Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- కర్నెతండాలో మంత్రి పుట్టిన రోజు వేడుకలు
నవ తెలంగాణ- వనపర్తి
మనం చేసిన పని శాశ్వతంగా జీవించడమే అసలైన జీవితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండాలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 4 వేల మందితో భారీ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో పాటు 1500 మంది ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేశారు. 63 కిలోల కేక్‌ను మంత్రి కట్ చేశారు. అనంతరం రూ.3.16 కోట్లతో కర్నెతండాలో నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభించారు. కర్నెతండా ప్రాంతం సముద్ర మట్టానికి 570 మీటర్ల ఎత్తున ఉందన్నారు. ఈ ఎత్తయిన ప్రాంతంలోకి సాగునీరు తెస్తే చుట్టుపక్కల తండాలకు నీరొస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కర్నెతండా ఎత్తిపోతలతో పాటు ఇలాగే ఇబ్బంది ఉన్న బిజినేపల్లి మండలానికి మార్కండేయ లిఫ్టును మంజూరు చేశారన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సాగునీటి సాధన కోసం కృషి చేశామన్నారు. వనపర్తి నియోజక వర్గంలో ఒక్క కాశీంనగర్ మినహా మిగిలిన అన్ని ఆవాసాలకు సాగునీటిని సాధించామన్నారు. మారుమూలన ఉన్న కర్నె తండాకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అవసరమైన పనుల సాధనకు సమిష్టిగా కృషిచేశామన్నారు. ఘణపురంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎస్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలినడకన వెళ్లే మారుమూలన తండాలు నేడు తారు రోడ్లతో దర్శనమిస్తున్నాయన్నారు. విలక్షణంగా హస్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన అరుదైన వ్యక్తి బిత్తిరి సత్తి అని, ప్రజలిచ్చే గుర్తింపే అతి పెద్ద గుర్తింపు అన్నారు. నా జన్మదినం సందర్భంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినందుకు సభ ఏర్పాటు చేసు కోవడం, అదే సందర్భంగా తుల్జాభవాని వార్షికోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉం దన్నారు. తనను అభిమానించి ఆశీర్వదించిన అందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
సాగునీటి సాధనలో నిరంజన్ రెడ్డి పాత్ర మరువలేనిది : ఎమ్మెల్యే
సాగునీటి సాధనలో మంత్రి నిరంజన్ రెడ్డి పాత్ర మరువలేనిదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. పాలమూరు సస్యశ్యామలం చేయడంలో వారిది పెద్దన్న పాత్ర అని గుర్తు చేశారు. వలసల జిల్లాకే నేడు వలస వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోనే ఇది సాధ్యమయిందన్నారు. ఇది ఈ జిల్లా ప్రజాప్రతినిధులకు గర్వకారణం అన్నారు. వనపర్తి నియోజక వర్గంలో లక్షా 30 వేల ఎకరాలకు నీళ్లు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి తదితరులు పాల్గొన్నారు.