Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెల్ అవీవ్: ఇజ్రాయిలీలపై జరిగిన దారుణమైన దాడితో సంబంధ మున్న ముగ్గురు పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ బలగాలు హతమార్చినట్లు ఆ దేశ మిలటరీ గురువారం తెలిపింది. గత నెల్లో వెస్ట్ బ్యాంక్ సెటిల్మెంట్కు సమీపంలో కారుపై జరిగిన దాడి వెనుక ఈ వ్యక్తులు వున్నారని మిలటరీ తెలిపింది. ఆనాటి దాడిలో తల్లి, ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో నబ్లస్ నగరం నడిబొడ్డులోకి మిలటరీ గురువారం తెల్లవారు జామున ప్రవేశించిందని, భీకరంగా సాగిన పోరాటంలో ముగ్గురు అనుమానితులను హతమార్చిందని సైన్యం తెలిపింది. వీరిలో ఇద్దరు హమస్కి చెందినవారుగా భావిస్తున్నారు. ఆ ముగ్గురిని కూడా గుర్తించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ముగ్గురు చనిపోయినట్లు వెల్లడించింది కానీ వారిని వెంటనే గుర్తించలేదు. పాలస్తీనా ఖైదీ నిరాహార దీక్ష చేస్తూ మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో నబ్లస్లో హింస చెలరేగింది. గత ఏడాది కాలంగా వెస్ట్ బ్యాంక్ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దాదాపు రాత్రిపూట ఇజ్రాయిల్ అరెస్టులకు, దాడులకు పాల్పడుతోంది. తీవ్రవాద నెట్వర్క్లను ధ్వంసం చేయడానికి, భవిష్యత్తు దాడులను నివారించడానికే ఈ దాడులను ఇజ్రాయిల్ చెప్పుకుంటోంది. అయితే ఈ దాడులతో మరింత భూమిని ఆక్రమించడం వారి లక్ష్యంగా వుందని పాలస్తీనా విమర్శిస్తోంది.