Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీచౌక్ నుంచి రాజీవ్ చౌరస్తా వరకు షట్టర్లు, భవనాల కూల్చివేత పనులు పూర్తి
- దాదాపు డ్రైనేజీలు నిర్మాణం, స్తంభాల తొలగింపు
నవ తెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు విస్త్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. గతంలో ఉన్న రెండు లైన్ల రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ, విద్యుత్, టెలిఫోన్, ఇతర స్తంభాలు విరివిగా ఉండటంతో పనుల్లో కొంత స్తబ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. పనులు ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా కనీసం 40 శాతం పనులు కూడా పూర్తవ్వకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిలిచిన పనులపై ఇటీవల మంత్రి మరోమారు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. కాంట్రాక్టర్లతో పాటు అధికారుల పర్యవేక్షణలో పది రోజుల్లోనే డ్రైనేజీ, స్తంభాల తొలగింపు వంటి పనులు పూర్తి చేశారు. ఇక మిగిలినవి రోడ్డు పనులే గనుక అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.
అక్కడక్కడా పూర్తయిన రోడ్డు పనులు
ఈ యేడాది నాలుగులైన్ల రోడ్ల విస్తరణకు ప్రభుత్వం అనుమతించడంతో ఫిబ్రవరిలో విద్యుత్ కార్యాలయం దగ్గర నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి హరిజనవాడ పెట్రోల్ పంపు వరకు దాదాపు 500 మీటర్ల నాలుగులైన్ల రోడ్డు పనులు పూర్తి చేశారు. మధ్యలో డివైడర్లకు కూడా పెటారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. అలాగే అంబేద్కర్ చౌరస్తా నుంచి రిలయన్స్ స్మార్ట్ షోరూం వరకు బాలుర పాఠశాల, కళాశాల వైపు ఒకవైపు రోడ్డు పనులు పూర్తి చేశారు.
అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణ పనులు
హరిజనవాడ పెట్రోల్ పంపు దగ్గర నుంచి రామాటాకీస్ వరకు అక్కడక్కడ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ పనులు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. జమ్మిచెట్టు దగ్గర చెరువు వైపు డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాలేదు. అలాగే గాంధీచౌక్‌లో పెట్రోల్ పంపు వైపు డ్రైనేజీ నిర్మాణమే చేపట్టలేదు. అలాగే గాంధీచౌక్ బస్టాండ్ నుంచి షాపుల ముందు డ్రైనేజీ నిర్మాణం కోసం చెక్కలు కొట్టి వదిలేశారు. అలాగే చేపల మార్కెట్ నుంచి రామా టాకీస్ వరకు పనులు ప్రారంభమే కాలేదు. రోడ్డుకు ఇరువైపుటా చేపట్టాల్సిన డ్రైనేజీ నిర్మాణాన్ని మధ్యమధ్య వదిలేశారు.
స్తంభాలు తొలగించిన చోట పనుల్లో వేగం
వేంకటేశ్వర టెంపుల్ ముందు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు డ్రైనేజీ నిర్మాణం పూర్తి కావడం, పోల్స్‌ను తొలగించడంతో రోడ్డు నిర్మాణ పనులు వారం రోజులుగా వేగవంతం చేశారు. దాదాపు మూడు నాలుగు ఫీట్ల లోతు వరకు రోడ్డును తవ్వి పనులు చేపడుతున్నారు. మొదటి లేయర్ మట్టి, కంకర పనులు పూర్తవుతున్నాయి. అంబేద్కర్ చౌరస్తా నుంచి రామా టాకీస్ పెట్రోల్ పంపు వరకు రెండు వైపులా మట్టి పనులు పూర్తయ్యాయి. అంబేద్కర్ చౌరస్తాలోనూ కంకరపోసి చదును చేశారు.
ఇతర పనులు పూరై చోట రోడ్డు పనులు పూర్తి చేస్తున్నాం..
పట్టణంలో కొనసాగుతున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా స్తంభాల తొలగింపు, డ్రైనేజీ నిర్మాణం పనులన్నీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ఆ పనులు పూర్తి చేస్తున్నారో అక్కడంతా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తున్నాం. ఇతర పనులన్నీ పూర్తయిన చోట ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాం. ఇటీవల రామా టాకీస్ నుంచి రాజీవ్ చౌరస్తా వరకు డ్రైనేజీ, స్తంభాల పనులన్నీ పూర్తవ్వడంతో రోడ్డును వేస్తున్నాం.
- దానయ్య, డీఈఈ, ఆర్అండ్బీ