Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అనగనగా ఒక రాజకుమారుడు తెల్లని గుర్రం ఎక్కి బంగారు కలువలు తేవటం కోసం తూర్పు దిక్కుగా వెళ్ళాడు...'' అంటూ ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు మనవలకి, మనవరాళ్ళకి అన్నం తినిపిస్తూనో, నిద్రపుచ్చుతూనో ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు. 'ఏనుగమ్మ ఏనుగు.. మా వూరు వచ్చింది ఏనుగు' అంటూ తాతలు ఓపిక వున్నా, లేకపోయినా మనవళ్ళని భుజం మీద ఎక్కించుకుని ఆడిస్తూ వుండేవాళ్ళు. అంతేకాదు! మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళ అమ్మనాన్నల దగ్గర 'నో' అనిపించుకున్న చిన్న చిన్న కోరికలన్నింటినీ వీళ్ళు చాటుమాటుగా తీరుస్తూ మహదానంద పడిపోయేవారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ ఇప్పుడు కాలగర్భంలోకి జారిపోతున్నాయి. బహుశా ముందు ముందు పూర్తిగా కనుమరుగయి పోయే అవకాశం లేకపోలేదు. దానికి కారణం- తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వుండే కుటుంబాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోవటమే... ఇంకా చెప్పాలంటే కన్నబిడ్డలే ఆ వృద్ధుల్ని కుటుంబాలకి, మనవలకి, మనవరాళ్ళకి దూరంగా ఒంటరిగా వుంచేస్తున్నారు.
దాదాపు ఒకటిన్నర దశాబ్దకాలంగా ఆర్థిక, సామాజిక సాంకేతిక రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు న్యూక్లియర్ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే విషయం మనందరికీ తెలిసిందే.
ఏదిఏమైనా ఈ మార్పుల కారణంగా వృద్ధుల జీవితాలు, వారి భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులు తమ చివరి రోజుల్లో కుటుంబాలకి, కన్నబిడ్డలకి దూరమయి వృద్ధాశ్రమాల్లోనో, రిటైర్మెంట్ హోమ్స్లోనో ఎవరూ లేని అనాథల్లాగా కాలం వెళ్ళదీయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.
పిల్లల్ని కని, పెంచి, చదువులు చెప్పించి, వారిని ఒక స్తాయిలో నిలబెడుతున్నప్పుడు ప్రతి తల్లీదండ్రి 'వృద్ధాప్యంలో వారే తమకి ఆలంబనగా నిలుస్తారని' కలలు కంటారు. కానీ చివరికి వారికి మిగులుతోంది ఒంటరితనమే. అదే చివరి దశలో వారిని తీవ్రమైన మానసిక వేదనకి గురి చేస్తోంది.
నిపుణులు చెబుతున్న కారణాలు
ఉద్యోగరీత్యా పిల్లలు పట్టణాలకి వెళ్ళవలసి వచ్చినపుడు తల్లిదండ్రులు పెద్ద వయసులో సొంతవూరు, స్వంత ఇల్లు, అన్ని సంవత్సరాలుగా అలవాటయిన వ్యక్తులు, బంధువులు, పరిసరాలు వీటన్నిటినీ వదిలి వెళ్ళటానికి యిష్టపడటం లేదు. దానికి ప్రధాన కారణం కొత్త ప్రదేశంలో వారు తమ ఐడెంటిటీని కోల్పోతామని భయపడుతున్నారు. అక్కడ తమని పలకరించే వాళ్ళు కానీ, మంచిచెడులు అడిగేవారు గానీ వుండరన్నది వాళ్ళ దిగులు. అంతేకాకుండా అరవై ఏళ్ళు పై బడిన వయసులో కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడి పద్ధతుల్ని, జీవనశైలిని అలవరచుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. అందుకే కష్టమో, నష్టమో 'మనది' అనుకున్న స్వంత ఊరిలో స్వంత మనుషుల మధ్య వుండటానికే వారు సిద్ధపడుతున్నారు.
యువత చాలా మంది మెరుగైన భవిష్యత్లు కోసం, ఉన్నత ఉద్యోగావకాశాల కోసం స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళవలసి వస్తోంది. చాలా వరకు వారు అక్కడే స్థిరపడిపోతున్నారు. అందువల్ల కూడా చాలా మంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతున్నారు.
ఈ రోజుల్లో నిత్యావసర వస్తువుల మొదలుకుని పిల్లల చదువు, వైద్యం దాకా ఏదీ మధ్య తరగతి, కింది తరగతివారికి అందుబాటులో వుండటం లేదు. పిల్లలకి మంచి చదువులు, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పనిసరిగా ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వుంది. దాంతో అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు ఇంటి పనులు, పిల్లల చదువులు అన్నింటిని సమర్థించుకోవాల్సి రావటం వల్ల భార్యాభర్తలిద్దరూ శారీరకంగానూ, మానసికంగానూ కూడా తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత వారికి తలకి మించిన భారంగా తయారయింది.
'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అన్నట్టు ప్రయివేట్ సంస్థల్లో పని చేస్తున్నారు. వారికి ఉద్యోగాలు ఎప్పుడు వుంటాయో, ఎప్పుడు ఊడతాయో కూడా తెలీదు. పెన్షన్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పూర్తిగా పోయింది. దాంతో 'దీపం వున్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి' అన్న సామెత లాగా సంపాదన వున్నప్పుడే భవిష్యత్తు అవసరాలని కూడా దృష్టిలో పెట్టుకుని పొదుపు చేసుకోవాల్సిన పరిస్థితి మధ్య తరగతి కుటుంబాల్లో వుంది.
ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులు ఇంట్లో వున్నట్టయితే వారికి అయ్యే మందుల ఖర్చులు, కేర్ టేకర్ ఖర్చులు, ఇతర అవసరాలకి అయ్యే ఖర్చులు, ఇవన్నీ కూడా పిల్లలకి భారంగానే అనిపిస్తున్నాయి.
చాలా కుటుంబాల్లో పిల్లల లగ్జరీస్కి ఇస్తున్నంత ప్రాధాన్యత వృద్ధులైన తల్లిదండ్రులు అవసరాలకి ఇవ్వటం లేదు. వారికి ప్రాథమిక సదుపాయాలు కల్పించటంతో కూడా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఒకే ఇంట్లో కలిసి వుంటున్నారన్న మాటే గానీ, వారితో కలిసి గడిపే సమయం కూడా తక్కువే. స్వంత కుటుంబంలోనే పరాయి వ్యక్తులుగా ట్రీట్ చేయబడటం వల్ల వారిలో ఆత్మన్యూనతాభావం చోటుచేసుకుంటోంది.
ఈ అవమానాన్ని భరిస్తూ పిల్లలతో కలిసి వుండటం కన్నా ఒంటరిగా వుంటూ గౌరవప్రదంగా బతకడం మంచిదను కుంటున్నారు తల్లిదండ్రులు.
పిల్లల్లో పెరుగుతున్న స్వార్థం కూడా వృద్ధులు రిటైర్మెంట్ హోమ్స్, వృద్ధాశ్రమాల దారి పట్టణానికి కొంత వరకు కారణం అవుతోంది.
కుటుంబం అంటే- నేను, నా భాగస్వామి, మా పిల్లలు మాత్రమే అన్న కొత్త నిర్వచనం ఈ తరం యువతలో బాగా తలకెక్కింది. అందుకే తల్లిదండ్రులు ఆర్థికంగా వారిపై ఆధారపడక పోయినా వారిని చూడటానికి ఇష్టపడటం లేదు. వారికి వృద్ధాప్యంలో వున్న తల్లిదండ్రుల బాగోగులు చూడటం కూడా భారంగానే అనిపిస్తోంది. దానికి వాళ్ళు పెట్టుకున్న ముద్దుపేరు 'ప్రైవసీ'.
నేటి యువత జీవనశైలిలో కూడా చాలా మార్పు వచ్చింది. కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చాక నిబద్ధతతో కూడిన పని గంటలు వుండటం లేదు. ఒక్కసారి వర్క్‌కి కనెక్ట్ అయితే అది ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళకే తెలీదు. దాంతో వాళ్ళు ఇంటి పనులకి దూరమైపోతున్నారు. దాని కారణంగా ఆహారపు అలవాట్లలో కానీ, నిద్రపోయే సమయం, నిద్ర లేచే సమయాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి తరం జీవనశైలి ఇంతకు ముందు తరం వారి జీవనశైలికి పూర్తి భిన్నంగా వుంది. అందువల్ల ఇరువురి మధ్య సర్దుబాలు అనేది కష్టమైపోతుంది. దాని ఫలితంగా కుటుంబంలో నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణాల వల్ల కూడా ఎవరికి వారు విడిగా వుండటమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు.
కారణాలు ఏమైనా కావచ్చు.- వృద్ధాప్యంలో దగ్గర వుండి తమ ఆలనాపాలనా చూసుకోవలసిన పిల్లలకి దూరమై ఒంటరిగా బతుకులు ఈడుస్తున్న వృద్ధుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే వుంది. ప్రపంచ దేశాల్లో వృద్ధుల శాతం అధికంగా వున్న దేశంగా భారతదేశం రెండో స్థానంలో వుంది. కానీ ఇక్కడ వృద్ధులకి ఇటు కుటుంబ సభ్యుల నుంచి గానీ, అటు సమాజం నుంచి గానీ దక్కవలసిన గౌరవం, ఆదరణ తగు రీతిలో అందటం లేదనేది వాస్తవం.
పిల్లలు చిన్నతనంలో నిద్రలో ఉలిక్కిపడితే తల్లిదండ్రులు వాళ్ళని గట్టిగా గుండెలకి హత్తుకుని 'మేమున్నాము' అన్న భరోసా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు అదే తల్లిదండ్రులు వృద్ధాప్యం మీద పడటం వల్ల ఒంట్లో శక్తి తగ్గిపోయి తమ పని తాము చేసుకోలేని పరిస్థితుల్లో 'మాకు ఆసరాగా నిలబడండి' అంటూ పిల్లల్ని దీనంగా అర్థించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
బహూశా ఇది నాగరికత నేర్పిన ఒక కొత్త పోకడ కావచ్చు.
వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు
వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారు అనేక విషయాల్లో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతోంది.
వృద్ధాప్యంలో వారి ఆదాయం తగ్గిపోవటం వల్ల ఆర్థికంగా పిల్లలపై ఆధారపడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడినపుడు వైద్య సహాయం పొందటానికి ఒంటరిగా వెళ్ళలేక పోవటం వల్ల ఎవరో ఒకరిని సహాయం అడగాల్సి వస్తుంది.
అలాగే ప్రతినెలా చెల్లించవలసిన కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లు, సెల్‌ఫోన్ రీచార్జింగ్, కేబుల్ బిల్లు వంటివన్నీ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేసే సౌకర్యం వచ్చింది. సంబంధిత ఆఫీసులకి వెళ్ళి గంటల తరబడి క్యూలో నుంచునే ఓపిక కూడా వారికి వుండదు. అయితే వృద్ధులలో చాలా మందికి ఇంటర్నెట్ వాడకం గురించి అంత అవగాహన వుండదు. కాబట్టి వాళ్ళు ప్రతినెలా ఇలాంటి పేమెంట్స్ కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి వారు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తోంది.
దానికి తగ్గట్లు వృద్ధుల అవసరాల్ని, అసహాయతనీ అలుసుగా తీసుకుని వారిని మోసగించేవారు, ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే వారు కూడా వుంటారు. దాని వల్ల ఆర్థికంగా కూడా వారు కొంత నష్టపోతుంటారు. ఆ విషయాన్ని వారు గ్రహించినా తిరిగి అడగలేని పరిస్థితి వారిది.
ఇవన్నీ కూడా వృద్ధుల్ని మానసిక ఆందోళనకి గురి చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులే వారిని వృద్ధాశ్రమాలు, రిటైర్మెంట్ హోమ్స్ దారి పట్టిస్తున్నాయి.
మళ్ళీ అక్కడ కూడా వృద్ధాశ్రమాలకే, రిటైర్మెంట్ హోమ్స్ కి చాలా వ్యత్యాసం వుంటుంది.
రిటైర్మెంట్ హోమ్స్‌లో వుండే వసతులు, పరిసరాలు, వారు చూపే వ్యక్తి శ్రద్ధ వృద్ధాశ్రమాల కన్నా కొంత భిన్నంగా వుంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించు కునేందుకు, మానసిక వికాసానికి అవసరమైన సదుపాయా లన్నీ రిటైర్మెంట్ హోమ్స్‌లో కల్పిస్తున్నారు. అంటే- క్లబ్ హౌస్, యోగా - మెడెటేషన్వంటి ఫిజికల్ యాక్టివిటీస్, వారాంతరాల్లో ఎంటర్టైన్మెంట్ ప్రొగ్రామ్ వంటివన్నీ అక్కడ వుంటాయి.
వీటితో పాటుగా హాస్పిటల్, మెడికల్ షాపు, సూపర్ మార్కెట్, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే కేర్ టేకర్స్ కూడా వుండటం వల్ల వృద్ధులకి కొంతవరకు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం వుండదు.
ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా వున్న వృద్ధులు మామూలు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతుంటే, ఆర్థికంగా కొంత వెసులుబాటు వున్న వాళ్ళు రిటైర్మెంట్ హోమ్స్‌లో నివాసం ఏర్పరచు కుంటున్నారు.
హోమ్స్‌లో ఎన్ని సౌకర్యాలు వున్నా ఆ వృద్ధుల చూపులు, హృదయాలు మాత్రం తమ పిల్లల రాకకోసం ప్రతి క్షణం ఆరాటంగా ఎదురుచూస్తూనే వుంటాయి. దానికి కారణం- పిల్లల చిన్ననాటి జ్ఞానకాలు, వారితో కలిసి పంచుకున్న అందమైన అనుభవాల గుర్తులు ఎంత వెతికినా వారికి ఆ పరిసరాల్లో కనిపిం చవు. వాటిని ఆ వృద్ధులు తమ పిల్లల్లోనే చూసుకో గలరు. తల్లిదండ్రులు - పిల్లల మధ్య వుండే సంబంధం ఒక బాధ్యత కాదు. రెండు హృదయాల బంధం.
పిల్లల నుంచి పొంద వలసిన ప్రేమ ఆప్యాయా తల్ని హోమ్స్ మాత్రమే కాదు చట్టాలు కూడా తిరిగి యివ్వలేవు.
2007లో చట్టం వచ్చినప్పటికీ వృద్దులకి ఇంకా సరైన న్యాయం అందటం లేదు. దానిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు ఈ చట్టానికి సవరణ కోసం ఒక బిల్లుని ప్రతిపాదించింది. ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టంగా రూపుదిద్దుకున్నట్టయితే కొత్త చట్టం ప్రకారం పిల్లల ఆదాయం నుంచి తల్లిదండ్రులకి ప్రతినెలా పదివేల రూపాయలు మెయిన్‌టెనెన్స్‌గా లభించే అవకాశం వుంటుంది. దాని వల్ల తల్లిదండ్రులు కొంత వరకు ఆర్థిక ఆలంబన పొందగలుగుతారు.
అయితే ఈ చట్టం గురించి ఇంకా విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం వుంది.
చట్టం గురించిన అవగాహన వున్నా చాలా మంది తల్లిదండ్రులు దాన్ని ఉపయోగించుకోవటానికి ముందుకు రావటం లేదు. అందుకు కారణాలు రెండు - మొదటిది మన వ్యవస్థ మీదా, న్యాయ స్థానాల మీద నమ్మకం లేకపోవటం, రెండవది - కన్న బిడ్డల మీద వారికుండే ప్రేమ- మమకారాలు పిల్లల్ని కోర్టుకెక్కించటానికి ఒప్పుకోకపోవటం.
వృద్ధుల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు
వృద్ధాప్యం దగ్గర పడుతున్నకొద్దీ శారీరకంగా, మానసికంగా బలహీనపడటం అనేది సహజం. అలాంటి సమయంలో 'ఇంక బతికినన్ని రోజులు ఇతరులపై ఆధారపడి బతకాలేమో' అన్న అభద్రతా భావం వారిలో చోటుచేసుకుంటుంది. ఆ ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే వారిలో ఆందోళన, అలజడి అధికమవుతాయి. దీన్నే 'యాంగ్జైటీ డిసార్డర్' అంటారు.
మన దేశంలో వృద్ధులు మానసిక సమస్యలపై జరిపిన సర్వేలో ప్రతి పది మందికి వృద్దుల్లో ఒకరు మానసిక రుగ్మతలకి లోనవుతున్నారని వెల్లడైంది. వృద్ధులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో డిప్రెషన్, డెమెన్షియా, అల్జీమర్స్, స్కిజోఫెర్నియా, బైపోలార్ డిజార్డర్ వంటివి అధికంగా వున్నట్టు సర్వేలో వెల్లడైంది. సహజంగానే వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దానికి ఒంటరి తనం కూడా తోడవటం వల్ల దాని తీవ్రత పెరిగి రకరకాల మానసిక రుగ్మతలకి దారి తీస్తోంది.
ఒక సైకాలజిష్ట్గా నేను యువతకి ఇచ్చే సూచన ఏంటంటే మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి అడుగు పెట్టినప్పుడు వారిలో వస్తున్న మార్పుని గమనించి వారిని వారిలాగే యాక్సెప్ట్ చేయండి. అంతేకానీ, ప్రతి చిన్న విషయంలోనూ వాళ్ళని కరెక్షన్ చేయటం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం చేయకూడదు. అది మీకు వాళ్ళ మీద వుండే ప్రేమ వల్ల, వారి మంచికోసమే అయి వుండవచ్చు. కానీ మీరలా చేయటం వల్ల వారు మరింత కన్ఫ్యూజన్కి గురయి, వారిలో ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం చాలా వుంటుంది. అది వారి మానసిక సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో వారికి కావలసింది ఎమోషనల్ బాండేజ్.
వృద్ధుల విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి?
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి మన దేశంలో వున్న వృద్ధుల సంఖ్య దాదాపు పద్నాలుగు కోట్లు కాగా అందులో పురుషుల సంఖ్య ఆరు కోట్లకు పైగా వుంటే, స్త్రీల సంఖ్య ఏడు కోట్ల దాకా వుంది.
వీరిలో దాదాపు అరవై శాతానికి పైగా వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారే.
అటువంటప్పుడు వారి సంక్షేమం కోసం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల కోసం 'వృద్ధాప్య పింఛన్లు' ప్రకటించినప్పటికీ అది ఎంతవరకు సజావుగా అమలు పరచబడుతున్నాయి? ఎంత మంది వృద్ధులు వాటిని పొందగలుగుతున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగానే వుంది.
వృద్ధాప్య పింఛనులతో పాటుగా వారికి అవసరమైన మరికొన్ని సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా నివాస గృహాలు, ఇరవై నాలుగ్గంటలు అందుబాటులో వుండే వైద్య సదుపాయం, నర్సులు, మందులు, అలాగే పౌష్టికాహారం ఉచితంగా అందేలా పథకాన్ని రూపొందించాలి. అంతకన్నా ప్రధానంగా ఆ పథకాలన్నీ సక్రమ మార్గంలో వారికి అందేలా తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వాలు కనుక అలా చేయగల్గితే వృద్ధుల జీవితాలు కొంత మెరుగయ్యే అవకాశం వుంటుంది.
చట్టంలో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం 'మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007' పార్లమెంటులో ప్రవేశపెట్టటం జరిగింది.. వృద్ధులకు ఉచితమైన సత్వర న్యాయం కలిగించటమే ఈ చట్టం వుద్దేశ్యం.
చట్టంలోని కొన్ని ముఖ్యాంశాలు
- ఈ చట్టం ప్రధానంగా వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన ప్రశాంతమైన జీవితం గడిపేందుకు అవకాశం కల్పిస్తోంది.
- వృద్ధులకి, వారితో పాటు వారి ఆస్థిపాస్తులకీ కూడా ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించబడుతోంది.
- ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రులు వృద్ధులై వుండాలన్న రూల్ ఏమీ లేదు. అంటే తల్లిందడ్రులకి నిర్థిష్టమైన వయోపరిమితి ఏమీ వుండదు.
- ఈ చట్టాన్ని తల్లిదండ్రులు ఉపయోగించు కోవాలనుకున్నప్పుడు దాని పరిధిలోకి కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాండ్లు వస్తారు. అంటే తల్లిదండ్రులు వీరిపై కేసు వేయొచ్చు.
- దీని కోసం రెగ్యులర్ గా కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి డివిజన్‌లోనూ ఆర్డీఓ ఆఫీసులోనే ఒక ట్రిబ్యూనల్ ని ఏర్పాటు చేసి, వారికి సత్వర న్యాయం అందేలా చూస్తారు.
- దీన్ని మెయిన్టెనెన్స్ ట్రిబ్యునల్ అంటారు.
- పిటీషన్ని స్వీకరించిన తొంభై నుంచి నూట ఇరవై రోజుల్లోనే పరిష్కారం చూపించాల్సి వుంటుంది..
ముగింపు
వృద్ధులైన తల్లిదండ్రుల్ని కుటుంబాలకి దూరంగా పెట్టడం వల్ల తల్లిదండ్రులే కాదు పిల్లలు కూడా చాలా కోల్పోతున్నారు. ఆ విషయం వారు గ్రహించాలి.
ఒక్కసారి మీ తల్లిదండ్రుల్ని తీసుకువచ్చి మీతో వుంచుకోండి. మీరేమీ కోల్పోతున్నారో మీకు అర్థం అవుతుంది.
మీ పిల్లల చేతిలో వున్న గాడ్జెట్ తీసిపారేసి వాళ్ళని మీ తల్లిదండ్రుల పక్కన కూర్చోబెట్టి చూడండి - వాళ్ళకి స్మార్ట్‌ఫోన్ వాడటం రాకపోవచ్చు కానీ మీ పిల్లలు ఆ స్మార్ట్ ఫోన్స్ వల్ల వచ్చే ప్రమాదాల్లో చిక్కుకోకుండా కనిపెట్టుకుని వుండగలరు.
వాళ్ళకి జామోటో, స్విగ్గీల్లో ఫుడ్ ఆర్డర్ చేయటం రాకపోవచ్చు. కానీ సమయానికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని మీకూ మీ పిల్లలకి ఆప్యాయతతో అందించగలరు.
మీ పిల్లలకి కూడా మీ తల్లిదండ్రులతో పాటు ఒకే గదిలో పడక ఏర్పాటు చేసి చూడండి- అర్ధరాత్రి దాకా మీ పిల్లలు సోషల్ మీడియాలో అడ్డమైన ప్రోగ్రామ్స్ చూడకుండా వాళ్ళకి మీ చిన్ననాటి ముచ్చట్లన్నీ కథలు కథలుగా ఎంతో అందంగా చెపుతారు. దాని వల్ల మీ పిల్లలకి కూడా 'చిన్నతనం అంటే ఇలావుంటుందా?' అన్న ఆలోచన వస్తుందేమో! ఈ రోజుల్లో పిల్లలకి 'బాల్యం' అనేదే లేకుండా పోయింది. ఆ బాల్యం ఎలా వుంటుందో మీ తల్లిదండ్రులు మీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలరు. వారు కోల్పోతున్న దాన్ని తిరిగి వారికి అందించగలరు.
ఒక్క మాటలో చెప్పాలంటే అసలు కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటో, అందులో వుంటే విలువలు ఎంత గొప్పవో మీ పిల్లలకి అర్థం అయ్యేలా చేయగలరు.
కుటుంబంలో వృద్ధుల పాత్ర 'తల్లిదండ్రుల' వరకే పరిమితం కాదు. తాతలుగా, అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా కూడా వాళ్ళు నిర్వహించాల్సిన పాత్ర చాలా వుంటుంది. మనవలు, మనవరాళ్ళు ఆటపాటలు చూడాలని, వాళ్ళతో ఎన్నో ఆనందాలు పంచుకోవాలని వాళ్ళు కలలు కంటారు. అది వాళ్ళ హక్కు కూడా. మీ పిల్లల్ని కేవలం మీ తల్లిదండ్రుల ఆస్థికి మాత్రమే వారసులని చేయకండి. వారి ప్రేమ ఆప్యాయతలకి కూడా వారసుల్ని చేయండి.
- గోపాలుని అమ్మాజీ, సైకాలజిస్ట్