Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై బైటాయించిన విద్యార్థులుత
- మద్దతు తెలిపిన గ్రామ యువకులు
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
తమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడూరు మండల పరిధిలోని మేడిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు నాగర్కర్నూల్-కల్వకుర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి గ్రామానికి చెందిన కొంత మంది యువకులు మద్దతు తెలిపి నిరసనలో భాగస్వాములయ్యారు. దీంతో రోడ్డుపై దాదాపు గంట పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు రాక పోకలకు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ తమ స్కూల్లో అనేక రకాల సమస్యలు నెలకొన్నాయన్నారు. టాయిలెట్స్ లేకపోవడంతో స్కూల్ ఆవరణ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుందన్నారు. స్కూల్స్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా మధ్యాహ్న బోజనం అందించడం లేదన్నారు. ఇప్పటి వరకు బుక్స్ కూడా ఇవ్వలేదన్నారు. యూనిఫామ్స్ కూడా రాకపోవడంతో పాత బట్టలతో స్కూల్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అందరం పేద విద్యార్థులం అనీ, ప్రయివేటు స్కూల్స్లలో చదుకునే ఆర్థిక స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో చేరితే ఇక్కడ కూడా సరైన సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మూత్రశాలలే లేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. తాగునీరు అందుబాటులో లేక ఇంటి నుంచే బాటిళ్లలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ విషయాలన్నింటిపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
ఇక గత్యంతరం లేక ధర్నాకు దిగినట్టు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో తమ ధర్నా, నిరసనను నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామ యువకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం.. పేద విద్యార్థులందరికీ అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తామని చెప్పినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. మేడిపూర్ జెడ్పీ పాఠశాల 'మన ఊరు-మన బడి' కార్యక్రమానికి ఎంపికైనా ఇంత వరకు పనులు చేపట్ట లేదన్నారు. స్కూల్లో ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభించకపోవడాన్ని చూస్తుంటే.. పేరుకు మాత్రమే 'మన ఊరు-మన బడి' కార్యక్రమం తీసుకొచ్చినట్టుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్లో సమస్యలను పరిష్కరించడం తోపాటు పాఠశాలను సుందరీకరించడం, అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉన్నా.. మేడిపూర్ పాఠశాలలో మాత్రం ఇంత వరకు ఒక్క పని కూడా ప్రారంభం కాలేదన్నారు. పేద పిల్లలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ప్రశ్నించారు. కార్పొరేటు, ప్రయివేటు పాఠశాల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుంటే ఆర్థిక స్తోమత లేని పేద పిల్లలు సర్కార్ పాఠశాలలో చేరుతున్నారనీ, ఇక్కడ కూడా వారికి సరైన సౌకర్యాలు కల్పిచకపోతే చదవుకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలనీ, లేదంటే రానున్న రోజుల్లో ఈ ధర్నాను కాస్త ఉద్యమంలా మార్చి సమస్యలను పరిష్కారమయ్యే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.