Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 మంది నుంచి కోటిన్నర వసూలు చేసినట్టు సమాచారం
- పోలీసుల అదుపులో కొంతమంది నిందితులు
- తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టాలు బయటికొచ్చాయి
- ఇండ్ల విషయంలో మొదటి నుంచి అనుమానాలే..
- చక్రం తిప్పుతున్న బినామీలు
- బినామీల పోన్ సంభాషన వైరల్
- లబ్దిదారులకు అన్యాయం జరగొద్దు: మహబూబ్‌నగర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ. రాములు.
కాదేదీ కవితకనర్హం అన్నట్టు.. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం డబుల్ బెడ్ రూములనూ తాకింది. అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. లక్షలు దండుకున్నారు.. అయితే ఇందులో అసలు దొంగలెవరన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.. సుమారు 60 మంది నుంచి కోటిన్నర వసూలు చేసిన విషయం నిజం కాదా.. అసలు తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టా కాగితాలు బయటకు ఎలా పోయాయి..? అక్రమాల విషయంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చక్రం తిప్పుతున్న బినామీదారులు, అక్రమార్కుల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిది
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో డబుల్‌బెడ్ రూముల కేటాయింపుల్లో మొదటి నుంచి అనుమానాలు వస్తున్నాయి. కొందరు అక్రమార్కులు ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకొని నకిలీ పట్టాలు ఇచ్చారని తెలిసింది. ఆ పట్టాలు పొందిన లబ్దిదారులు దివిటిపల్లిలోని డబుల్ బెడ్రూముల దగ్గరకు చేరుకోవడంతో విషయం బయట పడింది. ఇదివరకే ఆ ఇండ్లను వేరేవారికి కేటాయించారని తెలియడంతో ఖంగుతున్నారు. ఇదే విధంగా 15 మంది నుంచి డబ్బులు తీసుకున్నట్టు సమాచారం. ఓ కాంట్రాక్టు పనులు చేసుకుంటున్న వనగంటి ప్రకాశ్‌కు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన శ్రీధర్ రూ.3.50 లక్షలు, రూ.శ్రీకుమార్ 2.50 లక్షలు, శ్రీనివాస్ రూ.2.75 లక్షలు ఇచ్చారు. వీరంతా పాల వ్యాపారం చేసుకుని జీవించేవారు. నకిలీ పట్టాలు ఇచ్చారన్న విషయం తెలియడంతో పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాగే, పాల వ్యాపారం చేసుకునే వారికి 10 ఇండ్లను ఇచ్చారు. వీరిలో కర్ణాటక, రాయిచూరు, షాబాద్, దేవరకద్రకు చెందిన వారున్నారు. మరో బాధితురాలు సరోజకు సర్వేనెంబర్ 523లో క్రిస్టియన్‌పల్లి దగ్గర 2012లో ప్లాటు ఇచ్చారు. తర్వాత అక్కడే డబుల్ బెడ్రూము కేటాయించి తర్వాత వాపస్ తీసుకున్నారు.
పోలీసుల అదుపులో బినామీలు
ఇండ్లలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందితులను అరెస్టు చేసి మహబూబ్‌నగర్ రూరల్ స్టేషన్లో వీరిని ఉంచి విచారిస్తున్నారు. బాధితుల నుంచి సహకారం సేకరించే పని పూర్తి అయినట్టు సమాచారం. ముఖ్యంగా పట్టా కాగితాలు బయటకు ఎలా వచ్చాయన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తహసీల్దార్ సంతకం పోర్జరీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుండే తతంగం నడిపించినట్టు తెలుస్తోంది. పోలీసుల సమగ్ర విచారణ తర్వాత అసలు విషయం బయటకు రానుంది. 60 మందికి నకిలీ పట్టాలు ఇచ్చి కోటిన్నరకు పైగా బాధితుల నుంచి వసూలు చేశారని తెలిసింది. పోలీసుల విచారణతో మరింత సమాచారం బయకు రావాల్సి ఉంది.
లబ్దిదారులకు న్యాయం జరగాలి
జిల్లా వ్యాప్తంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇండ్ల విషయంలో అక్రమార్కుల జోక్యం పెరిగిపోతుంది. ఈ విషయంపై మంత్రి కల్పించుకుని లబ్దిదారులకు వారికి పట్టాలివ్వాలి. ముఖ్యంగా అక్రమంగా డబ్బులు తీసుకొన్న బినాబీదారులపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు అప్రమతంగా ఉండి పేదలకు డబుల్ బెడ్రూములు అందజేయాలి.
- ఎ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మహబూబ్‌నగర్