Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోమవారం అర్ధరాత్రి మరో నాలుగు దుకాణాలలో చోరీ !
నవ తెలంగాణ -కల్వకుర్తి
కల్వకుర్తి పట్టణంలో దోపిడీ దొంగలు వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోని పట్టణంలో పలుచోట్ల దాదాపు 7 దొంగతనాలు జరిగాయి. ఇప్పటికే పలువురు ఇళ్లలో దాదాపు 70 తులాలకు పైగా బంగారు ఆభరణాలు దాదాపు 8 లక్షల రూపాయలు దోపిడీ దొంగలు దొంగిలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కల్వకుర్తి పట్టణంలో పలు దుకాణాలలో షట్టర్ తాళాలు పగలగొట్టి ఏదేచ్ఛగా దొంగతనం చేశారు. కెసిఆర్ ఎంటర్ప్రైజెస్ షెటర్ తాళాలు పగలగొట్టి అందులో దోపిడీకి ప్రయాణించినప్పటికీ దొంగలకు ఎలాంటి విలువైన వస్తువులు లభించలేదు. స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ షట్టర్ తాళాలు సైతం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. కల్వ యాదయ్య గోదాం తాళాలు పగలగొట్టి దోపిడీ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణంలో వారం రోజుల వ్యవధిలోనే దొంగలు చెలరేగిపోయి దోపిడీలకు పాల్పడి పోలీసులు మమ్మల్ని పట్టుకోలేరు అన్న రీతిలో సవాల్ విసురుతున్నారు. విద్యానగర్ కాలనీలో విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 55 తులాల బంగారు ఆభరణాలతో పాటు మూడు లక్షల నగదు దొంగిలించి దాదాపు వారం రోజులు అయినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. దీంతో దొంగలు చెలరేగిపోతున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే పట్టణంలో విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నాయన్న విమర్శలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి రాత్రి వేళలో గస్తీ పోలీసుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పోలీసులపై ఉండే నమ్మకం ప్రజలలో సన్నగిల్లే ప్రమాదం ఉంది. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగల భరతం పట్టి ప్రజలలో వారికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.