా వుంటాయి. అందుకే మనసు కవిగా, మన సుకవిగా పేరు పొందారాయన. ఆయన రాసిన పాటల్లో వేటికవే ప్రత్యేకాలు. ప్రతిదానిలో సమ్మోహన మంత్రమేదో దాచి రాసినట్టు ఉంటాయి. 1951లో 'పోరా బాబూ పో...' అంటూ 'దీక్ష' చిత్రంతో మొదలైన పాటల ప్రవాహం... 1990లో విడుదలైన 'ప్రేమయుద్ధం' చిత్రంలో రాసిన 'ఈ మువ్వల గానం' దాకా నాలుగు దశాబ్ధాల పాటు సాగింది.
తెలుగు సినిమాల్లో ఆత్రేయ మనసు పాటలతో పాటు తనదైన ముద్రగల వలపు పాటలు, వాన పాటలు, వీణ పాటలు, అమ్మ పాటలు, అభ్యుదయ గీతాలు, తాత్విక గీతాలు మొదలైనవి రాశారు. వాటిలో తాత్విక గీతాలను పరిశీలిస్తే ఆత్రేయను 'సినీ వేమన' అని ఎందుకన్నారో తెలుస్తుంది. మనసు పట్టే.. మనసు పెట్టే.. మనసును తిట్టే మనసైన, సొగసైన గీతాలు రాసి మన'సు' కవిగా, మహాకవిగా తెలుగువారి హదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆచార్య ఆత్రేయ జయంతి మే 7 సందర్భంగా ''నవ తెలంగాణ సోపతి'' పాఠకుల కోసంప్రత్యేక కథనం...
ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహా చార్యులు. పేరులోని ఆచార్యను, గోత్ర నామమైన ఆత్రేయను కలుపుకొని 'ఆచార్య ఆత్రేయ' పేరుతో ఆయన సుప్రసిద్ధు లయ్యారు. వందేళ్ల క్రితం మే 7, 1921 సంవత్సరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడు గ్రామంలో సీతమ్మ, కష్ణమాచార్యుల దంపతులకు జన్మించిన ఆత్రేయ, చదువుకొనే రోజుల్లోనే ఆదర్శ భావాలు పలికిస్తూ పాటలు, నాటకాలు రాసి అలరించాడు. చదువును వదిలేసి 'క్విట్ ఇండియా ఉద్యమం'లో పాల్గొని జైలుకు వెళ్ళాడు. జైలు నుండి వచ్చాక ఆత్రేయ మామ జగన్నాథాచార్యులు తిరుత్తణి సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగంలో చేర్పించారు. నెలకు రూ.40 జీతం. 1940లో పద్మావతితో పెళ్ళయిన కొన్నాళ్లకు ఆత్రేయ ఉద్యోగం వదిలేసి,
నాటకాల వ్యాపకంతో తిరిగాడు. ఇలా నాటకాల వాళ్లతో తిరిగి చెడిపోతాడని వాళ్ల మామ బలవంతంగా చిత్తూరు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చేర్పించాడు. ట్రైనింగ్లో ఉంటూ కూడా నాటకాల పిచ్చితో ఆత్రేయ ఓసారి గోడ దూకి పారిపోయారట! ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం, 'జమీన్ రైతు' పత్రికలో కొంతకాలం సహాయ సంపాదకుడిగా పనిచేశాడు. 'స్వర్గ సీమ' చిత్రం గురించి అన్ని పత్రికల్లోనూ పొగుడుతూ సమీక్షలు రాస్తే, ఈయన మాత్రం ఆ చిత్రం బాగాలేదని రాశాడట! దాంతో పత్రికల వాళ్లు కోప్పడితే, ఆ ఉద్యోగం కూడా వదిలేశాడు. ఆ సమయంలో ఆత్రేయ కలం నుండి జాలువారిన పలు నాటికలు, నాటకాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో ''భయం, కప్పలు, గౌతమబుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తనం, ఎదురీత, ఎన్జీవో'' వంటివి విశేషాదరణ పొందాయి. స్వాతంత్య్రానంతరం దేశంలో చెలరేగిన హిందూ-ముస్లిం హింసాకాండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించాడు. ఈ నాటకాల్లో ఆయన పలికించిన పదాలు విని ప్రేక్షకులు మురిసిపోయేవారు. యుక్త వయసులో ఆత్రేయ 'బాణం' అనే యువతి ప్రేమలో పడి, ఆ ప్రేమ విఫలం కావడం.. ఆయన్నో కవిగా మలుపు తిప్పింది. ఆ విషాదమే కావచ్చు అమతతుల్యమైన సాహిత్యానికి అంకురార్పణ వేసింది. ప్రేమ మనసులతో ఎలా ఆడుకుంటుందో తెలియడం వల్లే కావచ్చు.. ఆత్రేయ అన్నేసి తత్వాలను ఔపోసన పట్టాడు. మనసును వీణలా మీటి రాగాలు పండించాడు. అంతులేని సాహిత్యాలు వొలికించాడు.
చిత్రసీమకు పరిచయం
ప్రముఖ నిర్మాత, దర్శకులు కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయ గురించి గోపీచంద్ ద్వారా తెలుసుకుని 1951లో తన 'దీక్ష' చిత్రం ద్వారా ఆయనను చిత్రసీమకు పరిచయం చేశారు. 'దీక్ష' సినిమాలో ఆత్రేయ రాసిన తొలి పాట ''పోరా బాబూ... పోయి చూడు లోకం పోకడ...'' ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకుంది. ఆరంభంలో కొందరు ఆత్రేయతో కేవలం మాటలే రాయించుకున్నారు. కొందరు అడపాదడపా పాటలు రాసే అవకాశం కల్పించారు. ఏది రాసినా, అందులో తనదైన బాణీ పలికించేవాడు ఆత్రేయ. అన్నపూర్ణ వారి 'తోడికోడళ్ళు'లో ఆత్రేయ రాసిన ''కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిదానా...'' పాట ఆ రోజుల్లో యువకులను ఎంతగానో మురిపించింది. అలాగే 'ముందడుగు'లోని ''కోడెకారు చిన్నవాడా... వాడిపోని వన్నెకాడా...'' పాట మరింతగా అలరించింది. ఇలా పాటలు రాసుకుంటూ, మాటలు పలికిస్తూ ఆత్రేయ చిత్ర ప్రయాణం సాగింది. భక్తిరస ప్రధానంగానూ ఆత్రేయ కలం అద్భుతాలు సష్టించింది. ''శేషశైలావాస శ్రీవెంకటేశా'' అంటూ ఆయన శ్రీనివాసుడికి జోలపాడిన విధం మరిచిపోలేనిది. శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం చిత్రంలోని ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. విన్నవెంటనే శ్రీవారి చెంతకు పట్టుకెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ''ఉన్నావా అసలున్నావా'' అంటూ ఆత్రేయ పాట దైవాన్ని ప్రశ్నించింది కూడా. ఈ సినిమా ఘనవిజయం తరువాత ఆత్రేయ గీతరచన కూడా ఊపందుకుంది. ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయను బాగా ప్రోత్సహించారు. ఆదుర్తి చిత్రాలకు ఆత్రేయ రాసిన అనేక పాటలు ప్రేక్షకులను రంజింప చేశాయి. కొన్ని చిత్రాలలో మాటలు-పాటలు రెండూ ఆత్రేయనే పలికించేవాడు. జగపతి ఆర్ట్ పిక్చర్స్, సురేశ్ ప్రొడక్షన్స్, యువచిత్ర వంటి నిర్మాణ సంస్థలు ఆత్రేయను తమ ఆస్థాన కవిగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆత్రేయ పాటలు లేకుండా సినిమాలు తీయలేమనీ కొందరు నిర్మాతలు అనేవారు. మూగ మనసులు సినిమాలో ''నవ్వినా... ఏడ్చినా... కన్నీళ్లే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా'' అంటూనే, ''మనసు గతి ఇంతే మనిషి బతుకు ఇంతే మనసున్న మనిషికీ సుఖము లేదంతే'' అంటూ ఆత్రేయ కలం నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి. కేవలం విరహగీతాలనే కాకుండా తన కలంలోంచి ఒక్కో పాట ఒక్కో వైవిధ్యంగా రాసుకొచ్చాడు ఆత్రేయ. ''భారతమాతకు జేజేలు.. బంగరుభూమికి జేజేలు'' అనే పాట అలాంటిదే. 'బడి పంతులు' చిత్రంలో ఆత్రేయ తన కలం నుంచి దేశభక్తి పొంగించాడు. ఆత్రేయ అదే చేత్తో మరో పాట రాసి ''కడుపుకాలే కష్టజీవులు.. ఒడలు విరిచి గనులు తొలచే'' అంటూ శ్రామిక పక్షాన నిలిచాడు. తోడికోడళ్లు చిత్రం ద్వారా ఆత్రేయ ఈ శ్రామిక చైతన్యం ప్రేక్షకులకు రుచి చూపించాడు. మరో చరిత్రలో ''బలే బలే మొగాడివోరు..'' పాట మనసును తాకుతుంటే... సిగ్గు తెరలని తొలగించుకున్న మగువ ప్రియుడితో ముచ్చట ఆడినట్టు, డాక్టర్ చక్రవర్తి సినిమాలో ''నీవులేక వీణ పలకలేనన్నది'' పాట ప్రేయసి పిలుస్తున్నట్టు, మాటికి మాటికి మనల్నే తలుస్తున్నట్టు మనసుకు అనిపిస్తుంది. జీవన తరంగాలు సినిమాలో ''ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో... ఎవరికి ఎవరు సొంతము? ఎంతవరకీ బంధము?'' పాట ఐహిక బంధాలు అశాశ్వతమని ప్రబోధించి వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అంతస్తులు చిత్రంలో రాసిన ''తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము..'' అంటూ శంగార రసం ఒలికించింది ఆత్రేయ కలం. ప్రేమనగర్ సినిమాలో ''కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల'' అనే పాటలో తొణికిసలాడిన రొమాన్స్ తెలుగు సినిమా వున్నంత కాలం బతికే వుంటుంది. ఆత్రేయ ''నేనొక ప్రేమ పిపాసిని..'' అని అంతరంగ ఆవిష్కరణ చేశాడు. ''సిరిమల్లె పూవల్లె నవ్వు..'' అంటూ నవ్వులు చిందించాడు. ''మాటరాని మౌనమిది'' అంటూ మనసు మీటాడు. ''జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై..'' అంటూ ఎదురు చూశాడు. ముఖ్యంగా కమల్ హాసన్, బాలచందర్ కలయికలో తెరకెక్కిన 'ఆకలి రాజ్యం' సినిమాలో శ్రీశ్రీ ప్రస్తావన ఉంటుంది. కానీ అందులో సందేశాత్మకమైన 'సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్' అంటూ ఆకలి కేకలను తన కలంలో వినిపించాడు. ''ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా'' అంటూ సమాజాన్ని ప్రశ్నించి, తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించాడు. ''రాళ్లల్లో ఇసుకల్లో'' ప్రేమికుల చేత ప్రేమలేఖలు రాయించాడు. కేవలం కలంతో మనసుకు గాలం వేయడం ఆత్రేయకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పొచ్చు. అభినందన సినిమాలో ''ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం'' అంటూ తన కలంతో రాగాలు పలకరించాడు. ఆత్రేయ కలానికి ఇళయారాజా బాణీలు.. ఎస్పీ బాలు గాత్రం ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రేమ గీతాలు రాయడంలో దిట్ట అయిన ఆత్రేయ అదే 'ప్రేమ' పేరుతో తెరకెక్కిన చిత్రంలో 'ప్రియతమా నా హదయమా' అంటూ అలతి అలతి పదాలతో ఆయన పలికించిన పదాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచే ఉన్నాయి. కొన్ని.. కొన్ని పాటలు ఆయనే రాయాలన్నంతగా ఉంటాయి. తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించడంలో దిట్టయిన ఆత్రేయ పాటలు తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించి, ఆయన రాసిన దాదాపు 1400 కు పైగా పాటలు రాసిలో, వాసిలో ఎంతో ప్రసిద్ధి పొందాయి. సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ సంగీత దర్శకులైన స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్, పెండ్యాల, ఎం.ఎస్.విశ్వనాథన్, ఇళయరాజా, సత్యం, చక్రవర్తిల స్వరకల్పనలో వచ్చిన ఆత్రేయ గీతాలు నాటికీ నేటికీ ఏ నాటికీ శ్రోతల హదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయాయి. నిలిచిపోతాయి.
మాటల రచయితగా..
ఆత్రేయ పాటలే కాకుండా, 'ప్రేమనగర్', 'డాక్టర్ చక్రవర్తి', 'మాంగల్య బలం', 'మనుషులు మమతలు', 'విచిత్ర బంధం', 'అర్ధాంగి', 'అదష్టవంతులు', 'ఆత్మబలం', 'చిలిపికష్ణుడు', 'బంగారు బాబు', 'బాబు', 'పునర్జన్మ', 'చక్రవాకం', 'మంచివాడు' తదితర సినిమాలకు మాటలు అందించి, సూపర్హిట్లు అందుకున్నాడు. ఆత్రేయ మాటలకంటే... పాటలే పదునైననవి. అందుకే తెలుగువారి గుండెల్లోకి దూసుకెళ్లాయి.
రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపించిన ఆత్రేయ
ఆత్రేయ రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపించే వారు అనేది ఒక సినీ నానుడి. మనసు మీద అయన రాసినన్ని పాటలు మరెవరు రాసి ఉండరు. టైం కి పాటలు, రాయకుండా ఆయన నిర్మాతలను ఎలా ఏడిపించే వారు అనేందుకు చాల ఉదాహరణలు ఉన్నాయి. అందులో మచ్చుకి, ఒక అనుభవం... డైరెక్టర్ పి.పుల్లయ్య, ఆత్రేయ మంచి స్నేహితులు, ఎంత అంటే, ఒకరిని ఒకరు బండ బూతులు తిట్టుకొనేంత. పుల్లయ్య అక్కినేని హీరోగా 'మురళీకష్ణ' అనే చిత్రం నిర్మిస్తున్న సందర్భంలో, హీరో విధిలేని పరిస్థితుల్లో హీరోయిన్ను వదలి వెళ్ళిపోతాడు, ఆ సందర్భానికి తగిన ఒక విషాద గీతం రాయవలసిన ఆత్రేయ ఎన్ని రోజులు గడిచినా, పాట ఇవ్వక పోవటంతో పుల్లయ్య ఆత్రేయ ఇంటికి వెళ్లి, ఆయనను కారులో ఎక్కించుకొని బయటకు తీసుకొని వెళ్లి, దారిలో బండ బూతులు తిట్టి, మధ్యలో ఆయనను కారు నుంచి దిగమని చెప్పి, ఇక నిన్ను పాట రాయమని అడగను. నువ్వు ఎక్కడ ఉన్న సుఖంగా ఉండాలి వెళ్లిపో అన్నారట. వెంటనే ఆత్రేయ పల్లవి దొరికింది పాట ఇచ్చేస్తాను పద అని, ''నీ సుఖమే నే కోరుతున్న.. నిను వీడి అందుకే వెళుతున్న'' అనే విషాద గీతం రాసి పుల్లయ్య చేతిలో పెట్టారట. ఆ పాట అక్కినేని నటనతో, ఘంటసాల గాత్రంతో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.
దర్శకుడుగా
ఆత్రేయ తన స్వీయ దర్శకత్వంలో 'వాగ్దానం' అనే చిత్రాన్ని నిర్మించాడు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడు. ఇందులో పాటలు దాశరధిగా ప్రసిద్ధులైన దాశరధి కష్ణమాచార్య రాయడం విశేషం. రసజ్ఞులైన ప్రేక్షకుల చేత ఎన్నోబిరుదులు పొందిన ఆచార్య ఆత్రేయ 1981లో 'అందమైన లోకమనీ' పాటకు నంది అవార్డు అందుకున్న ఆత్రేయ 1989 మే లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు పొందారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే 1989, సెప్టెంబర్ 13న ఎందరో సినీ అభిమానులను విషాదంలో ముంచుతూ ఈ లోకాన్ని విడిచివెళ్లాడు.
సంకలనంగా ఆత్రేయ రచనలు
ఇరువురి చూపులు ఒకటైతే తన్మయత్వం. ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకుంటే ప్రణయం. ఒకరికొకరు గుర్తొస్తే తీయని తలపులు. కొన్ని క్షణాలు దూరమైతే విరహం. ప్రేమించిన వ్యక్తి ఇక దక్కదని తెలిస్తే వేదన.. ఇలా ప్రేమ మనసుల్లో ఎన్నెన్ని కోణాలో..!? ఈ నిశ్శబ్ద తరంగాలను అక్షరాల మాలగా కూర్చడం బహుకష్టం. ఇంతటి భిన్న భావాలను ఒడిసిపట్టి తన కలంలో సిరాగా నింపి, 'తెలుగు పాట'కు హదయాన్ని చిగురింపజేసిన మనసు కవి ఆత్రేయ చనిపోయిన మరుసటి సంవత్సరం 1990లో అక్షర వాచస్పతి కొంగర జగ్గయ్య, సినీపరిశోధకులు పైడిపాల కలసి ''మనస్విని'' ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆత్రేయ సాహిత్యాన్ని 7 సంపుటలుగా సంకలనం తెచ్చి, తెలుగువారికి ఆత్రేయ అక్షరాల ఆస్తిని అందించారు. 'మనసుకవి'గా ప్రజల మన్ననలు పొందిన ఆత్రేయ మీద వివిధ విశ్వవిద్యాలయాల్లో 12 మంది పరిశోధనలు చేశారు.
వాన పాటలు
తెలుగు సినిమాల్లో వాన పాటలంటే ముందుగా గుర్తుకు వచ్చేది 'ఆత్మబలం' సినిమాలోని ''చిటపట చినుకులు పడుతూ ఉంటే..'' ఈ పాటను ఆత్రేయ.. మద్రాసు బీచ్ రోడ్డులో వెళుతుంటే.. సడెన్గా వర్షం పడిందట. అపుడు ఓ జంట చెట్టు నీడన పరిగెత్తుతూ కనబడ్డారట. వెంటనే ఆత్రేయ బుర్రకు పదును పెట్టి, టకాటకా ''చిటటప చినుకులు పడుతూ ఉంటే'' పాటకు శ్రీకారం చుట్టారు. తెలుగు సినిమాల్లో ఈ పాట ఇప్పటికీ చిర స్థాయిగా నిలిచి ఉంది.
'మనసు కవి'
''మనను మూగదే కానీ... బాసుండది దానికి....'' అంటూ మనసు భాషను పాటలో పలికించిన ఘనుడు ఆచార్య ఆత్రేయ. ''మనసు గతి ఇంతే...'' అంటూ మనసు స్థితిని వివరించిన ధీశాలి ఆయన. ''మౌనమే నీ భాష ఓ మూగ మనసా...'' అంటూ మనసు ఏ పరిస్థితుల్లో ఎలాంటి భాష పలుకుతుందో కనుగొన్న పరిశోధకుడు మన ఆత్రేయ. అందుకే సమకాలిక కవులు ఆత్రేయను 'మనసు కవి' అన్నారు, అంతేనా 'మన సుకవి' అనీ కీర్తించారు. 'మనసు'పై ఎందరో కవులు, సినీ గీతరచయితలు పాటలు రాసినా, 'మనసు' అన్న పదాన్ని తన హక్కుగా తీసుకొని ఆత్రేయలా ఉపయోగించుకున్న గీత రచయిత మరొకరు కనపడరు.
-పొన్నం రవిచంద్ర, 9440077499