Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ -వనపర్తి
వనపర్తి పట్టణంలో నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ 2008 భూ పోరాటంలో భాగంగా పేదలకు అప్పటి ప్రభుత్వం 685 మందికి అప్పాయిపల్లి శివారు సర్వే నెంబర్ 974, మబ్బుగుట్ట, పీర్లగుట్ట సర్వేనెంబర్ 143, 145 లలో ఇండ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. కానీ పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడంతో పేదలు ఇండ్లు నిర్మించు కోలేదన్నారు. ఇప్పుడు పీర్లగుట్ట, మబ్బుగుట్ట లలో స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, అప్పాయిపల్లి శివారులో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. దీంతో పట్టాలు ఇచ్చిన నిరుపేదలు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలిచ్చిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు చూపి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. పట్టణంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు 10 వేల మందికి పైగా ఉన్నారని, వారికి కూడా ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇండ్లు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఒకరికి రెండు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయ్యాయని తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ పంపిణీలో రాజకీయాల కతీతంగా పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ జరగాలని, నిజమైన పేదలను లబ్ధిదారులుగా గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే తామే ప్రభుత్వ స్థలాలలో ఎర్ర జెండాలు పాతి మరో భూ పోరాటానికి నాంది పలుకుతామని వారు హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మీ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సిఐటియు నాయకులు డి.కురుమయ్య, మదన్, నందిమల్ల రాములు, కెవిపిఎస్ నాయకులు గట్టయ్య, గంధం కురుమయ్య, ఐద్వా నాయకులు సాయి లీల, రేణుక, గాయత్రి, కమల, అర్జున్, గౌతమ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.