Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
నవతెలంగాణ - మహబూబ్ నగర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు హెచ్చరించారు.కంటి వెలుగు నిర్వహణపై సోమవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి,డీజీపీ అంజనీ కుమార్‌లు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కంటి వెలుగు ఏర్పాట్ల పై సమీక్షించారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ ఒక్క జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బాధ్యత మాత్రమే కాదని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున ఉత్తర్వులు ఇచ్చిన ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ముఖ్యంగా కంటి వెలుగులో చికిత్స కోసం గుర్తించిన వారిని క్యాంపులకు తీసుకురావడం పట్ల నిర్లక్ష్యం వహించిన,లేదా విధులకు కేటాయించిన వారు ఎక్కడైనా భాగస్వాములు కాకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు.జిల్లాలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో ప్రారంభించనున్నారని ,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 19వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో ప్రారంభించనున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు .కంటి వెలుగు కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేందుకు పంచాయతీరాజ్ ,మున్సిపల్, డిఆర్డిఓ, మెప్మా , జిల్లా సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది వారి వారి సిబ్బందికి సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంపై ఈ నెల 17న డిఆర్డిఓ సిబ్బందికి ,అదేవిధంగా అంగన్వాడి, ఆశ కార్యకర్తలకు సమావేశాలు నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 17న కంటి వెలుగు పై ''మాక్ ట్రయల్'' నిర్వహించాలని అన్నారు. కంటి వెలుగు వైద్య శిబిరాలకు వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు ,సెల్ ఫోన్ నెంబర్‌తో సహా రావాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ డిపిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్ ,నూరూల్ నజీబ్, మహమ్మద్ షేక్ ,డిప్యూటీ డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ డిఆర్డిఓ యాదయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ బాబురావు, తదితరులు హాజరయ్యారు.