Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతేలంగణ- ధరూర్
ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు అందరు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళ వారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ప్రతి వార్డు తిరుగుతూ రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో డాక్టర్లు వైద్యం ఎలా చేస్తున్నారు, వైద్యానికి వేచి ఉండాల్సిన సమయం ఎంత, మందులు బయటికి చీటి రాసి ఇస్తున్నారా అనే పలు రకాలైన ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు.రికార్డులు సరిగ్గా నిర్వహించాలని అందులో పేషంట్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయములో చాలా మెరుగు పడాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డును, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. బయోమెట్రిక్ ద్వారా ప్రతి సిబ్బంది సమయానికి హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. రక్త పరీక్షలు ఆస్పత్రిలోనే నిర్వహించాలన్నారు. బయట వారు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకేళ్ళరాదని హెచ్చరించారు. మందులు సరిపడా రోగులకు అందజేయాలని బయటకు రాసివ్వకూడదని కలెక్టర్ తెలిపారు. సదరన్ క్యాంపులు నిర్వహించే ముందు దివ్యాంగుల వివరాలు కంప్యూటర్లో నమోదు చేసి వారికి పరీక్షల అనంతరం డాక్టర్ సంతకం తో సర్టిఫికెట్ అందజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు కూర్చోవడానికి కుర్చీలు వేయించాలని వారు ఇబ్బందులు పడకుండా కలర్ టోకెన్లు అందజేయాలని కలెక్టర్ అన్నారు. ఐసీయూ, ఎస్ఎన్సి ఆక్సిజన్ పైప్ లైన్ నుండి మెయిన్ పాయింట్ కు పనులు పెండింగ్ ఉన్నవని వైద్య ఆరోగ్య శాఖాదికారి కలెక్టర్ దష్టి కి తీసుకు రాగా పది రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేయించాలని ఈ ఈ జయపాల్ రెడ్డి కి ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్లు శోభ రాణి, హ్రుశాలిని, క్వాలిటీ మేనేజర్ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.