Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రలో కొన్ని సంఘటనలు పునరావతం అవుతుంటాయి అంటారు. తెలంగాణలో కాకతీయుల విషయంలో అటువంటి సంఘటనే జరగుతున్నట్లుంది. కాకతీయులకు చివరి ఆనవాలుగా మనం ఇప్పటివరకూ భావించే ప్రతాపరుద్రుడు అత్యంత చిన్నవయసులోనే సింహాసనం అధిష్టించాల్సి వచ్చింది. ఉలూఫ్ుఖాన్ చేతిలో పరాజయం పొందిన ప్రతాపరుద్రుడు ఢిల్లీకి తరలించటం గురించి షాంసి సిరాజ్ ఆషీష్ రాసిన దాని ప్రకారం కానీ ప్రతాపరుద్ర చరిత్ర ఆధారంగా కానీ అతడే కాకతీయుల చివరి పాలకుడు. ఆ తర్వాత వారి వంశపు ఆనవాళ్ళు ఏవీ ఈ ప్రాంతంలో మిగలలేదు. కానీ అన్నమదేవుడి రూపంలో వీరి వంశ గౌరవం బస్తర్ ప్రాంతంలో పురుడుపోసుకుని పాదులు వేసుకుని క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. వారి ధ్వజం నుంచి దేవతార్చన వరకూ ఎన్నో సాంప్రదాయాలను కాకతీయుల పద్ధతిని తప్పకుండా పాటిస్తూ వచ్చారు.
తెలంగాణకు ఈశాన్య దిశగా అన్నమదేవుడు తనను నమ్ముకున్న కొద్దిమంది బలగంతో ప్రయాణించి ప్రస్తుత చత్తీస్ఘడ్ ప్రాంతానికి చేరుకున్నారట. ఇక్కడి రాజధాని వరంగల్‌లోని కాకతమ్మ, పద్మాక్షి, భద్రకాళి లాగానే దంతేశ్వరీ దేవి ఆలయాన్ని నిర్మించి ఆమెను వేడుకున్నాడట. అన్నమ దేవుడి కలలో దంతేశ్వరి మాత కనిపించి నాయనా దంతేశ్వరీ వస్త్రాన్ని ఈనేలపై పరచుకుంటూ వెనుదిరగిచూడకుండా ఎంతదూమైతే వెళతావో అంతభాగం నీ ఏలుబడిలోకి వస్తుందని ఆశీర్వదించిందట. అలా వెళ్ళీ వెళ్లీ చివరకు ఒకదగ్గర అమ్మ తన వెనక వస్తోందా లేదా అని అనుమానంతో ఒకసారి వెనుదిరిగి చూసాడట అక్కడివరకూ వెన్నంటి వస్తున్న అమ్మవారు అక్కడితో మాయం అయ్యారట. అలా వస్త్రం పరచినంత భూభాగం ఆ తర్వాతి కాలంలో అన్నమదేవుడి ఏలుబడిలోకి వచ్చిందని అవిధంగానే వస్తర్ అనే మాటనుంచి బస్తర్ అనే పేరు ఈ ప్రాంతానికి ఏర్పండిందనీ అంటారు. తెలంగాణలోని సమ్మక్క సారలమ్మల మాదిరి గానే అక్కడ దంతేశ్వరి దేవీ, మావళీ మాతలిద్దరి ఆలయాలూ పక్కనే పక్కనే శంఖిణీ, లంఖిణీ నదుల మద్య నిర్మించబడి వున్నాయి. ఈ దంతేశ్వరీ ఆలయంలోని శాసనాల ఆధారంగానే మలి కాకతీయుల వంశ చరిత్రను మనం ఇప్పుడు లింకులు తెగకుండా తెలుసుకోగలుగుతున్నాం. తెలుగునేలపై కాకతీయులు చెరువులను తవ్వించి వాటికి సాగరాలని పేరు పెట్టినట్లే అక్కడ జగదల్పూర్ ప్యాలెస్ దగ్గరలోనే దళపతిదేవుడు తనపేరుమీదుగా నిర్మించిన చెరువుకు దళపతిసాగరం అనే నామకరణం జరిగింది. బస్తర్ గడ్డమీద అనేకానేక అచ్చ తెలుగు శాసనాలు లభించడం, ఇప్పటికి అత్యధిక జనాభా తెలుగుకు చక్కగా మాట్లాడగలగటం ఈ రెండు ప్రాంతాల మధ్య శతాబ్దాల చారిత్రక అనుభందంగా చెప్పుకోవచ్చు.
అక్కడా వుందొక రుద్రమదేవి
కాకతీయ వంశంలో రుద్రమదేవిది ఒక ఉదాత్తమైన ప్రత్యేక చరిత్ర అనిచెప్పుకోవచ్చు. మగపిల్లలు ఎవరూ వారసులుగా లేని పరిస్థితుల్లో తనే భాద్యతలను భుజాన వేసుకుని తండ్రి గణపతిదేవుడికి ముసలి వయస్సు వచ్చేవరకూ అతనికి మారుగా భాద్యతలను మోసింది. ఇటు బిడ్డ ముమ్ముడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు పెరిగి పెద్ద అయ్యేంత వరకూ మళ్ళీ అతని భాద్యతలనూ రాజ్య ప్రతినిధిగా మోసింది. వద్ధాప్యంలో సైతం యుద్ధానికి వెళ్లినట్లు అక్కడే వీరోచితంగా అసువులు బాసినట్లు ఈ మధ్య జరిగిన వెలుగు చూసిన శాసనాలు కూడా నిరూపిస్తున్నాయి. కాకతీయులకు వారసులు లేని పరిస్థితుల్లో చాళుక్య వంశానికి చెందిన వీరభద్రుడిని వివాహం ఆడి వారికి కోడలుగా వెళ్లినప్పటికీ తన బిడ్డ ముమ్ముడమ్మను తిరిగి కాకతీయ వంశంలో రుద్రమ తమ్ముడికే ఇచ్చిమనవడిని సింహాసనం ఎక్కించి కాకతీయ వంశదీపం ఆరిపోకుండా మళ్లీ వెలిగించిన కార్యకుశలత ఆవిడది. అచ్చంగా అదే పద్ధతిలో బస్తర్ కాకతీయ వంశంలో కూడా వారసులు లేని స్థితి ఏర్పడింది. 1891 నుంచి 1921 వరకూ బస్తర్‌ను పాలించిన రుద్రప్రతాప దేవ్‌కు కుసుమలతా దేవికి పుట్టిన కుమారుడు కేవలం 8నెలల వయస్సులోనే చనిపోవడంతో ఆతర్వాతి ఆడబిడ్డ ప్రపుల కుమారిదేవి మాత్రమే మిగిలింది. 1910 పుట్టిన ఈమె 1921లో తండ్రి మరణించడం వల్ల 11 ఏళ్ళ వయసులోనే పదవిలోకి రావలసి వచ్చింది. ప్రపుల్లకుమారీ దేవి తన 17 ఏళ్ళ వయసులో రుద్రమ చాళుక్య ప్రభువును వివాహం చేసుకున్నట్లు ఈమె మయూరభంజ్కు చెందిన లాలాసాహెబ్ ప్రపుల్ల భంజ్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె పదవీకాలంలో ప్రజలకు అనేక మంచిపనులు చేసారు. ఇప్పుడు జగదల్ పూర్ నడిబొడ్డున పేదలకు ఉచితవైద్యాన్ని అందిస్తున్న మహారాణీ ఆసుపత్రి ఈమె పేరుమీదుగానే నిర్మించబడింది. రుద్రమ మరణంలాగానే ఈమెమరణం సైతం ఒకపెద్ద మిస్టరీ. 1936లో అపెండిసైటిస్ నొప్పితో ఇంగ్లాండ్‌లో వైద్యం పొందుతూ మరణించారు అంటుంటారు కానీ, అనారోగ్యమా హత్యాయత్నమా అనేది సందేహాస్పదం. ఇటు కాకతీయ వంశానికీ అటు భంజ్ల వారసత్వానికి ఈమె ఒక వెలుగు దివ్వెగా నిలబడ్డారు.
పేదలదేవుడు ప్రవీర్ చంద్ర
1929లో జన్మించిన ప్రవీర్ చంద్ర వంశపారంపర్య మహారాజుగానే కాక రాజ్యంగబద్దమైన యంఎల్‌ఏ గా సైతం భాద్యతలు నిర్వహించారు. అంతకు మించి ఆదివాసిల హక్కుల గురించి, సామాజిక వనరులు పెత్తందార్ల దోపిడీకి గురికాకుండా కాపాడే పనిలోనూ అత్యంత చిత్తశుద్ధితో పనిచేసారు. పేదలపక్షాన నిలబడి వారి దేవుడిగా కొనియాడబడ్డారు. 1966 మార్చి 25న ఆదివాసీ దేవతల ఊరేగింపు సందర్భంగా జరిగిన ర్యాలీ హడావిడి సాకుతో పోలీసు బుల్లెట్లు ఈయన గుండెల్లో దూసుకెళ్ళాయి. అయినా ఇప్పటికీ దేవుడి పటాల స్థానంలో ప్రవీర్ చంద్ర ఫోటో వుంటుందంటే ఈయనపై వారు ఏర్పరచుకున్న భక్తిని అర్ధం చేసుకోచ్చు. కాకతీయుల ప్రజాపక్షపాత బుద్ధి ఈయనలో ప్రస్పుటంగా తిరిగి తలెత్తిందేమో అనిపించకమానదు.
ప్రపుల్ల కుమారీ దేవి ముని మనవడు కమల్ చంద్ర
పేదల దేవుడు ప్రవీర్ కుమారుడు మహారాజా విజయచంద్ర అతని కుమారుడు మహారాజా సాహెబ్ భరత్ చంద్ర ఈయన బస్తర్ ప్రభువుగా 1970 నుంచి 1996 వరకూ పనిచేసారు. ఆ భరత్ చంద్ర కుమారుడే ప్రస్తుత బస్తర్ మహారాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ, ఆయనకో చెల్లెలు రాజకుమారి గాయత్రీ దేవి భంజ్ దేవ్ జగదల్ పూర్ ప్యాలెస్ కేంద్రంగా బస్తర్ ఉత్సవాలు, వేడుకలు, సాంస్కతిక సంబరాల్లో ప్రత్యేకపాత్రను పోషిస్తూనే, ఆ పాంత వాసులకు కావలసిన అవసరాలు తీరుస్తున్నారు. మరోవైపు రాజ్యసభ పదవి ద్వారానూ రాజ్యాంగ బద్దమైన హౌదాలో తన సేవలు అందిస్తున్నారు. 1984లో జన్మించిన కమల్ చంద్ర అత్యంత చిన్నవయసులోనే ప్రతాపరుద్రుడి లాగానే తప్పనిసరిగా సింహాసనాన్ని అధిస్టించాల్సివచ్చింది. ఇంకా అవివాహితులే అయిన కమల్ చంద్ర వివాహం ఏప్రాంతంతో మరో ముడిని వేసుకోనున్నాయో.
1323లో ప్రతాపరుద్రుని ఓటమి నుంచి ఈనాటి వరకూ ఏడువందల ఏళ్ళ కాలంలో అక్కడి మలికాకతీయుల పాయ బస్తర్ ప్రాంతానికే పరిమితమై ప్రవహిస్తోంది. ఇక్కడి చరిత్ర పుస్తకాల్లో కాకతీయుల ఆఖరి ప్రభువు ప్రతాపరుద్రునిగా చదువుతూనే వున్నాం. అచ్చంగా ఏడువందలేళ్ళ తర్వాత తెగిపోయిన లింకులను కలుపుతున్నట్లు. మొదట దంతేశ్వరీ మాత చీరను వరంగల్ భద్రకాళీ అమ్మవారికి పంపిన బస్తర్ రాజావారు. సమ్మక సారలమ్మ సారెను జగదల్ పూర్ ప్యాలెస్ లో అందుకోవడం ద్వారా సాంస్కతిక సంభందాలలో తొలిఅడుగు వేసారు. టార్చ్ తెలంగాణ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య పర్యవేక్షణలో కాకతీయుల పేరిణీ నత్య ప్రదర్శన అక్కడి 75 రోజుల దసరా ఉత్సవాల్లో ప్రదర్శింపబడింది. తెలంగాణ భాషాసాంస్కతిక శాఖ బస్తర్ దసరా ఉత్సవాలను దశ్యమాధ్యమంగా డాక్యుమెంటరీ చేయించింది.
వరంగల్ గడ్డ మీదకు మళ్లీ కాకతీయ వారసుడి రాక
2022 జూలై నెలలో కాకతీయ వైభవం పై తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సప్తాహాలలో పాల్గొనే నిమిత్తం జూలై నెలలో మహరాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ తెలంగాణ నేలపై అడుగిడనున్నారు. కాకతీయులు వివిధ రంగాలలో చేసిన కషిని ప్రతిబింబిస్తూ అరవింద్ ఆర్యా పకిడే ఏర్పాటు చేస్తున్న 777 చిత్రాల ప్రదర్శనను ఆరబించి కాకతీయ వైభవంపై మరింత అవగాహన కలిగించేందుకు వారి తొడ్పాటునందిస్తున్నారు. మరిన్ని వివిధ కార్యక్రమాలలో తమ భాగస్వామ్యం అందివ్వడంతో పాటు ఇరుప్రాంతాల చరిత్రపై రాదగిని పుస్తకాలను ఆహ్వానిస్తున్నామన్నారు. కాకతీయ తోరణాన్ని తమ ప్యాలెస్ ముంగిట నల్లరాతితో అచ్చంగా అనుకరిస్తూ మరో తోరణం ఏర్పాటు చేయడం ద్వారా ఈ అనుబంధాన్ని తర్వాతి తరాలు సైతం మర్చిపోలేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అప్పుడెప్పుడో ఏడువందల ఏళ్ళ క్రితం ప్రతాపరుద్రుడి రూపంలో తెగిపోయిన బంధం మల్లీ ఈనేలపై ఆయన వారసుడు కమల్ చంద్ర రూపంలో అడుగు పెడుతోంది. నిజంగానే ఇదొక ఉద్విగభరితమైన చారిత్రక ఘట్టం. చరిత్రలో కొత్త పేజీల రచనకు తొలిఅడుగు, పురా చారిత్రక సంభందానికి మరో మెరుపులీనే సొబగు. సహజ వనరుల పంపకం, పర్యాటక అభివద్ది విషయంలో రెండు ప్రాంతాల మధ్య చక్కటి అవకాశం.
- కట్టా శ్రీనివాస్, 9885133969