Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- వనపర్తి
ప్రపంచ కార్మిక సంఘం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సీఐటీయూ - ఏఐటీయూసీ -ఎఐయూటీసిల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన అధిక ధరలు తగ్గించాలని కోరుతూ సిఐటియు-ఏఐటీయూసీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పాత వనపర్తి వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషలు ప్రసంగించారు. ప్రపంచమంతా కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ధరలు పెంచిందన్నారు. నరేంద్ర మోడీ తాను ప్రధానమంత్రిని అయితే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని, ఇచ్చిన హామీ తుంగలో తొక్కి అన్ని రకాల ధరలు పెంచారని విమర్శించారు. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు లీటర్ పెట్రోల్ రూ.63లు ఉంటే ఇప్పుడు రూ.111లు అయ్యిందన్నారు. లీటర్ డీజిల్ రూ.45ల నుంచి రూ.95లకు పెంచారు. గ్యాస్ సిలిండర్ రూ.450ల నుంచి రూ.1200 లకు పెంచారన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు అన్ని రకాల వస్తువుల పైన జిఎస్టి పేరుతో వస్తు సేవల పన్ను పేరుతో ప్రజలపై అధిక భారాలు వేశారన్నారు. ఈ పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని ధనవంతులకు ఇచ్చే రాయితీలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏం.రాజు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎన్.రాములు, ఏఐటీయూసీ నాయకులు భీమన్న, సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు రాములు, శాంతయ్య, ముంత రాములు, రాములు, వల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.