Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు ఆదేశం
నవ తెలంగాణ- వనపర్తి
'మన ఊరు - మన బడి' కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేయాలని, పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ వసతుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులు దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి ఆమె 'మన ఊరు - మన బడి' కార్యక్రమం అభివృద్ధి పనులపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్.అండ్.బి, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో మంత్రి సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు- మన బడి' కార్యక్రమం ద్వారా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమానికి నిధుల కొరత లేదని, పాఠశాలలలో నాణ్యమైన పనులు చేపట్టి, అన్ని సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. పాఠశాలల అభివృద్ధిలో భాగంగా గ్రీన్ బోర్డ్, ఫర్నీచర్, వంటి 12 అంశాలలో పనులు పూర్తి చేసి, పాఠశాలల్లోని ఆవరణలను అందంగా రూపొందించాలని, అవసరమైన చోట గ్రామ పంచాయతీల ద్వారా గ్రీన్ బడ్జెట్ వినియోగించుకోవాలని, గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని ఆమె తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి మండలంలో రెండు పాఠశాలలను గుర్తించి డిసెంబర్ చివరిలోగా అందంగా తీర్చిదిద్దాలని, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. వచ్చే మార్చి చివరి నాటికి 'మన ఊరు - మన బడి' కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ జిల్లాలో 'మన ఊరు - మన బడి' కార్యక్రమం ద్వారా 183 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుందని ఆమె తెలిపారు. 30 లక్షల రూపాయల లోపు పనుల కోసం 140 పాఠశాలలను, 30 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యే పనుల కోసం 55 పాఠశాలలను గుర్తించామని కలెక్టర్ వివరించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలకు ఎఫ్టిఓ జనరేట్ చేయాలని ఆమె సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, పంచాయతీ రాజ్ ఈఈ మల్లయ్య, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్షిప్లు వెంటనే పూర్తిగా చెల్లించండి : కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా
వనపర్తి : ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు పెండింగ్ లేకుండా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశించారు. గురువారం ఐడీఓసీి సమావేశ మందిరంలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ నూతన, రెన్యూవల్ ఉపకార వేతనాలపై ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాలు మంజూరు చేయుటకు ఆన్లైన్లో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిశీలించాలన్నారు. జనవరి 31వ తేదీలోపు పూర్తి చేయాలని ఆమె సూచించారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. రెడ్‌క్రాస్‌కు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేసి బంగారు పతకం సాధించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అధికారిణి నుషిత, డిఈఓ రవీందర్, అనిల్, డిఐఈఓ జాకీర్, మైనారిటీ అధికారిణి కాళిక్రాంతి, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, తదితరులు పాల్గొన్నారు.