Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐఎవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం
నవతెలంగాణ- ధరూర్
గద్వాల మండలం అనంతపురం బాధితులకు రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గత గురువారం ఆ గ్రామానికి చెందిన ఎరుకల కులస్తులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన విధితమే. ఈ ఘటన బాధితులను అనంతాపురం గ్రామంలో ఆ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బోరు కష్ణయ్య, నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరగళ్ళ కష్ణ మౌర్య, నాయకులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల పైన దాడులు జరిగిన సందర్భాలలో పాలకులు అధికార యంత్రాంగం నిందితులకు మద్దతుగా నిలవడం ఆనవాయితీగా మారిందని అన్నారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న బాధితులు గ్రామంలో తిరిగితే ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారని అన్నారు. పేదరికం నిరక్షరాస్యత కారణంగా ఇలాంటి కేసుల్లో బాధితులను భ్రమలకు గురిచేసి, భయపెడుతూ కేసులు ఉపసంహరించేటట్లు చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఇది పునరావతం కాకుండా ఉండేందుకు బాధితులకు చివరి వరకు పోలీసులు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న తహసిల్దార్ బాధితులను పరామర్శించడం కానీ, ఘటనపై విచారణ చేయకపోవడం సరైనది కాదన్నారు. వారిచే ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధులైన వారు కూడా ఆ కుటుంబాన్ని పలకరించలేదని అన్నారు. రోజురోజుకు రాష్ట్రంలో దేశంలో దళితులపై దాడులు పెరగడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని, బాధితులకు ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బోరు కష్ణయ్య మాట్లాడుతూ అనంతాపురం ఘటనకు సంబంధించి అధికారులు వెంటనే బాధితులను పరామర్శించాలని, ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు బొవొల్ల విజరు కుమార్, ధరూర్ మండల నాయకులు వెంకటన్న, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు.