Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కడంతా పరుచుకున్న పచ్చదనమే కనిపిస్తుంది.12 ఎకరాల విస్తీర్ణం.వేల సంఖ్యలో మొక్కలు..విశాలమైన వాతావరణం.. వెరసి చుట్టూరా తివాచీ పరిచినట్లు ఎర్రని రహదారులు.. అక్కడక్కడా జిగేలమనిపించే సోలార్ లైట్లు.. పచ్చదనాన్ని నిత్యం కాపాడేందుకు శ్రమించే శ్రామికులు ఓ వైపు.. ఆ పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు అక్కడికొచ్చే పర్యాటక ప్రేమికులు మరోవైపు.. ఆనందంతో చిందులేసే చిన్నారుల కేరింతల్లో ఊయలలూగించే ఆట స్థలం ఆ పార్కు సొంతం. ఇన్ని వనరులున్న ఆ స్థలం ఎక్కడో కాదండీ.. వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఏకో పార్కుదే.
- ఆహ్లాదాన్ని పంచుతున్న వనపర్తి ఏకో పార్కు
- ఆటపాటలతో చిందులేస్తున్న చిన్నారులు
- హాయినిస్తున్న పచ్చని చెట్లు, మొక్కలు
- మార్నింగ్ వాక్కు ఫ్రీ ఎంట్రీ
నవతెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఫారెస్టు ప్రాంతం. చుట్టూ చిన్నచిన్న గుట్టలు. చెట్లు చేమలతో పచ్చదనం పరుచుకున్నట్లుంటుంది. ఇదే ప్రాంతంలో నీలగిరి వనం అందరినీ ఆకట్టుకుంటుంది. పట్టణం పూర్తిగా దాటకముందే మరో సుందరవణం దర్శనం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా మొక్కల పెంపకం చేపట్టి వనాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే పట్టణాల్లో ప్రకృతి వనాలను నెలకొల్పింది. అవసరమైన చోట మినీ పార్కులను ఏర్పాటు చేసింది.
అర్బన్ ఫారెస్టు పార్కు ఏర్పాటు ఇలా..
వనపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోంది. జిల్లా కేంద్రం ఎడ్యుకేషన్ హబ్‌గా మారడంతో స్థానికులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యావంతులతో పాటు విద్యార్థులతో సందడిగా మారింది. ఇక్కడ మంచి వాతావరణం ఉండటంతో పాటు జిల్లా కేంద్రం చుట్టూరా కొంతమేర ఫారెస్టు ఉండటం ఒక వరం. జిల్లా కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫారెస్టు ప్రాంతంలోనే జిల్లా ప్రజల కోసం 2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 12 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ ఫారెస్టు పార్కును ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా రూ. నిధులను కేటాయించింది. ఫలితంగా అదే యేడాది అక్టోబర్ మాసంలో అప్పటి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు శాసనసభ్యులు జిల్లెల చిన్నారెడ్డి అధ్యక్షతన పార్కును ప్రారంభించారు. దీని నిర్వహణ ఫారెస్టు అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతోంది.
పరుపులా పచ్చదనం ఏర్పాటు
12 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్టు పార్కుకు ఏకో పార్కుగా నామకరణం చేశారు. ఈ పార్కులో పచ్చదనాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశ్యం. పార్కు అంతటా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని వేట సంఖ్యలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ ఆరేళ్లలో పెరిగిన మొక్కలు నేడు పెద్ద వృక్షాలుగా మారాయి. అవి ఆహ్లాదంతో పాటు చూపరులకు ఆనందాన్ని పంచు తున్నాయి.పార్కుకు వచ్చే పర్యాటకులను చెట్లన్నీ చల్లటి పిల్లగాలులతో ఓలలాడిస్తున్నాయి. ప్రధానంగా గ్రీన్ చెట్లు, అశోక చెట్లు, రావి, మర్రి, జమ్మి, వేప, మామిడి, ఈత, మారేడు,జామ,చింత చెట్లు, నెమలినార, నారవేప, శీతాఫల్, కానుక, పులిచింత చెట్లు పెంచుతున్నారు. పార్కులో నలుదిక్కులా వరుస క్రమంలో పెరిగిన మొక్కలు చూపరులను కట్టిపడేస్తూ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు చెట్లకింద సేదతీరుతున్నారు.
ఓపెన్ జిమ్, మినీ స్టేజీ ఏర్పాటు..
పార్కు మధ్యలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం వాకింగ్ చేశాక వ్యాయామం చేసుకోవడానికి ఆ వస్తువులు ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా మినీ స్టేజీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ భోజనాలు చేయడానికి వీలు కల్పించారు. అలాగే పుట్టిన రోజు వేడుకలు, చిన్న చిన్న మీటింగ్‌లు, పార్కులో ఫొటోలకు అవకాశం కల్పిస్తున్నారు.
ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం
ఏకో పార్కును ఉదయం ఐదు గంటలకు ప్రారంభిస్తారు. దాదాపు మూడు గంటల పాటు అంటే 8 గంటల వరకు మార్నింగ్ వాక్కు ఉచితంగా అనుమతి ఉంటుంది. రెండు గంటలు క్లీనింగ్ ఉంటుంది. పది గంటల నుంచి సందర్శకులకు పార్కులో గడిపేందుకు అనుమతి ఉంటుంది. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.20ల టికెట్టుతో పార్కులో సాయంత్రం వరకు అక్కడే పార్కులో ఉండేందుకు అనుమతిస్తారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత పార్కు మూసివేస్తారు.
ఆనందాన్ని పంచుతున్న ఆట వస్తువులు
పార్కులో ప్రత్యేకంగా పిల్లలకోసం ఏర్పాటు చేసిన పిల్లల ఆట స్థలం ఒక గ్రౌండులా ప్రహరీని ఏర్పాటు చేశారు. ఆ ప్రహరీ మొత్తం ఇసుకతో నింపారు. అందులో ఊయలలు, గుర్రపుబండి, జారుబండ, చక్రం ఊయల, జంపింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. వీటిల్లో పిల్లలు ఆనందంగా గడుపుతున్నారు. చుట్టూ మొక్కలు ఉండటంతో పచ్చని వాతావరణంలో వారి ఆనందానికి ఆకాశమే హద్దవుతోంది. అంతేకాకుండా డైనోసార్, రాక్షస బల్లి వంటి బొమ్మలతో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు.