Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని, రాష్ట్రంలో గతంలో ఇచ్చే పింఛన్లు కాకుండా మరో పది లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్లతో పాటు గుర్తింపు కార్డులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మొత్తంలో కొత్తవాటితో కలిపి 50 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్తు మూలంగా కొత్త పింఛన్ల పంపిణీ ఆలస్యమయిన మాట వాస్తవమేనన్నారు. ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష 116 ఆర్థికసాయం, రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేల సాయం చేస్తున్నామన్నారు. తెలంగాణలోని సన్న, చిన్నకారు రైతుల చేతుల్లోనే 92.5 శాతం భూమి ఉందన్నారు. నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగాలన్న తలంపుతోనే తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా పేదవర్గాల చేతుల్లోకే వెళ్లాలన్నారు. 57 ఏళ్ల వయసుండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందిస్తామన్నారు. 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు సీఎం కేసీఆర్ కుదించారన్నారు. పింఛను అర్హత వయసు తగ్గించాలని ఎవ్వరూ కేసీఆర్ను కోరలేదని, వారే స్వయంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. 58 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగ విరమణ తీసుకుని పింఛను తీసుకున్నప్పుడు రెక్కల కష్టం చేసుకుని బతికే సామాన్యులకు 65 ఏళ్లకు పింఛను ఇవ్వడం ఏంటని కేసీఆర్ 57 ఏళ్లకు కుదించారని తెలిపారు. అనంతరం ఘణపురం మండల కేంద్రంలో 'మన ఊరు - మన బడి' పథకం కింద రూ.కోటి 20 లక్షలతో నిర్మించబోయే నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, విద్యార్థులతో సమావేశమై వారికి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి, నగదు బహుమతి అందజేశారు.