Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ నేల రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా కొనసాగటానికి 1946 - 51 మధ్య కాలంలో నైజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం ప్రధాన కారణం. 'నీబాంచను కాల్మొక్త' అని బతుకులు గడుపుతున్న సామాన్యులు ''నీ గోరీకడ్తం కొడుకో నైజాము సర్కరోడా'' అని తిరుగుబాటు బావుటానెగరేసి ధిక్కార స్వరాన్ని వినిపించారు. దోపిడీ పీడన ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు తప్పదన్న మార్క్స్ విశ్లేషణకు రుజువు ఈ పోరాటం. ప్రపంచ విప్లవ పోరాటాల చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా తన అధ్యాయాన్ని లిఖించింది. ఆ మహోజ్వల సమరం మనకెన్నో అనుభవాలను ఇచ్చింది. ముఖ్యంగా చరిత్రకు కారకులు, నిర్మాతలు ప్రజలే అనే సత్యాన్ని నిరూపించింది కూడా.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం రాజరిక రాక్షస పాలనలో ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరించిన ఇక్కడి జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీలు మొదలైన జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, కల్లూర్ దేశ్‌ముఖ్, విసునూరి దేశ్‌ముఖ్, భూస్వాములు, పోలీసులు, రజాకార్లు దారుణ కాండ సృష్టించారు. నిర్బంధాలు, దోపిడీ, చిత్రహింసలు, హత్యలు, మానభంగాలు, గృహదహనాలు, లూటీలు, ప్రజల్లో బీభత్సాన్ని కల్గించాయి. గ్రామాలలోని ప్రజలు జమీందారులకు వెట్టి చేయాల్సి వచ్చేది. సామాజికంగా కూడా అణచివేత జరుగుతూ వుండేది. ఈ దోపిడీ సాగుతూనే సాంస్కృతిక పరమైన అణచివేతా సాగింది. ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఉర్దూ భాషలోనే వుండేవి. ప్రజలు చదువుకోవడానికి ఉర్దూ మీడియంలోనే పాఠశాలలు నడిచేవి. జమీందారుల, జాగీర్దార్ల ముందు తలెత్తుకుని, చెప్పులు వేసుకుని నడిచే అవకాశమే లేకుండెను. ఈ పరిస్థితులలో ప్రజలు అనేక కష్టాలు, అవమానాలు, అత్యాచారాలు, హత్యలకు గురయ్యారు. ఇట్లాంటి స్థితి నుండి వీరోచిత విప్లవ పోరాటం వెల్లువెత్తి ప్రపంచ ప్రజలనూ, దేశ రాజకీ యాలను ప్రభావితం చేసింది.
ప్రజల సాంస్కృతిక అణచివేతపై గ్రంథాలయోద్యమం ముందుగా ఆరంభమయింది. స్వాతంత్య్రోద్యమం లో భాగంగా ఆంధ్రోద్యమం ఆంధ్ర ప్రాంతాన ఆరంభమయి విద్య, భాష, ఆత్మ గౌరవం, సంఘ సంస్కరణ అభిలాషతో కూడుకుని నడిచేది. 1930 మార్చిలో మెదక్ జిల్లా జోగిపేటలో నిజాం రాష్ట్రంలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఆంధ్రమహాసభ జరిగింది. ఇంకోవైపు 1939లో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రరాష్ట్ర కమిటీ సంస్థానంలో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన 11వ ఆంధ్ర మహాసభ సమరశీలంగా కమ్యూనిస్టుల ప్రాబల్యంతో ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటాల్లో చదువుకున్న యువకులు వచ్చి చేరారు. చైతన్యయుతంగా ఉద్యమం రూపెత్తింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, హనుమయ్య, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమల, మల్లు స్వరాజ్యం మొదలైన అనేకమంది నాయకత్వం వహించి పోరాటాన్ని నడిపించారు. 1946 జూలై 4న కడివెండి గ్రామంలో దేశ్‌ముఖ్ తొత్తులకు, రజాకార్లకు వ్యతిరేకంగా గుత్పల సంఘం తిరుగుబాటు చేసింది. దానికి మల్లయ్య, కొమరయ్యలు నాయకత్వం వహించారు. అక్కడి గడీ ముందు నుంచి పెద్ద ప్రదర్శన వస్తుండగా దొరల బంట్లు జరిపిన కాల్పులలో దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ మహత్తర పోరాటంలో మొదట బలిదానం చేసింది కొమరయ్యనే. ఇక అప్పటి నుంచి సాయుధ పోరాటం గడీలపై ఉధృతమైంది. కొమరయ్య మరణం హైద్రాబాద్ రాష్ట్ర మంతటా దావనంలా వ్యాపించింది. వీరావేశంతో రైతులు తుపాకులు చేతబట్టి ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమయ్యారు. తెలంగాణ పల్లెల్లో రైతాంగంతో పాటు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పిడుగులై తిరగబడ్డారు. ఎంతో మంది పోరాటంలో వీర కిశోరాలై విజృంభించారు. 4000 మంది కమ్యూనిస్టు యోధులు అసువులు అర్పించారు. మరెందరో ఆస్తులు, కుటుంబాలు కోల్పోయి అసామాన్య త్యాగాలు చేశారు. ఈ మహత్తరపోరాటం ఫలితంగా మూడు వేల గ్రామాలు విముక్తి చెంది, రైతాంగ స్వయం పాలనలోకి వచ్చాయి. పదిలక్షల ఎకరాల భూమి రైతులకు పంచబడింది. దేశ వ్యాపితంగానే భూ సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చి ప్రభుత్వాలు అరకొరగానైనా భూ చట్టాలు తేవడానికి, భూ సంస్కరణలలు అమలు జరపడానికి ఈ పోరాటం ప్రేరణగా నిలిచింది. వెట్టిచాకిరి రద్దయింది. దున్నేవానికే భూమి నినాదం దేశమంతా విస్తరించింది. దేశవ్యాపితంగా వున్న వివిధ జాతులు, తెగలు విభజనను అంతం చేసేట్లు నాటి దేశ పాలకుల మెడలు వంచింది. ఈ పోరాటం వల్లనే ఇక్కడి సంస్థానం అంతమవ్వటమే కాక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం పోరాడే ఉత్తేజం అందించింది. కమ్యూనిస్టు ఉద్యమానికి అత్యంత ప్రాధాన్యత గల భారతదేశ ప్రజాతంత్ర విప్లవానికి సంబంధించిన వ్యూహం, ఎత్తుగడలకు సంబంధించిన మౌలిక సూత్రాలు, సిద్ధాంత సమస్యలను ముందుకు తెచ్చి దేశంలో విప్లవ సాధనకు ఒక రూపాన్ని ఇవ్వడంలో తెలంగాణ సాయుధ పోరాటం ఒక పాఠంలా ఉపయోగపడింది.
చివరకు తెలంగాణ సాయుధ పోరాటం విస్తరిస్తూ దేశం మొత్తం ఆక్రమిస్తుందో ఏమోనన్న భయం కొత్తగా స్వాతంత్య్రం పొంది ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వానికి కలిగింది. అందుకే అప్పటి కేంద్ర హోమంత్రిగా వున్న సర్దార్ వల్లభారు పటేల్ నాయకత్వాన కేంద్ర మిలటరీ బలగాలను సంస్థానం మీదికి పంపించారు. 'ఆపరేషన్ పోలో' తర్వాత 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడు. కానీ తెలంగాణ పోరాట యోధులను, ఉద్యమ ప్రజలను అణచివేయటం, హత్యలు చేయటం ఆగలేదు. ముఖ్యంగా కమ్యూనిస్టులపై భారతదేశ సైనికులు దాడులు చేసి తీవ్ర నిర్బంధానికి పూనుకున్నారు. సాధించిన ఫలితాలను, ప్రజలను కాపాడుకోవటానికి ఉద్యమం 1951 వరకు కొనసాగింది. కమ్యూనిస్టులను అణచివేయుటకు హైద్రాబాద్ సైనిక గవర్నర్ జనరల్ చౌదరి, సైన్యాన్ని అడవుల్లోకి పంపి కమ్యూనిస్టులెందరినో హతమార్చాడు. ప్రజా పోరాటాటానికి తలవొగ్గి తమ జాగీర్లను వొదిలి పట్నానికి పారిపోయిన భూస్వాములు తిరిగి కాంగ్రెసు టోపీ ధరించి గ్రామాలలోకి వచ్చారు. నిజాం నిరంకుశ పాలనలో జరిగిన హింస, హత్యాకాండ కన్నా మించిన హింస ప్రజల మీద పటేల్ సైనిక దాడి తర్వాత జరిగింది.
మహత్తర పోరాటం - కొన్ని వక్రీకరణలు
సంస్థానంలో అమలవుతున్న అనేక రకాల దోపిడీలు, అణచివేతపై ప్రజలు సాయుధులై కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చారిత్రక పోరాటాన్ని నిర్వహించారు. కనీవినీ ఎరుగని త్యాగాలు చేశారు. అత్యంత సామాన్యులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు సమస్త జనులు ఐకమత్యంగా పోరాటంలో పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా సమిష్టి సమరంగావించారు. అట్లాంటి పోరాటాన్ని ఇప్పుడు కొందరు విద్వేష రాజకీయ శక్తులు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చరిత్రను పూర్తిగా వక్రీకరించటమే.
హైద్రాబాద్ కేంద్రంగా దక్కన్లో ఆసఫ్‌జాహీలు రాజ్యస్థాపన చేసినప్పటికీ నవాబు మతస్తుడుగా ఉన్నప్పటికీ, ఆయనకు వంత పాడుతూ తొత్తులుగా వ్యవహరించిన జమీందారులు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, భూస్వాములు అంతా హిందువులే. ప్రజల మూలుగలు పీల్చి వెట్టిచాకిరీ చేయించింది, స్త్రీలను చెరబట్టి అత్యాచారాలకు పాల్పడింది కూడా వీరే. వందల వేల ఎకరాల భూములకు యజమానులుగా రైతులను దోపిడీ చేసిందీ వీరే. ఇక సాయుధ పోరులో నాటి నవాబు కర్కశత్వానికి బలి అయిన 'బందగీ' ఒక ముస్లిమే. నవాబు అరాచ కాలను వ్యతిరేకిస్తూ తన కులంతో పోరాటం చేసిన నిప్పు రవ్వ
షోయబుల్లాఖాన్. నిరంకుశత్వంపై ఎక్కుపెట్టిన అక్షర ఆయుధం ఖాన్‌ను దారుణంగా చంపించింది నాటి నైజాం ప్రభుత్వం. అంతేకాదు హైద్రాబాద్‌లో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటులో మఖ్దూం మొయినొద్దిన్తో పాటు అనేక ముస్లిం యోధులు పాల్గొని సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ఇలా మతాల కతీతంగా రజాకార్ల విధ్వంసాన్ని, సైనిక దాడిని ప్రజలు ఎదుర్కొని పోరాడారు.
అట్లాంటి పోరాటంతో ఏ సంబంధం లేని పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇపుడు, ఆ పోరాటం తమ ఘనతగా పేర్కొంటూ హంగామా సృష్టిస్తున్నారు. గోబెల్స్ తరహా ప్రచారంలో సిద్ధహస్తులయిన వీరి ప్రచారాన్ని నేటితరం అర్థం చేసుకోవాల్సి వుంది. వక్రీక రణలను తిప్పికొట్టాలి. చారిత్రక పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు, వీరిని అనుసరించిన ప్రజలు.
- కె. ఆనందాచారి