Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వంలో మూడొంతులు నీరు ఉంటే ఒక వంతు మాత్రమే భూమి ఉంది. జనాభా ఇంతై.. ఇంతింతై.. అన్నట్లుగా పెరిగిపోయి జగమంతా జనమయమైపోతోంది. జనం జనం ప్రభంజనం అంటూ పెరుగుతున్న జనాభాపై భయాందోళనలు మొదలయ్యాయి. ఈ జనాభా పెరుగుదల అనేది గత కొన్ని శతాబ్దాలుగా నడుస్తున్న ప్రక్రియ ఎప్పటికప్పుడు గతంకన్నా మరింత వేగంగా జనాభా పెరిగిపోతున్న దశ్యం ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తూనే ఉంది. చాలాకాలం వరకు జనాభా పెరగడమే తప్ప తగ్గుతున్న దాఖలాలు మనకు ఎక్కడా కనిపించనే లేదు. అంతే కాదు జనాభా పెరగడంతో పాటు అత్యంత వేగంగా పెరగడం మనకు ఆందోళన కలిగించింది. ఆరంభంలో ప్రపంచ జనాభా రెట్టింపు కావడానికి 100 సంవత్సరాలు పడితే అది కేవలం 12 సంవత్సరాలలోనే జనాభా రెట్టింపు అయ్యే పరిస్థితులను కూడా మనం చూసాం. ఈ పరిస్థితి అధిగమించడానికి అధిక జనాభా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ పథకాలు, దిద్దుబాటు చర్యలు, మొదలెట్టాం. ప్రపంచ గణాంక శాస్త్రవేత్తల, జనాభా నియంత్రణ నిపుణుల సలహాలతో జనాభా విస్ఫోటన సమస్యను చాలా వరకూ ప్రపంచం అదుపు చేయగలిగింది. అయితే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య మాత్రం అధిక జనాభా కాదు, అల్ప జనాభా లేదా జనాభా క్షీణత దాని వలన ఏర్పడే వయో విపత్తు. జనాభా పెరగడం సమస్య కాదు అధిక జనాభానే సమస్య. అయితే ఈ సమస్య తీరుతెన్నులు ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి.
ఒక దేశ భౌగోళిక విస్తీర్ణం అక్కడ లభించే సహజ వనరులు వాటిని ఉత్పాదక మార్గలో తీసుకు రావడానికి అవసర మైన మానవ వనరులు సంఖ్య గుర్తించి అంతకన్నా ఎక్కువ జనాభా ఉంటే దానిని అధిక జనాభాగా గుర్తించాలి. అంతకన్నా తక్కువ జనాభా ఉంటే అది అల్ప జనాభా అవుతుంది. అయితే అధిక జనాభా అభివద్ధికి ఎంత ఆటంకమో అల్ప జనాభా కూడా అంత కన్నా ఆటంకం అనేది నేడు గుర్తించ వల సిన సమయం ఆసన్న మయ్యింది. ఎందుకంటే ప్రతీ దేశ జనాభాలో విభిన్న వయోవర్గాల వారు ఉండటం సహజం. ఈ విభిన్న వయో వర్గాల వారిని స్థూలంగా 'పని చేస్తున్న' వారు, 'ఆధార పడిన' వారు అనే రెండు తరగతులుగా వర్గీకరిస్తారు. వీరిలో 15 నుంచి 59 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిని పని చేస్తున్న లేదా ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనే వయస్సులో ఉన్న వారుగా పరిగణిస్తారు. వీరు సాధారణంగా ఆర్జనపరులై వుండి తమ జీవనావసరాలను తాము సొంతంగా తీర్చుకోగలుగుతారు. అంతే కాకుండా తమపై ఆధారపడిన కొంత మందిని వీరు పోషిస్తారు. 15 సంవత్సరాల వయస్సు లోపు బాలలు, 59 సంవత్సరాలు పైబడిన వయస్సు గల వయోవద్ధులు ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన లేరు. ఈ స్థితిలో బాలలు తల్లిదండ్రులపై వద్ధులు తమ సంతానంపై ఆధారపడతారు లేదా ఇతరులను ఆశ్రయించి జీవిస్తారు. పని చేస్తున్న వారిలో ఇటువంటి ఆధారపడే జనాభా నిష్పత్తిని 'ఆశ్రిత నిష్పత్తి' (డిపెండెన్సీ రేషియో - డీఆర్) అంటారు. వీరిలో ఆధారపడే వారు పనిచేస్తున్న వారికంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది అభివద్ధిని ఆటంక పరుస్తుంది. ఆధారపడే జనాభా లేకుండా ఏ ఆర్ధిక వ్యవస్ధ ఉండదు. అయితే ఆధారపడే శాతం అధికంగా ఉండటం వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే కష్టపడే చేతులు తగ్గిపోయి ఆధారపడే వారు పెరిగి పోవడం అనేది వ్యవస్థకు ప్రమాద హేతువే. ఈ ప్రమాదం లేకుండా ఉండాలి అంటే రేపటి రోజుకు పని చేసే ప్రస్తుత ఆధారపడే జనాభా కావాలి. ఆ నిష్పత్తికి అనుగుణంగా జనాభా పెరిగితే అది ప్రమాదం కానేరదు. అంటే 15 సం||లు లేదా 20 సం||లు లోపు ఉన్న జనాభా ప్రస్తుతం ఎక్కువ ఉన్నప్పటకీ వాళ్ళు రేపు ఆర్జించే జనాభా అవుతారు. అదే 59 సంలు పైబడిన జనాభా ఎప్పటికి ఆధారపడే జనాభాగానే ఉంటారు..
వీరు సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే జనాభా పెరుగుదల క్షీణించకూడదు. అలా అని పరిధి మించి పెరగనూ కూడదు, తగ్గనూ కూడదు. జనాభా పెరుగుదల అభిలషణీయంగా జనాభా పెరుగుదల ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఏవో కొన్ని దేశాలు తప్ప మిగిలిన అనేక దేశాల్లో క్షీణిస్తున్న జనాభా అనేది ఆ దేశాలను గడగడ లాడిస్తోంది. ఈ క్షీణిస్తున్న జనాభా ప్రమాదకరమైన వయో విపత్తును మోసుకొస్తుంది అని అనేక అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జనాభా తగ్గడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే కదా అని అనుకోవచ్చు. అయితే ఈ తగ్గుతున్న జనాభా మొత్తం జనాభాలో వయో వద్దుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. జననాలు తగ్గడం వలన భవిష్యత్ లో ఉత్పాదక వర్గానికి అవసరం అయిన యువత తగ్గిపోతున్నారు. పెరిగిన వైద్య ఆరోగ్య సదుపాయాలు వలన ఆయుఃప్రమాణం మాత్రం అనూహ్యంగా పెరిగి జనాభాలో వద్ధుల సంఖ్య మాత్రం పెరిగి పోతుంది. రాను రాను స్త్రీలలో సంతాన ఉత్పత్తి రేటు క్షీణిస్తూ ఉంది. ఒక దేశ జనాభాను నిర్ణయించడంలో ఒక స్త్రీ తన జీవితకాలంలో ప్రసవించే సగటు పిల్లల సంఖ్యది కీలకపాత్ర అవుతుంది. సంతానోత్పత్తి రేటును ఈ కారకాలే ప్రభావితం చేస్తాయి. కాగా జనాభా సంఖ్యను నిర్వహించడానికి అవసరమైన కనీస రేటు (ఒక మహిళకు 2.1 సజీవ జననాలు) కంటే చాలా తక్కువగా ఉంటే జనాభా క్షీణించడం మొదలవుతుంది. సంతాన ఉత్పత్తి రేటు 2.1 గా ఉన్నప్పుడే నిలకడైన జనాభా కొనసాగుతుంది. దీనినే రీప్లేస్మెంట్ రేట్ అంటాము. రీప్లేస్మెంట్ రేటు అంటే జనాభాలో ఎటువంటి తగ్గుదల, పెరుగుదల ఉండకపోవడం. దేశంలో జనన, మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయిగా దీన్ని పేర్కొంటారు. ఇప్పుడు మన దేశంలో సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభా తగ్గుదల మొదలైందని సర్వేలు చెబుతున్నాయి. 1998-99లో మన దేశంలో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉండేది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు. అయితే ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ రేటు 2 కన్నా తక్కువ కావడం ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచం మొత్తంలో 2017లో 2.37గా ఉన్న ఈ సంతానోత్పత్తి రేటు 2100 వరకు క్రమంగా 1.66 వరకు తగ్గిపోనుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీని వలన 2100 నాటికి ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 2.37 బిలియన్లు ఉంటే, 20 ఏళ్ల లోపువారు కేవలం 1.7 బిలియన్లే ఉంటారని అంచనా.అంటే పని చేసే వారు కన్నా ఆధారపడే వారు అధికం అయిపోతారు. ఈ సమస్య అభివద్ధి పథంలో దూసుకుపోతున్న అనేక దేశాలను కూడా తాకింది. ఈ దేశాల్లో కూడా జనాభా వద్ధి రికార్డు స్థాయిలో పతనమవుతుండటం చూస్తూ ఉంటే ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో శ్రామిక శక్తి లేక ఆయా దేశాల వద్ధికి విఘాతం ఏర్పడే ప్రమాదముంది. జనాభా పెరుగుదలే కాదు జనాభా తగ్గుదల కుడా ఒక విపత్తే అనే ప్రమాద సంకేతాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రమేపీ విస్తరించాయి. దీని వలన కష్టపడే చేతులు తగ్గిపోయి తినే నోళ్లు పెరిగి పోతున్నాయి.
భవిష్యత్‌లో ఎదురయ్యే ఈ విపత్తు గురించి నేడే అనేక పరిశోధన సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. పరిష్కారం దిశగా చాలా దేశాలు దిద్దుబాటు చర్యలు ఆరంభించాయి. దీనిని బట్టి చూస్తే ఈ సమస్య కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైనది కాదని అర్థం అవుతుంది. ఇది నేడు యావత్తు ప్రపంచాన్ని పట్టి పీడించే సమస్యగా పరిణమించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ జనాభా క్షీణత అనేది మొదటిసారి ప్లేగు వ్యాధి కారణంగా 14వ శతాబ్దం మధ్యలో ప్రపంచ జనాభా క్షీణించడం చూసాం. అయితే ప్రస్తుతం మాత్రం సంతానోత్పత్తి క్షీణత ద్వారా జనాభా తగ్గుతుండటం ఇదే మొదటిసారిగా ఎదురయ్యిందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఈ శతాబ్దం అంతానికి ప్రపంచ వ్యాప్తంగా సంతాన పునరుత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోనున్నదని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.8 బిలియన్ ఉండగా.. 2064 నాటికి 9.7 బిలియన్ గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత 2100లోగా 8.79 బిలియన్కు తగ్గుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఈ క్షీణత ప్రభావాలను దేశాల వారీగా పరిశీలిస్తే ఆశ్చర్యపోయే గణాంకాలు బయట పడ్డాయి.
దేశాల వారీగా జనాభా క్షీణత ప్రభావాలు....
భారత దేశం..
వివిధ అంచనాల నివేదికలు ప్రకారం భారతదేశ జనాభా 2048 నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. అప్పటికి దేశ జనాభా సుమారు 160 కోట్లకు చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గనుందని జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం... ఈ శతాబ్ది రెండో భాగంలో భారత్ జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. 2048తో పోలిస్తే 2100 నాటికి దేశ జనాభా 32 శాతం తగ్గి 109 కోట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నారు.
అంటే, ఇప్పటితో పోలిస్తే భారత జనాభా 30 నుంచి 35 కోట్ల మంది వరకు తగ్గిపోతుంది.
ఐక్యరాజ్యసమితి, లాన్సెట్ నివేదికలు ప్రకారం చూస్తే భారత్‌లో చాలా చోట్ల గర్భధారణ రేట్లు శరవేగంగా పడిపోతున్నాయి. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలలో తప్ప అన్ని చోట్లా గర్భధారణ రేట్లు త్వరలోనే ఋణాత్మకం కాబోతున్నాయి. వీరి అంచనాలు ప్రకారం...
భారతీయ మహిళల సంతానోత్పత్తి రేటు 1969లో 5.6గా ఉండగా... అది 1994లో 3.7కు, 2019లో 2.3కు పడిపోయినట్లు ఒక అంచనా. అదే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 తాజా గణాంకాలు ప్రకారం పరిశీలిస్తే. 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తుంది. అంటే సంతానోత్పత్తి రేటు 2.0 గా ఉంది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేగాక, తొలిసారిగా సంతానోత్పత్తి రేటు .. రీప్లేస్మెంట్ రేటు కంటే దిగువకు పడిపోవడం చాలా ఆందోళన కలిగించే విషయంగా పేర్కొనవచ్చు. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) అంచనా ప్రకారం. ప్రస్తుతం ఉన్న 138 కోట్ల నుంచి 109 కోట్లకు పడిపోయినప్పటికీ రాబోయే రోజుల్లో చైనాను అధిగమించి జనాభాలో భారత్ నంబర్‌వన్ స్ధానానికి చేరుకుంటుంది అని విభిన్న అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
అయితే ఇదివరకు అంచనా వేసిన దానికంటే ప్రపంచ జనాభా 200 కోట్లు తక్కువగా ఉంటుందని లార్సెన్ అధ్యయనం స్పష్టం చేసింది.
పెరుగుతున్న వద్ధ జనాభా
ఐక్యరాజ్యసమితి జనాభా నిధి విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ జనాభాలో 60 ఏళ్లు దాటినవారి వాటా ఏటా పెరిగిపోతూ ఉంది. 2015లో అది కేవలం ఎనిమిది శాతం ఉండగా, 2001-11 మధ్య దశాబ్ద కాలంలో 27 కోట్లకుపైగా పెరిగింది. ఇలా పదేండ్ల కాలంలో వద్ద జనాభా 35 శాతం పెరిగిపోవడం మన దేశంలో ఆందోళనకరమైన విషయంగా చెప్పవచ్చు ఈ తరహా పరిణామాలు దేశ అభివద్ధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. అయినా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే యువ జనాభా అధికంగా ఉన్నారు. ఎందుకంటే మన దేశ జనాభాలో మొత్తం 0 నుంచి 14 ఏళ్లు, 10 నుంచి 24 ఏళ్ల వయసున్న వారు కలిపి 27 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారు 67 శాతం మంది ఉన్నారు. 65 ఏళ్లు పైబడిన వారు 6 శాతం మంది మాత్రమే ఉన్నారు. అయితే రానున్న కాలంలో జననాలు రేటు క్రమేపీ తగ్గిపోతే తప్ప ప్రస్తుతానికి అయితే ఇంకా సమస్య తీవ్రత లేదు.
2019-21ప్రకారం మన దేశంలో ఐదు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంతకంటే తక్కువగానే ఉంది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్లలో మాత్రం ఇది ఇంకా రీప్లేస్మెంట్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 2.4గా ఉండగా.. బిహార్‌లో 3గా తేలింది. దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు సిక్కింలో నమోదైంది. అక్కడ టీఎఫ్ఆర్ రేటు 1.1గా ఉంది. ఇక లద్దాఖ్‌లో సంతానోత్పత్తి రేటు ఐదేళ్లలో గణనీయంగా తగ్గి 2.3 నుంచి 1.3కు పడిపోయింది. అండమాన్ నికోబార్, గోవాల్లోనూ బర్త్ రేటు 1.3గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే వయో విపత్తు మన దేశాన్ని తాకింది అనే చెప్పవచ్చు.
చైనా
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న చైనాలో విస్తుపోయే పరిణామం జనాభా క్షీణించడం. ఎందుకంటే ఆ దేశంలో జనాభా భారీగా తగ్గుముఖం పడుతోంది. 2021లో కేవలం 4.80 లక్షల జననాలే నమోదయినట్టు చైనా జాతీయ గణాంకాల విభాగం తాజా నివేదికలు చెబుతున్నాయి. గతేడాది 141.21 కోట్ల నుంచి 141.26 కోట్లకు చేరింది. చైనా జనాభా 660 మిలియన్ల నుంచి 1.4 బిలియన్లకు పెరిగిన నాలుగు దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే మొదటిసారి. చైనాలో జనాభా తగ్గు ముఖం అనేది 1959-1961 నాటి మహా కరువు సందర్భంలో ఏర్పడింది. ఆ తరువాత క్షీణత అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. జనాభా విషయంలో ప్రపంచంలోనే ప్రథమ స్ధానంలో ఉన్న చైనాలో జనాభా పరిమాణం తగ్గిపోవడం అనేది అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. అయితే చైనాలో కఠినమైన కోవిడ్ కట్టడి నేపథ్యంలో పిల్లలను కనేందుకు ఇష్టపడకపోవడమే జననాల మంద గమనానికి దోహదపడి ఉండొచ్చనే వాదన కూడా ఉంది. అయితే ఇది హఠాత్తుగా సంభవించింది మాత్రం కాదు. గత కొంత కాలంగా చైనాలో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుంది అనేది మాత్రం సత్యం. దశాబ్దాలుగా చిన్న కుటుంబాలకు అలవాటు పడినవారు పెద్ద కుటుంబాలుగా ఎదిగేందుకు సుముఖంగా లేరు. అంతేకాదు చైనాలో వివాహాలు చేసుకోవడానికి ముందుకు వచ్చే వారు అత్యల్పం అనేది రుజువయ్యింది. మరో పక్క దేశంలో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయి వద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం చైనాలో వందమంది పనిచేసే వయస్కులు 20 మంది వద్ధులను సంరక్షిస్తున్నారు. వీటిన్నింటికీ మించిన సంతాన సాఫల్యం గల మహిళల సంఖ్య చైనాలో రోజురోజుకు బాగా తగ్గిపోయింది. ఇవన్నీ కూడా చైనాలో సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత ఏడాది చైనాలో నమోదైన వివాహాలు 36 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయంటేనే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది దేశ జననాల రేటులో మరింత క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్..
ఈ శతాబ్దం అంతానికి ఇరాన్లో సంతాన ఉత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతుంది అంచనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ జనాభివది రేటు ఒక శాతం కన్నా తక్కువుగా ఉంది. దీని కారణంగా దేశంలో వద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగి పోయే ప్రమాదం పొంచి ఉంది. ముందు ముందు ప్రపంచములోనే అధిక వద్ధులు ఉన్న దేశంగా త్వరలోనే ఇరాన్ అవతరించనుంది. దీనిని దష్టిలో ఉంచుకుని ఇరాన్ ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆరంభించింది. ముఖ్యంగా హాస్పిటల్స్‌లో వాసెక్టమీ వంటి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను పూర్తిగా నిలిపి వేసింది.
జపాన్..
ప్రపంచంలోనే అభివద్ధి చెందిన దేశాలలో జపాన్ అగ్రగామి. 20 వ శతాబ్దంలో సాంకేతికంగా కూడా జపాన్ అగ్ర స్థానంలో ఉంది. ఇక్కడ లభించే అధిక ఆదాయాలు వలన ప్రజలలో జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగయ్యాయి. దీని వలన ఇక్కడి ప్రజల ఆయుఃప్రమాణం గణనీయంగా పెరిగిపోయింది. దీని వల్లనే జపాన్‌లో 100 సంవత్సరాలు పైబడి జీవించే వాళ్ళు అత్యధికులు ఉన్నట్లు తేలింది. దీని ఫలితంగా మరణాల రేటు బాగా క్షీణించి వద్ధులు సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. మరొక పక్క జననాల రేటు కూడా బాగా తగ్గిపోయింది. ఈ పరిణామం జపాన్‌కు చాలా ఇబ్బంది పడే స్ధితికి తీసుకువచ్చింది. 2017 నాటికి జపాన్ జనాభా 12.7 కోట్లు కాగా అది ఈ శతాబ్ది అంతం నాటికి 5.3 కోట్లకు పడిపోయే ప్రమాదం ఉందని లాన్సెట్ నివేదిక తెలియ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జపాన్‌లో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న పిల్లల జనాభా 14.93 మిలియన్లు. 1950 తర్వాత ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. జపాన్ మొత్తం జనాభాలో పిల్లలు 11.9 శాతం. 47 ఏళ్లలో ఇదే కనిష్ఠం.
4 కోట్లకుపైగా ఎక్కువ జనాభా ఉన్న 33 దేశాల్లో పిల్లల నిష్పత్తి అత్యంత తక్కువగా ఉంది జపాన్‌లోనే కావడం గమనార్హం. ఇది దక్షిణ కొరియాలో 12.2 శాతం, ఇటలీలో 13.3శాతంగా ఉంది. ఈ పరిణామాలు జపాన్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి.
బ్రెజిల్
గత 40 సంవత్సరాలలో బ్రెజిల్ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. 1960 లో ఇక్కడ సంతానోత్పత్తి రేటు 6.3 గా ఉండగా అది నేడు దారుణంగా 1.7 కు పడిపోయింది. 2017లో 21 కోట్లుగా ఉన్న జనాభా శతాబ్దం అంతానికి 16.4 కోట్లకు తగ్గిపోనుంది అనే హెచ్చరికలు వెలువడ్డాయి.
ఇటలీ
ఇటలీలో అయితే సగానికి పైగా జనాభా తగ్గిపోనుంది. 2017 లో 6.1 కోట్లుగా ఉన్న జనాభా శతాబ్దం అంతానికి 2.8 కోట్లకు క్షీణిస్తుందని అంచనాలు చెబుతున్నాయి. మహిళల సంతానోత్పత్తి రేటు విషయంలో ఐరోపా దేశాల్లోనే ఇటలీ అట్టడుగున ఉంది. పిల్లలు లేని ఇటలీని భవిష్యత్తులో ఊహించుకోలేమని ప్రధాని ద్రాఘి కూడా వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. ఇటలీలో జననాల రేటు గణనీయంగా తగ్గడంపై ఇటలీ పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా వద్ధి క్షీణతపై ప్రజల్ని హెచ్చరించిన ప్రధాని మారియో ద్రాఘితో ఆయన గొంతు కలిపారు. ఇటలీ ప్రభుత్వం మొదటి సంతానం తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. పిల్లల్ని కనాలనుకునేవారికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా కల్పించేలా సుదీర్ఘ కుటుంబ కేంద్రీకత విధానాలను రూపొందించే వ్యూహాలను ప్రభుత్వం రూపొందించడం మొదలు పెట్టింది. యువత దేశం వీడకుండా స్థిరమైన ఉద్యోగాలు, సొంతిళ్లు, భద్రత కల్పించడం ద్వారా వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పలేక పోతున్నారు.
అమెరికా
అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఈ వయో విపత్తు సమస్య తప్పలేదు. ఈ మధ్యనే సెన్సస్ బ్యూరో అమెరికా జనాభా వద్ధి నెమ్మదించినట్లు ప్రకటించింది. గత పదేళ్లలో అమెరికా జనాభా 7.4 శాతం మాత్రమే పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుత అమెరికాలో జననాల రేటు బట్టి 2062 నాటికి అమెరికా జనాభా 36.4 కోట్లకు చేరుతున్నట్లు 2100 నాటికి 33.6 కోట్లకు పరిమితమైపోతుందని తెలిపింది. అత్యధిక జనాభా దేశాల్లో ఇది నాలుగో స్థానంలో నిలుస్తుంది. అది కూడా ఆ దేశంలోకి వలస వచ్చే వారితోనే ఇది సాధ్యమని అంచనాలు తేల్చాయి. 2020 ఏప్రిల్ 1 నాటికి ఆ దేశ జనాభా 33.1 కోట్లుగా ఉందని వెల్లడించింది. 1930 తర్వాత అతి తక్కువ జనాభా వద్ధి రేటుగా ఇది నమోదు అయింది. అమెరికా చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప వద్ధిగా ప్రభుత్వం పేర్కొంది. దీనికి ప్రధాన కారణంగా 2020లో ప్రతి 1000 మంది మహిళల్లో ఫెర్టిలిటీ రేటు 64.1 నుంచి 55.8 శాతానికి పడిపోవడమేనని చెబుతున్నారు.
రష్యా
గత మూడు దశాబ్దాలుగా రష్యా.. తక్కువ జననాల రేటు, తక్కువ ఆయుర్ధాయం సమస్యలతో సతమతమవుతోంది. దీనికి మహమ్మారి తోడవడంతో ప్రస్తుతం స్థానికంగా జనాభా సంక్షోభం ముదిరింది. అయితే, సోవియట్ యూనియన్ పతనానంతరం ఆర్థిక అనిశ్చితి కారణంగా 1990ల్లో జననాల రేటు మరింత పడిపోయింది. కొవిడ్ విజంభణ, ఇతరత్రా కారణాలతో.. గతేడాది దేశ జనాభా భారీగా పడిపోయింది. ఏకంగా పది లక్షలకంటే ఎక్కువ మంది తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల సంస్థ 'రోస్స్టాట్' తాజాగా వెల్లడించింది. కొవిడ్ బారినపడే 6.60 లక్షల మంది మరణించినట్లు రోస్స్టాట్ తెలిపింది. 2020లోనూ రష్యా జనాభా 5 లక్షలకుపైగా తగ్గిపోగా.. ఈసారి అది పది లక్షలు దాటింది. రష్యా ప్రభుత్వం జనాభా వద్ధి కోసం మహిళలకు కనిష్ఠ సంతానోత్పత్తి రేటును 2.1గా నిర్ణయించగా ప్రస్తుతం మాత్రం ఇది 1.5గా మాత్రమే ఉందట. 1990లలోనే జననాల రేటు ఇదే విధంగా పడిపోవడం వంటి పరిస్ధితులు రష్యా జనాభా క్షీణతకు కారణం అవుతున్నాయి.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియా జనాభాపై కరోనా ప్రభావం ఎక్కువగా పడింది. దీంతో 2020లో దక్షిణ కొరియా జనాభా మొట్టమొదటిసారిగా తగ్గడం ఆరంభం అయ్యింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనన రేటు 11 శాతం తగ్గినట్టు తేలింది. ఈ కారణంగా దాదాపు 21 వేల జనాభా తగ్గింది. ప్రస్తుతం ఈ దేశ జనాభా 5.18 కోట్లుగా ఉంది. అంతే కాదు దక్షిణ కొరియాలో పెళ్లిళ్లు చాలా మంది ఆలస్యంగా చేసుకోవడమే కాదు. పెళ్లిళ్లు అయిన వారు సైతం పిల్లలను ఆలస్యంగా కనాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా జనన రేటులో తగ్గుదల కనిపించినట్టు అధికారులు చెబుతున్నారు. జనన రేటులో చూస్తే దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆఖరి స్థానంలో ఉంది. దక్షిణ కొరియాలో యువకుల సంఖ్య తగ్గుతుండటంతో.. అనేక సంవత్సరాల నుంచి జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా అనేక సబ్సిడీలను సైతం ఇస్తోంది. అయినా ఆశించదగ్గ మార్పు కనిపించడం లేదు. మొత్తం మీద జనాభా పెరుగుదలను అరికట్టనంత సులభంగా జనాభా క్షీణత సమస్యను అధిగమించడం సులభం కాదనే విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ నేడు గుర్తెరిగాయి.
ఏదిఏమైనా భారతదేశం మాత్రం జనాభా విషయంలో చైనాను దాటి ప్రధమ స్థానాన్ని చేరుకోవడం మాత్రం తథ్యం. అయితే ఈ స్థితిలో మన దేశం అధిక జనాభా సమస్య కన్నా జనాభా క్షీణత వలన యువత జనాభా తగ్గిపోయి వద్ధుల సంఖ్య పెరిగి వయోవిపత్తు సమస్యను ఎదుర్కోవలసి రావడం కూడా తధ్యమే. ఇంతకాలం జనాభా నియంత్రణ ద్వారా ప్రభుత్వం అనుసరించిన విధానాలు సత్ఫలితాలు ఇవ్వబట్టే జనాభా విస్ఫోటనం అధిగమించాము. అయితే ఇప్పుడు జనాభా క్షీణత వలన ఎదురయ్యే సమస్యను అరికట్టడం అనేది సులభం కాదనే చెప్పాలి. ఎందుకంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల అక్షరాస్యత బాగా పెరిగింది. ముఖ్యంగా స్త్రీ విద్య ప్రాముఖ్యం పెరిగి ఉపాధి పొందడంలో స్త్రీలు ముందు వరుసకు చేరారు. స్త్రీలకు కుటుంబాన్ని పరిమితం చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు గ్రహించి పరిమిత సంతానాన్ని పాటిస్తున్నారు. దానితో పాటు బాల్య వివాహాలు తగ్గి వివాహాలు ఆలస్యంగా జరగడం ఆరంభమయ్యాయి.
అలాగే రెండు గర్భాల మధ్య వ్యవధీ పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలకు కుటుంబ నియంత్రణపై మాత్రమే కాదు, ఎక్కువ మందిని కనటంతో వచ్చే ఆర్థిక ఇబ్బందులపై కూడా అవగాహన వచ్చింది. ఈ అవగాహన ముఖ్యంగా పేద ప్రజల్లో బాగా వచ్చింది. పిల్లలను బాగా చదివించాలి అనే తష్ణ తల్లిదండ్రులలో బాగా పెరిగింది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకుని ఉండటం వల్ల పరిమితి సంతానాన్ని కోరుకుంటున్నారు. ఈ కారణాల వల్ల గర్భధారణ రేట్లు వేగంగా పడిపోతున్నాయనే చెప్పవచ్చు. మరొక పక్క చూస్తే అలస్యపు వివాహాలు, వత్తిడితో కూడిన ఉద్యోగాలు పిన్న వయసులోనే అనేక మానసిక రుగ్మతలు వలన వ్యంధత్వం అనేది నేడు అధికంగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి సంఘటనలు నేపథ్యంలో ఎక్కడ చూసినా సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు జరుగుతున్నాయి అంటే కారణం ఇదే అని చెప్పవచ్చు. మన సౌకర్యాలు కోసం ఇప్పటికే పర్యావరణానికి తీవ్ర హాని చేసేసాం. తెలిసీ ఇంకా చేస్తూనే ఉన్నాం. దీనివలన అనేక జీవులు అంతరించి పోయాయి. మరి కొన్ని అంతరించి పోయే దశలో ఉన్నాయి. పర్యావరణ కాలుష్య ప్రభావం వలన మానవులలో వీర్య కణాలు క్షీణించి జనాభా తగ్గి పోతున్నదని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పటికే చాలా మందిలో సంతానలేమి ఎక్కువుగా కనిపిస్తూ ఉంది. ఈ విపత్తు మరింత తీవ్రమైతే మాత్రం రానున్న రోజుల్లో వ్యంధత్వం పెరిగి మన ఉనికికే ప్రమాదం ఏర్పడనుంది. చివరకు మానవ జాతి కూడా అంతరించి పోయే ప్రమాదం అతి దగ్గరలోనే ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే వాస్తవం అయితే ప్రపంచ మానవాళి అంతరించి పోతున్న జాబితాలోనికి చేరే అవకాశాలు లేక పోలేదు. అధిక జనాభా సమస్యను చాకచక్యంగా పరిష్కరించిన ప్రపంచం నేడు జనాభా క్షీణత తద్వారా ఏర్పడే వయో విపత్తు పరిష్కారం విషయంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వాలు విభిన్న పరిశోధనలకు ప్రాధాన్యతలు ఇస్తున్నాయి. 1987 జూన్ 11న ప్రపంచ జనాభా 500కోట్లు దాటగా.. దానిపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 1989 నుండి ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ జనాభా సమస్యపై చర్చలు వ్యూహాలు రూపకల్పన చేయడంతో పాటుగా ప్రతీ సంవత్సరం ఒక థీమ్ ప్రకటించి దానిపై ప్రత్యేక దష్టి పెట్టడం ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం 2022 8 బిలియన్ల ప్రపంచం అందరికీ స్థితి స్థాపకంగా ఉండే భవిష్యత్తు వైపు - అవకాశాలను వినియోగించుకోవడం, అందరికీ హక్కులు, ఎంపికలను నిర్ధారించడం'' అనే ధీమ్ ప్రకటించింది. రానున్న కాలంలో ఈ వయోవిపత్తు సమస్యకు కూడా ఈ సదస్సులలో పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578