Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య సంరక్షణపై తగ్గుతున్న వ్యయం : ఐరాస నివేదిక వెల్లడి
కేప్‌టౌన్ : దేశంలో గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, వారి కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ చిత్రం దీనికి భిన్నంగా ఉంది. ప్రపంచంలో సంభవిస్తున్న గర్భిణులు, గర్భస్థశిశువులు, నవజాత శిశువుల మరణాలలో ఒక్క మన దేశంలోనే 60 శాతం చోటుచేసుకుంటున్నాయి. పైగా ఈ తరహా మరణాలు అధికంగా జరుగుతున్న పది దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్యంపై కేప్‌టౌన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు (ఐఎంఎన్హెచ్సీ)లో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, యూఎన్ఎఫ్పీఏ సంస్థలు మంగళవారం ఈ నివేదికను విడుదల చేశాయి.
2020-21లో ప్రపంచవ్యాప్తంగా 2.9 లక్షల మంది గర్భిణులు, 19 లక్షల మంది గర్భస్థ శిశువులు, 23 లక్షల మంది నవజాత శిశువులు... మొత్తం 45 లక్షల మంది చనిపోయారు. సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ఖండంలోని ప్రాంతాలు, ఆసియా దక్షిణ ప్రాంతంలో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. మాతా శిశు సంరక్షణకు సంబంధించి 2030 లక్ష్యాలను సాధించేందుకు అన్ని దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో నెరవేరడం లేదు. గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం గత ఎనిమిదేండ్లుగా తగ్గుతూ వస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందలేదని, దీనివల్ల మరణాల సంఖ్య బాగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అన్షు బెనర్జీ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య రక్షణ రంగంలో మరిన్ని పెట్టుబడులు అవసరమవుతాయని, తద్వారా గర్భిణులు, శిశువులను కాపాడుకోవచ్చునని చెప్పారు.
2020లో ప్రపంచ దేశాలలో 45 లక్షల మంది గర్భిణులు, గర్భస్థ శిశువులు, నవజాత శిశువులు చనిపోతే ఒక్క మన దేశంలోనే 7.88 లక్షల మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలతో జన్మిస్తున్న శిశువుల సంఖ్యలో భారత్ వాటా 17 శాతం. పెద్ద సంఖ్యలో గర్భిణులు, గర్భస్థ శిశువులు, నవజాత శిశువులు చనిపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. మన దేశంతో పాటు నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా, బంగ్లాదేశ్ వంటి దేశాలలో ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయి.