Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్టాప్‌లో నిల్వ చేరుతున్న మురుగునీరు
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
వనపర్తి పట్టణం నడిబొడ్డున ఉన్న రాజీవ్ చౌరస్తా మురుగునీటితో అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య తలెత్తింది.
నవ తెలంగాణ -వనపర్తి
అంబేద్కర్ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆర్చీ వరకు పనులు పూర్తయ్యాయి. డబ్ల్యుసిసిఎం కళాశాల భవనం కూల్చివేత పనులు చేపడుతున్న క్రమంలో పనులు కొంత స్తంభించాయి. అక్కడి నుంచి రాజీవ్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ముందుగా భవనాలు, షాపులు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక మున్సిపల్ అధికారులు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ పనులు పూర్తి కాకపోవడంతో డ్రైనేజీ పనులు చేపట్టలేదు. ఫలితంగా గతంలో ఉన్న డ్రైనేజీల ఆధారంగా కాలనీల నుంచి కిందికి వస్తున్న మురుగునీరు అక్కడికి వచ్చి ఆగుతోంది. అంతే కాకుండా స్మార్ట్ సూపర్ స్టోర్ దగ్గరకు వచ్చే వరకు నీరు ఆగిపోతోంది. అదేవరుసలో హౌటళ్లు, వివిధ కార్యాలయాలు ఉండటంతో మురుగునీరు అధికంగా రావడంతో అది వెళ్లడానికి మరోమార్గం లేకపోవడంతో సరాసరి బస్టాప్ దగ్గరకు చేరుతోంది. ఫలితంగా మురుగునీటి కుంటలా తయారైంది.
ప్రయాణికులకు ఇబ్బందులు..
రాజీవ్ చౌరస్తాలో బస్టాప్ ఉండటంతో దూర ప్రాం తాల నుంచి వచ్చే ప్రయాణికులు అక్కడే బస్సు దిగడం, ఎక్కడం చేస్తుంటారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, హైద రాబాద్, ఘనపురం ప్రాంతాల నుంచి వచ్చిపోయే ప్రజలు వివిధ పనుల నిమిత్తం వనపర్తికి వచ్చిపోతుంటారు. నిత్యం ఈ బస్టాప్‌లో కనీసం వెయ్యి మంది వరకు ప్రయాణికులు వచ్చిపోతుంటారు. అంతేకాకుండా పట్టణ ప్రజలు ద్విచక్రవాహనాలపై వెళ్తున్నప్పుడు ప్రయాణికులపై మురుగునీరు పడుతోంది. బస్సులు ఎక్కి, దిగేటప్పుడు ఈ ఇబ్బంది తప్పడం లేదు. మరోవైపు పాదచారులు ఆ మురుగునీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
త్వరలోనే పరిష్కరిస్తాం..
రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నాం. కాబట్టి వేంకటేశ్వరస్వామి దేవా లయం దగ్గర నుంచి రాజీవ్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తవ్వగానే డ్రైనేజీ పనులు చేపడతాం. ప్రస్తుతం మురుగునీటిని రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకుంటాం.
- విక్రమ్‌సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్, వనపర్తి.