Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపూర్ణ ఆహారం లభ్యం
- మహబూబ్‌నగర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త అనిల్ కుమార్ రెడ్డి
తెలంగాణలోన అధికంగా ఉన్న దక్కన్ నల్లజాతి గొర్రెలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.అన్ని కాలాల్లో ఆరోగ్యంగా ఉండే నల్లజాతి గొర్రెల మాంసం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా దక్కన్ నల్లజాతి గొర్రెల పెంపకం ఉంటుంది. సంకరజాతి గొరిల్లా వల్ల క్రమంగా నల్ల జాతి గొర్రెలు క్రమంగా నశించిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేలాదిమందికి ఉపాధినిచ్చె దక్కన్ నల్లజాతి గొర్రెలను అటు ప్రభుత్వం ఇటు రైతులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పశు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. దక్కన్ నల్లజాతి గొర్రెలను కాపాడుకోవడంలో భాగంగా నవ తెలంగాణ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
నవ తెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నవతెలంగాణ : దక్కన్ నల్లజాతి గొర్రెల పెంపకం విషయంలో
మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ?
అనిల్‌కుమార్ రెడ్డి : గొర్రెల పరిశోధన కేంద్రం మహబూబ్‌నగర్‌లోని బండి మీద పల్లి లో ఉంది. ఇక్కడ కేవలం దక్కన్ నల్లజాతి గొర్రెల అంతరించిపోకుండా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.మేలైన పశుగ్రాసం విత్తనాలు వీటికి వచ్చే వ్యాధులు తీసుకునే ఆహారము తదితర విషయాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. గొర్రెలు ఉండడానికి వీలుగా షెడ్లు వేశాం. గ్రాసం వాటిని ఉత్పత్తి చేయడానికి విత్తనాలను సైతం ఎంపిక చేస్తాం.
నవతెలంగాణ: మిగతా గొర్రెల కన్నా ఏ విధంగా
లాభదాయకంగా ఉంటాయి ?
అనిల్‌కుమార్ రెడ్డి: దక్కన్ నల్లజాతి గొర్రెలు మహబూబ్‌నగర్ జిల్లా వాతావరణానికి పెరుగుతాయి. సమశీతోష్ణ మండలం కావడం చేత ఇక్కడ ఈ జాతి గొర్రెలు అధికంగా బలంగా ఉంటాయి. దక్షిణ తెలంగాణలోని నల్ల జాతి గొర్రెలు మన జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. అందుకే నల్ల జాతి గొర్రెల పరిరక్షణ కోసం మన జిల్లాలో పశు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పశువులతోపాటు మేకలను సైతం ఇక్కడ పరిశోధించి మేలు రకమైన నల్లజాతి గొర్రెలు మేకలను ఉత్పత్తి చేయడానికి పరిశోధనలు జరుపుకుంటాం. ఇక్కడ ఉండే గొర్రెలు బలిష్టంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడి వాతావరణానికి తట్టుకునే విధంగా ఉంటాయి. ఇక్కడి మాంసం సైతం మిగతా గొర్ల కంటే రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకే గొర్రెల పెంపకం విషయంలో దక్కన్ జాతి ఎంపిక శ్రేయస్కరం.
నవతెలంగాణ : దక్కన్ నల్లజాతి పరిశోధన కేంద్రంలో
మౌలిక వసతుల పరిస్థితి ఏంటి ?
అనిల్‌కుమార్ రెడ్డి : గొర్రెల పరిశోధన కేంద్రంలో ఇంకా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే మేలైన గొర్రెల ఉత్పత్తికి మరిన్ని పరిశోధనలు చేసే అవకాశాలున్నాయి. హైదరాబాదు నుంచి శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ రక్త నమూనాలను తీసుకెళ్లి హైదరాబాదులో పరిశోధనలు చేయాల్సి వస్తుంది. ఇక్కడనే ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే పరిశోధనలు వేగవంతంగా చేస్తారు. దాని ఫలితాలు త్వరితగతిన పాలకులకు చేరుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను అధికంగా కేటాయించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనీ కొరుతున్నాం.
నవతెలంగాణ: పశు పరిశోధన కేంద్రాన్ని ఇక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉన్నారు కదా ? మరి దీనిపై మీ అభిప్రాయం .
అనిల్‌కుమార్ రెడ్డి : మహబూబ్‌నగర్ జిల్లాలోని బండమీది పల్లి దగ్గర 236 ఎకరాలతో 1950లో ఇక్కడ పశు పరిశోధన కేంద్రాన్ని స్థాపించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పాలమూరు యూనివర్సిటీకి వంద ఎకరాలను పశు పరిశోధనా కేంద్రంకు చెందిన భూమిని తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్టీవో కార్యాలయానికి6 ఎకరాలు తీసుకున్నారు. తాజాగా కోర్టుల సముదాయానికి 15 ఎకరాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రభుత్వ శాఖలకు ఒకవైపు ఇస్తుంటే మరోవైపు బైపాస్ రహదారి నిర్మాణం కోసం మొత్తం భూమి పోతుంది. గొర్రెల పెంపకం విషయంలో అత్యధికంగా భూమి అవసరం ఉంటుంది. ఇక్కడినుండి మరోచోట గొర్రెల పెంపకానికి పరిశోధన కేంద్రానికి చూయిస్తామంటున్నారు. గుట్టలు లోయలలో భూమి చూస్తే గ్రాసం పెంపకం గొర్లు తినడానికి యోగ్యంగా ఉండదు. అందుకే పరిశోధన కేంద్రాన్ని ఇక్కడే ఉంచాలని కోరుతున్నాం.
నవతెలంగాణ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన
కేంద్రానికి ఎటువంటి సహకారం ఇస్తున్నారు ?
అనిల్‌కుమార్ రెడ్డి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం బాగానే ఉంది. ముఖ్యంగా కేంద్రం ప్రాజెక్టు పనులు ఉపయోగపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం సహకరిస్తుంది. ఈ పరిశోధన కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులతో పాటు ఇద్దరు శాస్త్రవేత్తలు ఉన్నారు. పరిశోధన కేంద్రంలో మరింత సిబ్బందిని పెంచి పరిశోధనలకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
నవతెలంగాణ: గొర్రెలు మేకల కాపర్లకు మీరు ఇచ్చే సలహాలు
సూచనలు ఏమిటి ?
అనిల్‌కుమార్ రెడ్డి :గొర్రెల కాపరులు దక్కన్ నల్లజాతి గొర్రెలను పెంచుకోవాలి. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మేలైన పశుగ్రాసం విత్తనాలను అందుబాటులో ఉన్న పరిశోధన కేంద్రం నుంచి తెప్పించుకోవాలి. అంతుచిక్కని వ్యాధులు వస్తే పశువైద్యాధికారిని సంప్రదించాలి.గొర్రెల కోసం ప్రత్యేకమైన షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. గొర్రెలు మేకలు వ్యాధిన పడితే వెంటనే గుర్తించి వాటిని విడదీసి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి.