Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ సంస్థ పాలకేంద్రం
- రోజూ 2100 లీటర్ల పాల సేకరణ
- 34 సంఘాలతో జిల్లాలో కొనసాగింపు
- రైతులకు రేట్లు పెంచి ఆదరిస్తున్న కేంద్రం
- ఉచిత శిబిరాలతో పాడిపరిశ్రమకు తోడ్పాటు
- ప్రత్యేక పథకాలతో ఆకర్శిస్తున్న'విజయ' డెయిరీ
పాడి పరిశ్రమ తగ్గడం మూలాన పాల అవసరం పెరిగినా స్వచ్ఛమైన పాలు అందకుండా పరులపాలవుతున్నాయి. పాల వినియోగం అధికం కావడంతో పాలను కల్తీ చేసి మరీ విక్రయిస్తుండటంతో మనుషుల ఆరోగ్య స్థితిగతులపై ప్రభావం చూపుతున్నాయి.
నవ తెలంగాణ -వనపర్తి
ఉదయం నిద్ర లేచింది మొదలు పసిపిల్లల నుంచి వయస్సు మళ్లిన వారి వరకు పాలు ఏదో ఒక రూపంలో అవసరమే. ఈ పాలు లేనిదే ఏ ఇల్లూ పొద్దు గడవదు. అలాంటి నిత్యావసర వస్తువైన పాల ఉత్పత్తి నేడు తగ్గి పోతున్నది. పాడి పరిశ్రమ తగ్గడం మూలాన పాల అవసరం పెరిగినా స్వచ్ఛమైన పాలు అందకుండా పరుల పాలవుతున్నాయి. పాల వినియోగం అధికం కావడంతో పాలను కల్తీ చేసి మరీ విక్రయిస్తుండటంతో మనుషుల ఆరోగ్య స్థితిగతులపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా చిన్న పిల్లలకు కొత్తకొత్త రోగాలు అంటకాగుతుండటం మరో ముఖ్యమైన అంశం. ఈ కల్తీపాలను అరికట్టాలంటే నాణ్యతకు మారుపేరైన విజయపాలను వినియోగించడం శ్రేయస్కరమని పాలకేంద్రం అధికారులు చెబుతున్నారు.
పాల వినియోగింతో ఉపయోగాలెన్నో..
పాలను స్వీట్స్, చాక్టెట్స్ వంటి ఉత్పత్తుల్లో విరివిగా వాడుతుంటారు. పాలల్లో విటమిన్ ఎ, బి, సి, డి, బి2, బి6, బి12తో పాటు ప్రోటీన్, కాల్షియం, పాస్పరస్, పొటాషియం, జింక్ ఉంటాయి. పాలలో 87 శాతం నీరు, 4 శాతం కొవ్వు, 4.9 శాతం కార్బొహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలల్లో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది. పాలను రోజూ తీసుకునే వారికి కాల్షియం లోపం ఉండదు. ఎముకలకు సంబంధించిన వ్యాధులు కూడా రావు. అందంగా తయారవ్వాలనుకుంటే పాలు కూడా తీసుకోవాలి. అందం గురించి కాకుండా రోజు పాలు తీసుకునే వారిలో క్యాన్సర్ రావడాన్ని నిరోధించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఎదిగే వయస్సులో పాలు తాగే అలవాటు చేయటం ఎంతో మంచిది.
చదివే పిల్లలను పాలు తాగేలా ప్రోత్సహించాలి. ఆరోగ్యంతో పాటు చురుకుగా ఉంటారు. కాచిన పాలకంటే గుమ్మపాలే శ్రేయస్కరమని కొందరు అపోహపడుతుంటారు. కానీ కాచిన పాలే మంచివి. ఎందుకంటే పాలల్లో ఉండే హానికారక కీటకాలు పాలను కాచడం వల్ల నశిస్తాయి.
పాలకేంద్రం పరిధిలో పరిస్థితిలా...
వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలోని మర్రికుంటలో పాల శీతలీకరణ కేంద్రం ఉంది. ఇక్కడ 1997 నుంచి ఈ కేంద్రం కొనసాగుతోంది. ఈ కేంద్రానికి 34 పాల సేకరణ కేంద్రాల ద్వారా పాడి రైతుల నుంచి ప్రతి రోజూ 2100 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. వీటిని ప్రతి రోజూ మధ్యాహ్నం పాల ట్యాంకర్ ద్వారా హైదరాబాద్కు పంపుతున్నారు. దీంతో పాటు విజయ పాల ఉత్పత్తులైన దూద్పేడ, మజ్జిగ, లస్సీ, నెయ్యి, బాదం పాలు వంటివి వనపర్తి పట్టణంలో విజయ డైరీ పార్లర్ల ద్వారా ప్రతి రోజూ విక్రయిస్తున్నారు. విజయ తెలంగాణ డైరీ పాడి రైతులు, పాలు సేకరణకు గానూ ప్రతి నెలకు దాదాపు 22 లక్షల రూపాయలను పాలకేంద్రం అందజేస్తోంది. విజయ తెలంగాణ డైరీకి పాలు సరఫరా చేసే పాడి రైతుల కోసం జూలై 2019 నుంచి పాలు సరఫరా చేసే సంఘాలకు సంబంధించిన పాలకు లభించే ధరలను నేరుగా పాడి రైతుల ఖాతాలకు జమ చేస్తోంది. గేదె పాలకు 6 శాతం ఉండే వెన్న శాతానికి లీటర్ పాలకు రూ.44లు, ఆవు పాలకు 4 శాతం ఉండే వెన్న శాతానికి లీటర్ పాలకు రూ.39లు ఇస్తోంది. జిల్లాలోని పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగదు ప్రోత్సాహం కింద ఒక్క లీటర్కు రూ.4ల చొప్పున నవంబర్ 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు చెల్లించారు. ఆ తర్వాత 2019 నుంచి పాడి రైతులకు ఇచ్చే ప్రోత్సాహకం నిలిచిపోయింది.
తెలంగాణ రాష్ట్ర పశు పథకం ద్వారా జిల్లాలో 532 ఆవులు, గేదెలను రైతులకు పంపిణీ చేశారు. ఈ పశువులకు 159 టన్నుల ఉచిత పశు దాణాను సరఫరా చేశారు. వివిధ రకాల సాంకేతిక వనరులైన జొన్నలు, పశువుల మందులు, విజయదాణాను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో రైతు సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీల్లో 15 మంది లేదా ఆ పైన సభ్యులున్నారు. 15 రోజులకు ఒకసారి చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు విజయ డెయిరీ జమచేస్తోంది.
ఆత్మనిర్భర్ పథకం ద్వారా లోన్లు మంజూరు
ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం) ద్వారా వనపర్తి జిల్లా పాడి రైతులకు ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల నుంచి రూ.48 లక్షల రుణాలను మంజూరు చేయించింది. గతంలో వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఇచ్చే పశు సంపద రుణాలను నేడు పాడి రైతులతో పాటు వీధి వ్యాపారులకూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో ఎంతో మందికి మేలు చేకూరుతోంది. విజయ తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం బ్యాంకు లోను ద్వారా కొనుగోలు చేసే పాడి పశువుకు రూ.10 వేలు రాయితీ ఇవ్వడంతో పాటు ఒక పశువుకు అయ్యే ఖర్చు మొత్తంలో రూ.1000లు రాయితీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 270 పశువులకు ఇన్సూరెన్స్ కింద డివిఎహెచ్ఓ ద్వారా ఇప్పిస్తారు. విజయ తెలంగాణ పాల ఉత్పత్తిదారులకు శ్రీనిధి (మహిళా సంఘాలు) బ్యాంకు సహకారంతో పాడి పశువులను రుణాలను అందజేస్తుంది.
పాడి రైతు కుటుంబాలకు విద్యాకానుక
విజయ విద్య కానుక పథకం కింద ఈ ల్యాబ్లో ఉండి రూ.4ల ప్రోత్సాహం తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. పదో తరగతిలో 9 సిజిపిఎ పైన మార్కులు సాధించిన నమోదిత పాల ఉత్పత్తిదారుల పిల్లలకు నగదు ప్రోత్సాహకంగా రూ.1000లతో పాటు ప్రశంసా పత్రాన్ని విజయ డెయిరీ అందజేస్తోంది. అలాగే ఎంసెట్లో ప్రవేశ పరీక్షలో 10000 కంటే తక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.2000లతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తోంది. ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ సాధించిన విద్యార్థులకు రూ.2000లతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తోంది. జెఈఈ ద్వారా ఐఐటి సీటు సాధించిన విద్యార్థులకు రూ.2000లతో పాటు ప్రశంసాపత్రం, సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు రూ.10,000ల నగదు ప్రోత్సాహక బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తోంది.
మినీ పాల డెయిరీ ప్యాకేజీ ద్వారా మరికొన్ని సేవలు
నెలకు 1500 లీటర్లు, అంతకంటే ఎక్కువ పాలు పోస్తున్న పాడి రైతులకు విజయ డెయిరీ మద్దతుగా ఉంటూ చాఫ్ కట్టర్లు కొనడానికి రూ.18,000లు అందజేస్తుంది. పాల క్యానులు కొనడానికి రూ.3000లు ప్రోత్సాహం ఇస్తుంది. కరెంటు బిల్లులపై సబ్సిడీ, సబ్సిడీపై విజయ దాణా, పాడి పశువులకు భీమాపై సబ్సిడీ, సబ్సిడీపై మినరల్ మిక్షర్, కాల్షియం వంటివి 50 శాతం రాయితీతో అందిస్తుంది. ఒక సంచిపై రూ.300ల రాయితీ లభిస్తుంది. బయటి కంపెనీలతో పోల్చుకుంటే ఇక్కడ లభించే దాణాను సగం ధరకే విక్రయిస్తుంది.
దసరా పండుగకు కానుక
ప్రతి దసరా పండుగకు ఎంసీసీ లేదా బీఎంసీలలో అత్యధికంగా పాలు సరఫరా చేసిన ఒక మహిళకు, ఒక పురుషుడికి రూ.2116లు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది.
వివాహ, వైకుంఠ దామం ప్రత్యేక కానుకలు
విజయ డైరీ ఆధ్వర్యంలో నమోదిత రైతుల కుటుంబాల్లో వివాహం జరిగితే ప్రోత్సాహంగా రూ.5,000ల నగదు చెల్లిస్తుంది. అలాగే పాడి రైతు కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వైకుంఠదామం ఖర్చు రూ.5000లు అందజేస్తుంది.
ఉచితంగా పశువైద్య శిబిరాలు
విజయ డైరీ ఆధ్వర్యంలో నమోదిత పాడి రైతులకు మూడు నెలలకు ఒకసారి పశువైద్య శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా నట్టల నివారణ, దోమకాటు వ్యాధి నిర్వహణ, కృత్రిమ గర్భధారణకు సెమన్ అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.