Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22, 6వ వార్డుల్లో నీటిగుంటలు
- పాట్లు పడుతున్న ప్రయాణికులు
అరగంట వర్షాలు కురిస్తే చాలు రోడ్లంతా జాలువారుతున్నాయి. గతుకుల రోడ్లపై ప్రయాణమంటేనే వాహనదారులు జంకుతున్నారు. పైగా గతుకుల్లో నీటి మడుగుల్లా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు నీటిలో పడిపోతామోనన్న భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రం ఆరవ వార్డు పరిధిలోని 6వ, 22వ వార్డుల్లో జాలువారిన కాలనీలు, ఫరీద్ రైస్ మిల్లు నుంచి చౌడేశ్వరిదేవి దేవాలయం, తిరుమల కాలనీ, గాయత్రీ నగర్ కాలనీల్లో మొత్తం మట్టి రోడ్లున్నాయి. ఈ రోడ్లన్నీ కొద్దిపాటి వర్షాలు కురిసినా బురదమయంగా మారుతున్నాయి. పైగా వర్షపు నీరు తాళ్లచెరువులోకి వెళ్లే క్రమంలో రోడ్లపై వర్షపు నీరంతా జాలువారుతోంది. నిత్యం నీళ్లు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే మారెమ్మకుంట నుంచి హరిజనవాడ మీదుగా వెళ్లే రహదారి గుంతలు గుంతలుగా తయారై నీటితో నిండి ఉంది. నిత్యం ఈ రోడ్డు మీదుగా గాంధీనగర్, హరిజనవాడ, ఇందిరా కాలనీ, కాశీం నగర్, కాశీం నగర్ తండాలకు ఈ రోడ్డు మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డంతా గుంతలమయం కావడంతో స్థానికులు, ఇతర గ్రామాలనుంచి వచ్చిపోయే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు బాగుకోసం స్థానిక నాయకులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పరిస్థితిలో మార్పు రాలేదు.
రోడ్లపై వ్యాపారులతో ఇబ్బందులు
మారెమ్మకుంట ప్రాంతంలో రోడ్లపైనే చికెన్, మటన్, చేపల వ్యాపారులు తమ జీవనోపాధి కోసం వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారులంతా చాలా రోజులుగా ఇక్కడే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వర్షాల కారణంగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా రోడ్డంతా సగం వరకు వ్యాపారులతో నిండిపోయింది. ఈ పరిస్థితిని మున్సిపల్ అధికారులు సమీక్షించాల్సి ఉంది.
జిల్లా కేంద్రంలో అధ్వానంగా తయారైన రోడ్లు
వనపర్తి టౌన్:వనపర్తి జిల్లా కేంద్రంలోని మారెమ్మ దగ్గర ఉన్న రహదారి గుంతలు గుంతలుగా తయారై నీటితో నిండి ఉంది అని, నిత్యం ఈ రోడ్డు మీదనుంచి గాంధీనగర్, హరిజనవాడ, ఇందిరా కాలనీ, కాసింనగర్ తాండలకు ఈ రోడ్డు మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా తయారు కావడం వలన వాహనదారులు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు అని గమనించిన దళిత అభివృద్ధి సంఘం నాయకులు గురువారం మారెమ్మకుంట దగ్గర రోడ్డును పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు.గత సంవత్సర కాలంగా ఈ రోడ్డు ఇలాగే ఉంది అని ఈ రోడ్డు మీద వెళ్లాలంటేనే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అన్నారు. అనేకసార్లు వార్డు కౌన్సిలర్ కు అధికారులు సంప్రదిస్తే ఎలాంటి మరమ్మతులుగానే చేయడం లేదుఅన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డును బాగు చేసి ఇక్కడ చేపల వ్యాపారం నిర్వహించే వారిని చేపల మార్కెట్లో వ్యాపారం చేసుకునే విధంగా, అదేవిధంగా రోడ్డు మీద చికెన్ మటన్ వ్యాపారం నిర్వహించకుండా చూడాలని కాలనీ ప్రజలు తెలిపారు. దళిత సంఘం నాయకులు స్థానిక కౌన్సిలర్ నీ ఫోన్లో సంప్రదించగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు గంధం పెద్ద బాలయ్య, డి. సాయిలు, డి.కృష్ణయ్య,డి.జయరాములు, డి రామస్వామి,డి.మశన్న, తలారి ఆంజనేయులు, డి చంద్రయ్య, సంఘం అధ్యక్షులు డి రవి ప్రసాద్, ఉపాధ్యక్షులు డి. కేశవులు, కోశాధికారి బి. ఆంజనేయులు, కార్యదర్శి రవికుమార్, పాల్గొన్నారు.