Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ చీఫ్ ఖార్గె వ్యాఖ్యలు
- అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు
అంకారా : వచ్చే నెల 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం ఊపందుకుంటోంది. గురువారం కల్బుర్గిలో ఎన్నికల సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గె మాట్లాడుతూ, విషపూరితమైన పాముతో ప్రధాని మోడీని పోల్చారు. ''మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోండి, మోడీ విషపూరితమైన పాము వంటివారు, అది విషమా కాదా అని పరీక్షించాలని చూడకండి, మీరు పరీక్షిస్తే, వెంటనే చావడం ఖాయం. మోడీ వంటి మంచి వ్యక్తి మీకు ఇస్తున్నందున అది విషం కాదని మీరు అనుకోవచ్చు, కానీ మీరు పరీక్షించారో వెంటనే చనిపోవడం ఖాయం.'' అని ఖార్గె వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఖార్గె గడగ్ జిల్లాలోని రాన్లో మరో ఎన్నికల సభలో మాట్లాడుతూ, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు మోడీని ఉద్దేశించినవి కావని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దాంతానివని అన్నారు. ప్రధాని మోడీతో తన పోరాటం వ్యక్తిగత పోరాటం కాదని అన్నారు. ఇది సైద్దాంతిక పోరు అని స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయానల్నది తన అభిమతం కాదని చెప్పారు. తెలుసో, తెలియకో ఎవరి భావాలైనా దెబ్బతింటే అది అస్సలు తన ఉద్దేశ్యమే కాదని ట్వీట్చేశారు. బిజెపి విషపూరితమైన పాము వంటివదన్నది తన ఉద్దేశ్యమని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా తనకు ఎలాంటి ద్వేషభావం లేదని అన్నారు. మోడీని ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు. ''బిజెపి అవినీతిలో కూరుకుపోయింది. ఎవరైనా దాన్ని ప్రశ్నిస్తే, వెంటనే ఐటి. ఇడి దాడులతో బెదిరిస్తారు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని విషపూరితమైన పాముతో పోల్చాను.'' అని ఖార్గె వివరించారు. నారేగల్ ర్యాలీలో కూడా మోడీ ప్రభుత్వంపై ఖార్గె విసుర్లు ఆపలేదు. అవినీతిపై మోడీ వైఖరిని విమర్శిస్తూ, ''నేను తినను, తిననివ్వను అని మోడీ చెబుతుంటారు. కానీ 40శాతం కమిషన్లు తీసుకునే వారిని తన పక్కనే కూర్చోబెట్టుకోవడానికి అనుమతించడం ద్వారా రాజకీయాలు చేస్తుంటారు. తన సిద్ధాంతంలో ఆయన దేశాన్ని నాశనం చేస్తున్నారు.'' అని వ్యాఖ్యానించారు. ''ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శిస్తే, వెంటనే ఆయన తన 56 అంగుళాల ఛాతీ గురించి మాట్లాడతారు. మేమేమీ ఆయన బాహ్య రూపాన్ని పరీక్షించడం లేదు. ఆయన చేసిన పనులను లెక్కవేస్తున్నాం.'' అని అన్నారు. మిత్రుల, ప్రత్యర్ధులైనా వారి రాజకీయ దిద్దుబాటుకు అవసరమైన చర్యలు సూచిస్తూ వుంటాను, వ్యక్తులతో వారి సమస్యలతో ఆడుకోవడం నానైజం కాదు, పేదల,అట్టడుగు వర్గాల బాధలు వారి ఇబ్బందులు తనకు తెలుసునని అన్నారు. ఐదు దశాబ్దాలుగా బిజెపి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పారు. మోడీరాజకీయాలపైనే తన పోరు అని స్పష్టం చేశారు.
అంతకుముందు సిమ్లాలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ మాట్లాడుతూ, మోడీకి దేశ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టారన్న విషయాన్ని రాజకీయ నేతలు గుర్తుంచుకోవాలి. ఇటువంటి ప్రకటనలు చేయడం దేశానికి అవమానమని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్పార్టీ దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. సీనియర్ బిజెపి నేత శోభా కరాండల్జీ మాట్లాడుతూ, సీనియర్ నేతగా ఖార్గె దేశానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రధానికి వ్యతిరేకంగా ఇటువంటి భాష ఉపయోగించడం అవమానకరమని అన్నారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.