Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న నాలుగు లైన్ల రోడ్డు పనులు
- దుమ్ముదూళీతో ప్రయాణికుల ఇక్కట్లు
వనపర్తి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న నాలుగు లైన్ల రోడ్డు పనుల్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా భవనాల కూల్చివేత పనులు వేగవంతమయ్యాయి.
నవతెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ - గోపాల్పేట రోడ్డులోని విద్యుత్ శాఖ భవనం నుంచి జిల్లా కేంద్రంలోని హరిజనవాడ, గాంధీనగర్, అంబేద్కర్ చౌరస్తా, రాజీవ్ చౌరస్తా వరకు ఈ కూల్చివేత పనుల్లో వేగం పుంజుకుంది. అలాగే కొత్త బస్టాండ్, రూరల్ పోలీస్ స్టేషన్, రామాలయం రహదారి వెంట మర్రికుంట వరకు మూడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగనున్నాయి.
భవనాల కూల్చివేత పనులే ప్రధానం
వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం రూ.49.5 కోట్లు కేటాయించింది. పట్టణంలో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు పనులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తోంది. ఇందులో ప్రధానంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల కూల్చివేత పనులే ఉన్నాయి. ఈ భవనాల కూల్చివేత పనులు పూర్తయితే దాదాపు రోడ్డు విస్తరణకు సంబంధించి 50 శాతం పనులు పూర్తయినట్లే. ఇప్పటి వరకు ప్రధాన రహదారి పనులు కొత్త బస్టాండు నుంచి మర్రికుంట, కొత్తకోట, పాన్‌గల్, ఘనపురం రోడ్డు పనులు దాదాపు 70 శాతం పూర్తి అయ్యాయి. కానీ కొత్త బస్టాండు నుంచి హైదరాబాద్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. రాజీవ్ చౌరస్తా నుంచి పార్రంభించిన రోడ్డు పనులు అంబేద్కర్ చౌరస్తా ముందు వరకు అక్కడక్కడ ఒక వైపు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు క్రమంగా కొనసాగుతున్నాయి.
దుమ్ము దూళితో ప్రయాణికుల ఇబ్బందులు
విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం నుంచి రాంనగర్ కాలనీలోని పెట్రోల్ పంపు వరకు దాదాపు 80 శాతం నాలుగు లైన్ల రోడ్డు పనులు పూర్తయ్యాయి. పెట్రోల్ పంపు నుంచి రాజీవ్ చౌరస్తా వరకు రోడ్డు పనులు కొనసాగుతుండటం, రోడ్డుపై గుంతలు ఏర్పడటం వంటి కారణాలతో బస్సులు, లారీలు వంటి పెద్దపెద్ద వాహనాల రాకపోకల సందర్భంగా దుమ్ముదూళీ ప్రభావం ప్రయాణికులపై ఎక్కువగా పడుతోంది. కళ్లల్లో దుమ్ము పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబేద్కర్ చౌరస్తా వరకు కనీసం వన్‌వే పనులైనా పూర్తి చేస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగుతాయి. ఇప్పటి వరకు రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన ఇళ్ల నిర్మాణాల దగ్గర పనులు ప్రారంభించినా కొంత ఊరట లభించే దంటున్నారు. వేసవిలో కూల్చివేత పనులు పూర్తయ్యి ఉంటే విస్తరణ పనులకు ఇబ్బందులు తప్పేవని వాహదారులు తెలిపారు.
గాంధీనగర్, రాజీవ్ చౌస్తాల్లో కూల్చివేతలు
అంబేద్కర్ చౌరస్తా నుంచి రామాటాకీస్ మీదుగా గాంధీచౌక్, హరిజనవాడ వరకు ఈ పనుల్లో భవనాల కూల్చివేత పనులు క్రమంగా కొనసాగుతున్నాయి. హరిజనవాడ-జమ్మిచెట్టు నుంచి గాంధీనగర్-ఘనపూర్ రోడ్డు వరకు భవనాల కూల్చివేత పనులు పూర్తి కావడంతో డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. పెట్రోల్ పంపు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఇండ్ల నిర్మాణాలు, షాపుల కూల్చివేత, కరెంటు పోల్స్ తొలగించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. రాజీవ్ చౌరస్తాలోని షాపింగ్ మాల్స్, కమర్షియల్ షాప్స్ను జేసీబీ, హిటాచీలతో రోడ్డు మార్కింగ్ ఇచ్చిన వరకు భవన కట్టడాలను కూల్చివేస్తున్నారు. అలాగే గాంధీనగర్‌లో రోడ్డు మలుపులో ఉన్న ఓ భవనాన్ని కూలీ లతో కూల్చివేస్తున్నారు. అయినా ఇంకా కొన్ని కట్టడాలు అలాగే ఉన్నాయి. వాటిని కూడా త్వరగా కూల్చివేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.