Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక చాలు అని సంతప్తి చెందటానికి పోరాటం దాహపు గొంతు కాదు.. అది సముద్ర స్వరం.. అందుకే ప్రతిరోజొక పోరాటం, మరుసటి రోజొక యుద్ధం.. పోరాటం ఆగదు, అది కాలానికి చిహ్నమైన కొనసాగింపు.. వ్యక్తి స్వాతంత్య్రానికి నిదర్శనంగా వ్యక్తిగత పతాకాలుంటే తెలుస్తుంది ఆదేశంలో స్వేచ్ఛ ఎంతో.. స్వాతంత్య్రం దేశానికేనా జనానికి కూడానా అన్నది ఎరుకవుతుంది, స్వాతంత్య్ర సిద్ధాంతానికి ప్రభుత్వాలు కట్టుబడుతున్నాయో లేదో అవగతమవుతుంది. వలస పాలకుల కొనసాగింపైన నయా బానిసత్వమా, లేక నిజమైన స్వాతంత్య్రమో ఫ్రీడంను సింబలైజ్ చేసే జెండానొకటి రూపొందించాలి.. ఆన్లైన్ దేశంలో జనం తమ సందేశాన్ని డీపీల్లా ఎగరేయటానికి..
'సాధించిన దానికి సంతప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటేనోయి'.. అని మహాకవి శ్రీశ్రీ అరవయ్యేళ్ల క్రితమే చెప్పారు. వెలుగు నీడలు సినిమా కోసం ఆయన 'పాడవోయి భారతీయుడా' పాటలో ఇలా కొరడా ఝుళిపించారు.. దేశ స్వాతంత్య్ర సంబురాల నేపథ్యంలో సాగే ఆ పాటలో పై వాక్యాలుండటం.. అదే సందర్భాన్ని ఇప్పుడు అదే రీతిన మనం చర్చించుకుంటుండటం ఆశ్చర్యకరం.. ఆరు దశాబ్దాలకు ముందే అభ్యుదయ కలం ఆ హెచ్చరిక చేసింది.. కవి వాక్కు ప్రాంతానికి కాదు దేశవ్యాప్తంగా ఆపాదించారు.. వందేమాతరం మంత్రంతో సరిపెట్టకుండా ఏ తరానికాతరం స్వాతంత్య్ర పరిరక్షణలో జాగురకత వహించాలని ముందు చూపుతో సూచించారు.. కవి అలా అన్న ఆరోజుల్లో ఆవాక్యాలకు ఎంత ప్రాధాన్యముందో ఇప్పుడూ అంతకు మించి ఆలోచించాల్సిన అవసరత ఉంది.. దానిని బట్టి ఏమర్థం అవుతోంది అంటే.. పాలకులు మారితేనే సంబురం కాదు పరిస్థితులు మారనంత కాలం పోరాటం అనివార్యం అని.. 'స్వాతత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదు' అన్న తన పాటలోని మర్మం అది.
ఇపుడు తోటివారిని గుర్తు పట్టేట్టు లేదు ఎప్పటి నుండో సుపరిచితమే అయినా వారి గొంతును పోల్చుకునేటట్టూ లేదు.. మొన్నటి కరోనాలో మనుషులు మాయమై మాస్కులు నిండినట్టు ఇప్పుడూ జనం కనిపించకుండా పోయారు.. వారి సొంత ముఖాలు సోషల్ మీడియా డీపీలయ్యాయి.. వాళ్ల గొంతుకలు మూడు రంగులయ్యాయి.. దేశ జనాభా అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల డీపీలు.. పత్రికల్లో ప్రచురించేవన్నీ వార్తలు కానట్టే అవన్నీ దేశభక్తి నిరూపణావశ్యక ప్రేరణ ప్రకటనలు.. ఇవన్నీ సెల్ఫీలు ఇవన్నీ స్వయం బలులు..కొనసాగుతున్న మొక్కులు, చెల్లిస్తున్న ముడుపులు.. పాశ్చాత్య చొక్కా తొడుక్కున్నా మనది గ్రామీణ భారతం కదా..
దేశం గత కొద్ది రోజులుగా మూడు రంగుల్లోకి మారింది.. దేశీయ రక్తం త్రివర్ణమయ్యింది.. గ్రామ దేవత ఆవహించినట్టు స్వదేశీ భక్తి పూనకం మెట్రోల్లోనూ కొనసాగుతోంది.. ఏడున్నర దశాబ్దాల అమ్మ పుట్టిన రోజు కదా బిడ్డల మానసిక స్థితి పతాక స్థాయిలోనే ఉంటుంది.. తమ ముఖాలో, తమ వారి ఫొటోలో మరిచిపోయి సోషల్ మీడియా డీపీల్లో మువ్వన్నెలు రెపరెపలాడుతున్నాయి.. మహోన్నత దేశపు మహోజ్వల స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబురాల జాతర మిన్నంటుతోంది..
ఎందుకీ సంబురం, ఎందూకీ జాతర, ఏమిటీ తిరునాళ్ల. మొక్కు చెల్లింపులు, ముడుపు సమర్పణలు, ఆపద గట్టెక్కినందుకా ఊపిరి పీల్చుకునే ఊరట దక్కినందుకా.. స్వాతంత్య్రం అర్థం ఏమిటి స్వేచ్ఛా గాలి పీల్చటమే కదా.. మరి రహీముకు, రాబర్టుకు, పోరు పిడికిళ్లకు, ఎర్ర కొడవళ్లకు నినాద గొంతుకలకు, నిరసన గళాలకు, కలాలకు, దేశం కన్న కలలకు స్వేచ్ఛ దక్కుతోందా.. హరిత హారమని ఇన్ని కోట్ల మొక్కలు నాటుకున్నా కోరిన గాలి వీస్తోందా..
అర్ధరాత్రైనా సరే ఆడవాళ్లు నిర్భయంగా గమ్యం చేరినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మాహాత్ముడే సెలవిచ్చాడు కదా.. లక్ష నిఘా కళ్ల తెరల కమాండ్ కంట్రోల్ కాలంలో మహిళకు ఆ స్వాతంత్య్రం ఉందా.. హక్కు ఉల్లంఘన ఆపద సమయాన్ని, స్వేచ్ఛహరించబడే ప్రమాద సందర్భాన్ని అనుసంధానం సాధ్యమవుతుందా..
స్వాతంత్య్ర దినోత్సవం అంటే అలనాటి అకత్యాలకు దురాగతాలకు కారణమైన ఆంగ్లేయులు, బ్రిటీష్ వలస పాలకుల నిరంకుశాల్ని తిట్టుకునే సందర్భం. బానిసత్వంపై తిరుగబడి, పోరాటం సాగించి తెల్లోళ్లను తరికొట్టిన మహా నాయకులు, అమర యోధులను స్మరించుకునే సమయం.. పతాకావిష్కరణలో రాలే పువ్వులు దేశమాత పాదాలకు జన హదయాంజలి.. అవి పువ్వులూ కావు కోట్లాది దేశప్రజల గుండెల దేశభక్తి ఉప్పెన.. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవటం అంటే సమర యోధులను స్మరించటం వారి త్యాగాలు బలిదానాలను కీర్తించటం.. అంతే కాదు ఆ మహనీయుల బాటలో నడుస్తూ వారి పోరాట స్ఫూర్తిని అంది పుచ్చుకుంటామని ప్రతిజ్ఞ చేయటం..
మూడు రంగుల జెండా ఎగురేయటం దేశ స్వాతంత్య్రానికి చిహ్నం.. వ్యక్తి స్వాతంత్య్రానికి ఏది చిహ్నం.. సంతోషాల జెండా, ఆనంద పతాకం కదా.. నిర్భయాలు, నిర్భంధాలు లేని , అణిచివేతలు, ఆక్షేపణలు, నల్ల చట్టాల ప్రయోగాలు చీకటి రోజులుండని వెలుగు పూల వేకువ కదా.. ఇనుప ముళ్ల కంచెలా చుట్టలు చుట్టలుగా రోజులరోజుల ఈ పగళ్లన్నీ మన స్వాతంత్య్రమేనా..
అప్పటి దొరల బూచీ సరే.. వారికి కొనసాగింపవుతున్న నయా పెత్తందార్ల పాలనా తీరేమిటి..
హిజాబ్ ధరించటాన్ని అడ్డుకోవటానికి గురైన యువతి స్వతంత్య్రలేమికి గురైనట్టు భావించదా, తమ సంస్కతి సంప్రదాయాలకు కలిగించిన భంగంగా ఆరోపించదా.. తిండిపై ఆంక్షలకు గురవుతున్న, దాడుల పాలవుతున్న వర్గాలు అది తమ ఆహార స్వేచ్ఛకు కలిగించిన అవరోధం అని వాపోదా.. మైనారిటీ మత ప్రచారాలను అడ్డుకోవటం వారి విశ్వాసాలను స్వాతంత్య్రాన్ని హరించినట్టే అని అనుకోరా..
ప్రభుత్వాల విధానాలను, పాలకుల నిరంకుశ పోకడలను ప్రశ్నించే వారిపై కక్ష్య పెంచుకోవటం.. ఉద్యమాలను అణచటం, ఉద్యమకారులపై అక్రమ కేసులు మోపి భ భ్రాంతులకు గురి చేయాలనుకోవటం.. వారి స్వాతంత్య్రాన్ని కాలరాయటమే కదా.. పేద, మధ్యతరగతి అల్పాదాయ వర్గాలనూ పన్ను పోట్లకు గురిచేయటం, కార్పొరేట్లకే కార్పెట్లు పరవటం, జాతి సంపదను దారాదత్తం చేయటం.. ఇవన్నీ వేర్వేరు ముఖాల స్వేచ్ఛా ఉల్లంఘనలు కదా..
డెబ్బరు అయిదేళ్లకు పూర్వం ఏ ఆశయంతో స్వాతంత్య్ర ఉద్యమాగ్ని రాజుకుంది.. దానికి కొనసాగింపునివ్వటమే కదా నాటి పోరాటాలకు గౌరవం.. యోధులకు నివాళి, బలిదాన అమరులకు అంజలి..
స్వేచ్ఛాయుత వాణిజ్యం సరే.. స్వేచ్ఛాయుత ప్రపంచమున్నదా.. పండుగ తేదీలే తప్ప ప్రపంచానికే స్వేచ్ఛ లేదు.. బలహీన దేశాలపై బలవంత దేశాల అణిచివేత పోరాటాలు ఇప్పుడు వ్యక్తుల సామూహిక కర్తవ్యం..
గ్లోబలైజ్ సంస్కతికి అలవాటు పడిన మనం ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో స్థానిక ప్రభుత్వాలపై జనం తిరుగు బాట్లు, పోరాటాలు, సాధించిన విజయాలనుంచి స్ఫూర్తి పొందాలి.. అంతెందుకు నిన్నటికి నిన్న శ్రీలంకలో ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో అందులో ప్రజల విప్లవాత్మక ఆచరణేంటో అది వర్ధమాన ప్రేరణవ్వాలి..
'దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరిముతాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణాలతోనే పాతరేస్తాం'.. అని గర్జించిన తెలంగాణ గర్వకారణ కవి కాళోజీ మాటల్లో అంతరార్థం స్వేచ్ఛా పోరాటానికి విరామంతో రాజీ పడొద్దనే.. ఆయన వాక్యాలు మన దారి దివిటీలు..
ఈ సందర్భంగా నేను, సీనియర్ కవి కపిల రాం కుమార్ రాసుకున్న తాజా కవితలు.. ఈ సాహిత్యం వేర్వేరు.. ఉద్దేశ్యమొకటే.. మరో స్వాతంత్య్ర పోరాటం కావాలి..
ఇంటి చుట్టూ
ఇంకా చివకని ముళ్లకంచె
8/15 ఏ 1947
ఎప్పటిదో మా పాత ఇల్లు
నేలంతా
దోపిడి బొరియల దాపుడు లోయలు
ఏటా
ఇంటి కొప్పెక్కి
తాత పాత పందిరి దులిపినపుడల్లా
అమ్మమ్మ కళ్ళల్లో నిరాశ...
చుట్టింట
మట్టి కాళ్ల పొయ్యిపై
చట్టి మాడుతున్న వాసన
తను పొట్లం కట్టిన
మూడు రంగుల పూల ఆశల తీరుగా ...
కపిల రాంకుమార్ కవిత
''పాడవోయి భారతీయుడా-
ఆడి పాడవోయి విజయ గీతికా
నేడే స్వాతంత్య్ర దినం -
వీరుల త్యాగ ఫలం
నేడే నవోదయం - నీదే ఆనందం! ''శ్రీశ్రీ''
గుర్తుకొస్తోందిప్పుడు
షష్టిపూర్తి చేసుకున్న ఈ పాట
ఇప్పటికీ అన్వయించుకునేదే
సార్వజనీయకతే ఈ సాహిత్యపు ధ్యేయం
జెండా ఎగరేయటానికి గుడిసె లేనోడు
రక్తమోడే పిడికెడు గుండెకే గుండు సూదితో అతికించుకున్నాడు
చొక్కా లేని పిలగాడి రెపరెపలాడె
కంటి ఆనందం
ఆ జెండా తగిలించుకోలేకపోయినా
చేతితో పట్టుకొన్న సంబరంలో కనబడుతోంది.
లోకాన్ని శాసించే నేటి నాణంపై బొరుసుండదు
రెండు బొమ్మలే
గాంధీదొకటి, గాడ్సేదొకటి
ప్రజా ధన భోక్తలే
ప్రముఖ బత్తాయిలై
అన్ని ప్రజావసరాలను శాసిస్తున్న
అసమానతల సమాంతర పయనంలో
సామాజిక న్యాయం గిలగిలలాడుతోంది
వాగ్దానాల హోరులో
కార్యరూపం దారి మళ్ళుతోంది
పన్నులు ఆపన్నులను అణగతొక్కాలనుకుంటున్నారు
ఒకరు ప్రైవేటు రంగాన్ని జాతీయం చేసారు
ఇంకొకరు ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరంచేయడమో
అలవికాని వంకతోఅమ్మకం పెడుతున్నారు
ఒకరిచ్చిన సౌకర్యాలను
మరొకరు ఓర్వలేక తొలగిస్తున్నారు.
ఎన్నికలప్పుడొకలాగ
గద్దెక్కిన పిదప మరొకలాగ
ఎన్నో ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు
ప్రతీ అరక్షణమూ
అరక్షణంగా మారిపోతున్నా
నిమ్మకు నీరెత్తినట్లు
నిత్యకత్య అకత్యాలు
అదుపులేక కొనసాగుతున్నాయి
చట్టాలు చట్టుబండలై
కుంభకర్ణనిద్రలా జోగుతున్నారు
ప్రశ్నించేవారి గళాన్ని, కలాన్ని
అడ్డుకోవడానికి రకరకాల సాకులతో
ఉరుకులు పరుగుల మీద కందకాలలో
కుక్కేస్తున్నారు
నిజాలేవీ వెలుగులోకి రానివ్వని
దుర్మార్గపు రాజ్యం నీడలో
బతుకులు అస్తవ్యస్తంగా మారుతుంటే
ఇన్నేళ్ళ ప్రయాణంలో
స్వరాజ్య ఫలాలను మూల్యాంకనం
చేసుకోకతప్పదు
సంబరాల గీతాలు రాయలేను
బేరీజు వేసుకుని ముందుజాగ్రత్తలు
తీసుకోక తప్పదు కాబట్టి
ముభావంగా అన్నీ
గుప్పెడలో బాధల్ని దాచుకోక తప్పదు.
నివురుకప్పిన నిప్పులా
ఎప్పుడు అగ్ని పర్వతంలా పగులుతుందో
మౌనం అర్థాంగీకారమే కాదు
మిగతా అర్థభాగంలో వ్యతిరేకత
నిక్షిప్తమై వుంటుంది
నాలుగు వేళ్ళు వెళ్ళటానికి
అవకాశం లేదు
నాగళ్ళు దివాళా తీసాయి
ఇప్పుడే వత్తికి భుక్తి దొరకటంలేదు
ఒక్క అరాచక రాజకీయాలకు తప్ప
ఏ లోటు పాట్లు లేకుండా
ప్రతి వ్యక్తికి పాటు, తలదాచుకోను చాటు సాపాటు దొరకాలంటే
సొతంత్రం కోసం
కొత్త పోరుపాట పాడాల్సిందే
పోరుబాట పట్టాల్సిందే.
- శ్రీనివాస్ సూఫీ,
9640311380