Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్రపరిశ్రమలో ఎందరో మరపురాని హీరోలు ఉన్నారు. వీరి ప్రస్తావన వస్తే కచ్చితంగా ముందు వరసలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ పేర్లు వినిపిస్తాయి. ఆ తర్వాత వరసలో పరిశ్రమను తన సినిమాలతో మరో మెట్టు ఎక్కించిన నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు ఉంటారు. చిలకా గోరింక చిత్రంతో వెండి తెరపై అడుగు పెట్టి విలన్ గా.., సపోర్టింగ్ రోల్స్‌లో.., ఆపై కథానాయకుడిగా.. చేసిన ప్రతీ పాత్రకూ న్యాయం చేసిన కృష్ణంరాజు సాంఘిక, జానపద, హిస్టారికల్ తదితర సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రెబల్ స్టార్ హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఆయన అందమైన చిరునవ్వు, చక్కని పలకరింపు, కళ్లల్లో నిజాయితీ, హీరోయిన్స్ తో డ్యూయేట్ పాడినా, విలన్ తో ఫైట్ చేసినా, ఫ్యామిలీ అనురాగాలు పంచినా వెండితెరకు నిండుతనాన్ని తీసుకొచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు ఉన్నత కుటుంబంలో జనవరి 20, 1940వ సంవత్సరంలో వీర వెంకట సత్యనారాయణరాజు, లక్ష్మిదేవి దంపతులకు కృష్ణంరాజు జన్మించారు. విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులైన వీర వెంకట సత్య నారాయణరాజు కుటుంబం మొగల్తూరులో జమిందారులుగా ఉండేవారు. వద్దంటే డబ్బు, సకల సౌకర్యాలు, చిన్ననాటి నుండే గౌరవ మర్యాదలు, మంచీ చెడూ చెప్పేవారు లేకపోవడంతో కృష్ణంరాజు బాల్యంలో కొంత దురుసుగా ఉండేవారు. నర్సాపూర్ వైఎన్ఎం కాలేజీలో పీయూసీలో జాయిన్ అయిన కృష్ణంరాజు చదువు మీద పెద్ద ధ్యాస పెట్టని కారణంగా పీ.యూ.సీలో ఫెయిల్ అయ్యారు. దీంతో వాళ్ళ నాన్న సలహాతో కృష్ణంరాజు హైదరాబాద్ వెళ్ళి భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో పీ.యూ.సీ కోర్స్‌లో జాయిన్ అయ్యారు. పీ.యూ.సీ పాసయిన తర్వాత కృష్ణంరాజు అదే కాలేజీలో బి.కామ్ జాయిన్ అయ్యారు. అయితే కాలేజీలో చదువుతూనే హైదరాబాద్‌లో సి.హెచ్.వి మూర్తి రాజు స్థాపించిన ఆంధ్రరత్న పత్రిక సంస్థలో జర్నలిస్టుగా పనిచేశారు. పగలు ప్రెస్ పనులు చూసుకుంటూ నైట్ క్లాసులు అటెండ్ అయ్యేవారు. కృష్ణంరాజుకు స్పోర్ట్స్, యాక్టింగ్ తో పాటు, ఫోటోగ్రఫీ లో కూడా ప్రవేశం ఉండేది. ఫోటోగ్రఫీ అంటే మక్కువ కలిగిన కృష్ణంరాజు వద్ద స్కూల్ డేస్ నుండే కెమెరా ఉండేది. ఆ కెమెరా తీసిన ఫొటోకు స్టేట్ లెవెల్లో సెకండ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు వచ్చింది. తర్వాత ఫోటోగ్రఫీ మీద ఆసక్తి మరింత పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో ఏ కొత్త కెమెరా వచ్చినా అది కృష్ణంరాజు ఇంట్లో ఉండాల్సిందే. అలా తన వద్ద అరుదైన కలెక్షన్ ఉండేది.
సినిమా రంగ ప్రవేశం
చదువు పూర్తైన తర్వాత కృష్ణంరాజు తనకిష్టమైన ఫోటోగ్రఫీనే నమ్ముకున్నారు. ఎవరి దగ్గర లేని విధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కెమెరాలను ఉపయోగించి రాయల్ ఫోటో స్టూడియో నెలకొల్పారు. అందులో చవాన్ అనే సీనియర్ ఫొటోగ్రాఫర్ ను కూడా పనిలో పెట్టుకున్నారు. స్టూడియోలో కృష్ణంరాజు ఫొటోలు పెట్టుకుంటే బాగుంటుందని చవాన్ ఆయన ఫోటోలు తీసి స్టూడియోలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఒక నిర్మాత కృష్ణంరాజు ఫొటోలు చూసి మీకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉంటే మద్రాసు రమ్మని ఆహ్వానించారు. తీరా వెళ్ళి చూస్తే ఆయనకు సినిమాలు తీసేందుకు డబ్బులు లేవు. స్నేహితులకు, బంధువులకు సినిమాల్లో నటించడానికి వెళుతున్నాను అని చెప్పుకుని మద్రాసు వెళ్లారు. తీరా వెనక్కి వచ్చేసాక అందరూ హీరో గారు అని వేళాకోళం చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా సినిమా హీరో అయితే తప్ప వెనక్కి రాకూడదు అని భావించి తిరిగి మద్రాసు వెళ్ళిపోయారు. మద్రాసులో తనకు తెలిసిన కెమెరామెన్ ఎం.కే రాజును కలుసుకోగా ఆయన ప్రత్యగాత్మకు పరిచయం చేసారు. ప్రత్యగాత్మ కృష్ణంరాజును ఒక నాటకం వేస్తె నీ టాలెంట్ ఏంటో తెలుస్తోంది కాబట్టి, నాటకం వేసి కనపడమన్నారు. ఆత్రేయ రాసిన పరివర్తన అనే నాటకాన్ని వేశారు కృష్ణంరాజు. అది చూసిన ప్రత్యగాత్మ తప్పకుండా అవకాశం ఇస్తానని మాట ఇచ్చి స్టేజ్ మీదనే ''చిలకా గోరింకా'' సినిమాను అనౌన్స్ చేసారు. అయితే కృష్ణంరాజు నటించిన మొదటి సినిమా చిలకా గోరింకా ప్లాపైంది.
విలన్‌గా
చిలకా గోరింకా సినిమా ప్లాప్ తర్వాత కృష్ణంరాజు తర్వాతి అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ సమయంలో డూండీ పిలిచి 'నాన్' అనే తమిళ చిత్రాన్ని చూపించి ఇందులో నటించాలని అడిగారు. అయితే కృష్ణంరాజు హీరో వేషమనుకున్నారు కానీ డూండీ పిలిచింది విలన్ వేషానికి. విలన్ పాత్ర అయితే నేను చేయలేను అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యగాత్మ శివాజీ గణేశన్ కూడా మొదట విలన్‌గా చేసారు, ఇక ఏం ఆలోచించ వద్దని చెప్పడంతో, కృష్ణంరాజు మామయ్యకు బాగా తెల్సిన ఎల్వి ప్రసాద్ సలహా కూడా తీసుకున్నారు. దానికి ఎల్వి ప్రసాద్, ఏం ఆలోచించకుండా ఈ రోల్‌ను ఎంచుకోమన్నారు. ''నీ మొహం ప్రేక్షకులకు అలవాటు అవ్వాలి. ఒక్కసారి అలవాటు అయితే నువ్వు ఏం వేసినా చూస్తారు. కాబట్టి మిస్ చేసుకోకు'' అని చెప్పడంతో కృష్ణంరాజు మరో మాట లేకుండా ఒప్పేసుకున్నారు. కృష్ణ హీరోగా వచ్చిన ఈ 'నేనంటే నేనే' సినిమా పెద్ద సక్సెస్ సాదించి, విలన్‌గా కృష్ణంరాజుకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరసగా 'భలే అబ్బాయిలు, బంగారు తల్లి, భలే మాస్టర్, బడి పంతులు, వాడే వీడు, పల్లెటూరి చిన్నోడు, బుద్దిమంతుడు, పవిత్ర బంధం, రైతు కుటుంబం, జై జవాన్, అమ్మ కోసం, మాయదారి మల్లిగాడు' మొదలైన సినిమాలతో విలన్‌గా నటించి తిరుగులేని పేరుని సంపాదించుకున్నారు. విలన్‌గా నాలుగైదేళ్ళలో కృష్ణంరాజు దాదాపుగా 45 చిత్రాలలో నటించారు.
మళ్ళీ హీరోగా..
విలన్ గా తీరిక లేకుండా కొనసాగుతున్న కృష్ణంరాజు కెరీర్ 1973లో కీలక మలుపు తిరిగింది. ప్రత్యగాత్మ తమ్ముడు హేమాంబరధరరావు కృష్ణంరాజు హీరోగా 'ఇంటి దొంగలు' అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా యవరేజీ విజయం సాధించడంతో కృష్ణంరాజుకు మళ్ళీ హీరోగా అవకాశాలు వచ్చాయి. అక్కడి నుండి కృష్ణంరాజు హీరోగా, విలన్‌గా కొనసాగుతూ సినిమాలు చేసారు.
గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌పై హిట్ చిత్రాలు
అప్పటిదాకా అటు హీరో, ఇటు విలన్ గా రెండు పడవలపై సాగుతున్న కృష్ణంరాజు ప్రయాణం 1974లో చేసిన కృష్ణవేణి సినిమాతో కీలక మలుపు తీరిగింది. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసి రెబెల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు, తనతో భిన్నంగా సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించక పోవడంతో సొంతంగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి తన తమ్ముడు సూర్యనారాయణ రాజు నిర్మాతగా సినిమాలు నిర్మించారు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌పై కృష్ణవేణి అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను తీసుకుని ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్న సమయంలో అందరూ యాంటీ సెంటిమెంట్ కథ తీస్తున్నాడు, ఈ సినిమాతో ఇక కృష్ణంరాజు పనైపోయింది అని ఇండిస్టిలో అందరూ అనుకున్నారు. అయితే వాటిని లెక్కచేయకుండా కృష్ణంరాజు కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి పెద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇక అక్కడి నుండి మళ్ళీ విలన్ వేషాలు వేయాల్సిన అవసరం కృష్ణంరాజుకు రాలేదు. ఆ తర్వాత నుండి కృష్ణంరాజు కెరీర్ దూసుకుపోయింది. ''నిత్య సుమంగళి, మొగుడా పెళ్ళామా, భక్త కన్నప్ప, అమర దీపం, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, భలే అల్లుడు, జీవన తీరాలు, బెబ్బులి, ఆడవాళ్ళూ మీకు జోహార్లు, టాక్సీ డ్రైవర్, బొబ్బిలి బ్రహ్మన్న, సర్దార్, కొండవీటి నాగులు, ఉక్కు మనిషి, బులెట్, తాండ్ర పాపారాయుడు, బందీ, రావణ బ్రహ్మ, బ్రహ్మనాయుడు, అంతిమ తీర్పు, రిక్షా రుద్రయ్య, తాత-మనవడు, కుటుంబ గౌరవం'' వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండిస్టీలో రెబెల్ స్టార్ గా ఎదిగారు. 1978లో మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య... ఈ రెండు చిత్రాలు కూడా కేవలం పదకొండు రోజుల గ్యాపలో విడుదలయ్యాయి. మనవూరి పాండవులులో సాఫ్ట్ క్యారెక్టర్ వేసిన కృష్ణంరాజు, కటకటాల రుద్రయ్యలో గంభీరమైన పాత్ర వేశారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించడమే కాకుండా కృష్ణంరాజును అభిరుచి గల నిర్మాతగా నిలబెట్టి, గోపికృష్ణా మూవీస్ బ్యానర్ స్థాయిని పెంచారు కృష్ణంరాజు..
క్యారెక్టర్ నటుడిగా..
''మా నాన్నకు పెళ్ళి'' సినిమాతో కృష్ణంరాజు తిరిగి క్యారెక్టర్ నటుడిగా మారారు. అక్కడి నుండి సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకున్నారు. ''సుల్తాన్, వంశోద్ధారకుడు, నీకు నేను నాకు నువ్వు, రామ్, శ్రీశైలం, బిల్లా, తకిట తకిట, రెబెల్, ఎవడే సుబ్రహ్మణ్యం, రుద్రమదేవి'' చిత్రాల్లో నటించారు.
కృష్ణంరాజు కుటుంబం
కృష్ణంరాజు మొదట భార్య సీతాదేవి యాక్సిడెంట్లో చనిపోయాక 1996 నవంబరు 21న శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సాయి ప్రశీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి. కృష్ణంరాజు చిన్నతనం నుండే సాయి భక్తుడు కావడంతో తన ముగ్గురు కుమార్తెలకు సాయి పేరు ఉండేలా చూసుకున్నారు. వీరే కాకుండా సాయి ప్రశాంతి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. కృష్ణంరాజుకు కొడుకులు లేకపోయినా తమ్ముడు సూర్యనారాయణ రాజు కొడుకు ప్రభాస్‌ని తన వారసుడిగా పరిచయం చేసాడు. ప్రభాస్ ఈశ్వర్ సినిమా మొదలుకుని సాహో వరకు అంచలంచెలుగా ఎదుగుతూ యావత్ భారతదేశం అంతా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. కృష్ణంరాజు అనారోగ్యంతో బాధపడుతూ సెప్టెంబర్ 11 వ తేదీన 82 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు.
అవార్డులు :
చిలకా గోరింక సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు కు అనేక అవార్డులు వచ్చాయి. 1977లో అమరదీపం చిత్రానికి ఉత్తమ నటుడిగా, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి రెండో సారి ఉత్తమ నటుడిగా, 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి మూడోసారి ఉత్తమ నటుడుగా, 1983లో వచ్చిన ధర్మాత్ముడు చిత్రానికి స్పెషల్ జ్యూరీ విభాగంలో నంది అవార్డులు అందుకున్నారు. తన కెరీర్లో మొత్తం నాలుగు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను కైవసం చేసుకున్న కృష్ణంరాజును 2006లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. అమరదీపం చిత్రానికి గాను రాష్ట్రపతి అవార్డును సైతం అందుకున్న కృష్ణంరాజుకు తర్వాతి ఏడాది విడుదలైన మనవూరి పాండవులు చిత్రంలో పోషించిన కృష్ణ పాత్రకు గాను కృష్ణంరాజుకు ఈ అరుదైన గౌరవం మరోసారి దక్కింది. 2014లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అందుకున్నారు. ప్రతీ ఏటా టిఎస్సార్ టీవీ9 భాగస్వామ్యంతో ఇచ్చే పురస్కారాలను మూడు సార్లు అందుకున్నారు కృష్ణంరాజు. 2012లో జీవితకాల సాఫల్య పురస్కారం, 2015లో సిల్వర్ స్క్రీన్ లెజెండరీ అవార్డు, 2016లో 5 దశాబ్దాల స్టార్ అవార్డును అందుకున్నారు. 2015లో జీ తెలుగు అవార్డ్స్ వారి జీవిత కాల సాఫల్య పురస్కారంతో పాటు, ఇదే ఏడాది గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్ (గామా) వారు జీవిత కాల సాఫల్య పురస్కారం కృష్ణంరాజున అందుకున్నారు.
రాజకీయాల్లో కృష్ణంరాజు
రెబల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసి రాజకీయనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి 1998లో భారతీయ జనతా పార్టీ తరపున తొలిసారి ఏంపీగా గెలిచారు. అయితే కాకినాడ ఏంపీగా ఏడాది మాత్రమే కొనసాగిన ఆయన 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఏంపీగా పోటీచేసి విజయం సాధించారు. రెండోసారి ఏంపీగా గెలవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను కేంద్రమంత్రి పదవితో గౌరవించింది. 2000 నుంచి 2004 వరకు ఆయన కేంద్ర మంత్రిగా సేవలందించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో తిరిగి నరసాపురం లోక్‌సభ నుంచి ఏంపీగా పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయాలకు అంటి ముట్టనట్టుగా ఉన్న ఆయన 2009 మార్చిలో సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం తొలుత కాంగ్రెస్‌తో ప్రారంభమైంది. 1990లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో సానుకూల ఫలితం రాకపోవడంతో కృష్ణంరాజు కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
-పొన్నం రవిచంద్ర,
9440077499