Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌కు తెలియచేసిన ఆర్థిక మంత్రి యెలెన్
వాషింగ్టన్ : దేశం రుణాలు తీసుకునే అధికారాన్ని చట్టసభ సభ్యులు పెంచకపోయినా లేదా సస్పెండ్ చేయకపోయినా, తద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదాన్ని నివారించకపోయినా జూన్ 1వ తేది నాటికి అమెరికా తన రుణాలను చెల్లించడంలో విఫలం కావచ్చని ఆర్ధిక శాఖ మంత్రి జానెట్ యెలెన్ సోమవారం కాంగ్రెస్‌కు తెలియచేశారు. ఈ మేరకు ప్రతినిధుల సభ, సెనెట్ నేతలకు లేఖ రాశారు. అమెరికా చట్టబద్ధంగా రుణాలు తీసుకునే అధికారంపై గల 31.4 ట్రిలియన్ల డాలర్ల పరిమితిని పరిష్కరించే దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుని అమెరికా రుణాల పట్ల గల పూర్తి విశ్వాసాన్ని పరిరక్షించాల్సిందిగా యెలెన్ కాంగ్రెస్ నేతలను కోరారు. అయితే అమెరికా వద్ద కచ్చితంగా నగదు ఎప్పుడైపోతుందనే తేది ఊహించడం సాధ్యం కాదని అన్నారు. ''రుణ పరిమితి సంక్షోభంపై గతంలోనూ మనం పాఠాలు నేర్చుకున్నాం. రుణ పరిమితిని పెంచడానికి లేదా సస్పెండ్ చేయడానికి చివరి నిముషం వరకు వేచి వుండడం వల్ల వ్యాపార, వినియోగదారుల విశ్వాసానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని మనం తెలుసుకున్నాం'' అని అన్నారు. దీనివల్ల అమెరికా క్రెడిట్ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. జూన్ మొదటికల్లా అమెరికా వద్ద నగదు నిల్వలు తరిగిపోయే ప్రమాదముందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (సిబిఓ) కూడా సోమవారం హెచ్చరించింది. ఆర్థిక శాఖ తీసుకున్న అసాధారణ చర్యల ఫలితం కూడా మనం ముందు అంచనా వేసిన దానికన్నా చాలా త్వరగానే ముగుస్తోందని అన్నారు. ఫెడరల్ ప్రభుత్వ డిఫాల్ట్‌ను నివారించేందుకు అసాధారణ చర్యలు తీసుకోవడం ఆరంభించామంటూ జనవరిలో యెలెన్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు.