Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్ స్క్వేర్‌లో విక్టరీ డే పరేడ్‌లో పుతిన్
మాస్కో : నాజీల ''పిచ్చి ఆశయాల'' తాలుకూ పర్యవసానాలను పశ్చిమ దేశాలు మర్చిపోయాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. మాస్కోలో రెడ్ స్క్వేర్‌లో విక్టరీ డే పరేడ్ సందర్భంగా పుతిన్ ప్రసంగించారు. ''ఆధిపత్యానికి సంబంధించిన ఏ సిద్ధాంతమైనా దాని స్వభావరీత్యా హేయమైనది, నేరపూరితమైనది, దారుణమైనది'' అని రష్యన్లు విశ్వసిస్తారని పుతిన్ వ్యాఖ్యానించారు. ''ప్రపంచంలోని ఆధిపత్య వర్గాలు తమ అసాధారణవాదాన్ని నొక్కి చెబుతూనే వున్నాయి. ప్రజలను ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా చేస్తారు. సమాజాలను చీలుస్తారు, రక్తపాతంతో కూడిన ఘర్షణలను రెచ్చగొడతారు, కుట్రలకు పాల్పడుతారు, విద్వేష బీజాలు నాటుతారు. రష్యా అంటే విద్వేషం, దూకుడుతో కూడిన జాతీయవాదం, సాంప్రదాయ కుటుంబ విలువలను నాశనం చేయడం వంటివి పురిగొల్పుతారు.''అని పుతిన్ పేర్కొన్నారు. ప్రజల అభీష్టాలను, వారి హక్కులను, ఆదేశాలను మరింతగా నిర్దేశించడానికి అమెరికా, దాని మిత్రపక్షాలు ఇదంతా చేస్తున్నాయని పుతిన్ విమర్శించారు. అంతర్జాతీయ వేదికపై దోపిడీ, హింస, అణచివేతలతో కూడిన వ్యవస్థను అమలు చేయడానికే ఇదంతా అని విమర్శించారు. నాజీల పిచ్చి, అపవిత్రమైన ఆశయాలు చివరకు ఎలాంటి పర్యవసానాలకు, పరిస్థితులకు దారి తీసాయో వారు మరిచినట్లు కనిపిస్తోందని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ దుష్ట శక్తిని ఓడించిన వారి గురించి వారు విస్మరించారని అన్నారు. ఉక్రెయిన్‌లో ఘర్షణలను ప్రస్తావిస్తూ పుతిన్ రష్యాపై అసలైన యుద్ధం ఆరంభమైందని అన్నారు. కానీ అంతర్జాతీయ తీవ్రవాదాన్ని మనం ప్రతిఘటిస్తున్నామన్నారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేసి, విధ్వంసం చేయడం, రెండో ప్రపంచ యుద్ధ ఫలితాలను రద్దు చేయడం, అంతర్జాతీయ భద్రతా వ్యవస్థను, అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా కుప్పకూల్చడం, అభివృద్ధి సార్వభౌమ కేంద్రాల గొంతు నులమడమన్నది పశ్చిమ దేశాల లక్ష్యంగా వుందన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు పెచ్చరిల్లడానికి అమెరికా దాని మిత్రపక్షాలే కారణమని పుతిన్ స్పష్టంచేశారు. మితిమీరిన ఆశయాలు, అహంకారం, స్వేచ్ఛ ఇవన్నీ ఇటువంటి విషాదాలకే దారి తీస్తాయన్నారు. ఉక్రెయిన్ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున విపత్తు, వినాశనానికి ఇదే అసలైన కారణమని స్ఫష్టం చేశారు. 2014లో దేశంలో జరిగిన కుట్రలో ఉక్రెయినిన్లు బందీలుగా మారారని,తమ దారుణమైన స్వార్ధపు ఆలోచనలను అమలు చేసుకునేందుకు పశ్చిమ దేశాల చేతుల్లో చిప్‌గా మారారని పుతిన్ విమర్శించారు.