Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ- వనపర్తి
అర్హులైన ప్రతి ఒక్కరికి చట్టబద్ధంగా సహాయం చేస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం గోపాల్ పేట మండలం ఏదుట్లలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రేవల్లి మండల కేంద్రంలో సర్వవర్గ సామూహిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన బండరావిపాకుల ఆర్ ఆర్ సెంటర్ లో నూతన ప్రభుత్వ భవనాలు ప్రారంభించారు. కొంకలపల్లి ఆర్ ఆర్ సెంటర్ ను పరిశీలించి, నిర్వాసితులకు ప్లాట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ అవసరం కోసం భూములు త్యాగం చేయడం వెలకట్టలేనిదని లబ్ధిదారులను ఉద్దేశించి అన్నారు. నిబంధనలకు లోబడి అందరికీ పరిహారం అందజేస్తామన్నారు. మీ త్యాగాన్ని ప్రభుత్వం ఎన్నడూ తక్కువ చేసి చూడదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రకారం లక్షల ఎకరాలకు సాగునీరా అందించేందుకు మీరు భూములు త్యాగంచేయడం అభినందనీయం అని పొగిడారు. బాధితులు కోరిన విధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందజేస్తామన్నారు. అర్హులయిన ప్రతి ఒక్కరికీ ఇండ్ల ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ఆర్ %డ% ఆర్ సెంటర్ లో పాఠశాల, పశు వైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రం, డైనేజీ, తాగునీటి సౌకర్యాల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వపరంగా మీకు అందే ప్రతి సాయం అందేలా చూస్తామన్నారు. చేపల సంఘం ఏర్పాటుకు సహకార శాఖలో నమోదు చేసుకోవాలన్నారు. దసరా తర్వాత కొంకలపల్లి గ్రామస్తులు ఆర్ఆర్ సెంటర్ లో ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టుకోవాల ని సూచించారు. బండరావిపాకుల ఆర్ ఆర్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించారు. నిర్వాసితులకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, సీఈ హమీద్ ఖాన్, జేసీ వేణుగోపాల్, డీఈ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.