Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలలో పేద మరియు అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోన్న ఎన్జీవో అసిస్ట్, స్కూల్ హాజరు పరంగా గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు నివేదించింది. పొగాకు సాగుదారులు బాల కార్మికులను వినియోగించడాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము ఆరంభించిన కార్యక్రమాల ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపింది.
ఈ ప్రాజెక్ట్‌ను ఫిలిప్ మోరీస్ ఇంటర్నేషనల్ (పీఎంఐ) భాగస్వామ్యంతో అసిస్ట్ చేపట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాలలో పొగాకు సాగు చేస్తోన్న ప్రాంతాలలో బాల కార్మిక వ్యవస్థను నిరోధించడం మరియు గ్రామీణాభివృద్ధిని సాధించడం లక్ష్యంగా చేసుకుని పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టిసారించడంతో పాటుగా స్కూల్ హాజరు శాతం పెంపొందించడం, ఆదాయ కల్పన కార్యక్రమాలు చేయడం, అవగాహన మెరుగుపరచడం చేసింది. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం ద్వారా 57 గ్రామాలలోని 62 కమ్యూనిటీలకు చెందిన చిన్నారులు రెగ్యులర్‌గా పాఠశాలకు హాజరవుతున్నారు. దాదాపు 13,400 మంది ప్రతి రోజూ పాఠశాలకు వెళ్తున్నారు. తద్వారా వ్యవసాయ కార్మికులుగా వారు పరిగణించబడటం లేదు. చైల్డ్ టు చైల్డ్ వర్క్‌షాప్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలు 4530 మంది చిన్నారులకు చేరువయ్యాయి. అవగాహన ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో సైతం 12650 మంది చిన్నారులు భాగం కావడంతో పాటుగా దాదాపు 78వేల మంది గ్రామస్తులకు బాల కార్మిక వ్యవస్థ పట్ల అవగాహన కల్పించారు. దాదాపు 45కు పైగా పాఠశాలలో కీలకమైన సాగు సీజన్ వేళ ఆఫ్టర్ స్కూల్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో చిన్నారులను పనికి పెట్టుకోవడాన్ని నిరుత్సాహ పరిచారు.
శ్రీ కె ఎస్ ఆర్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసిస్ట్ ఇండియా మాట్లాడుతూ‘‘ బాల కార్మిక వ్యవస్థ అనేది ఓ సామాజిక రుగ్మత. ఇది చిన్నారుల బాల్య దశలోని అమాయకత్వాన్ని పూర్తిగా దొంగిలించడం మాత్రమే కాదు, విద్యావంతులైన యువతగా వారు ఎదిగేందుకు ఉన్న అవకాశాలను సైతం తీసుకుపోతుంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లోని పేద వర్గాలలో ఎంతోమంది చిన్నారులు విద్యను పొందే అవకాశాన్ని మరియు అత్యుత్తమ భవిష్యత్‌ను పొందే అవకాశాన్నీ కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమంది చిన్నారులు తమ విద్య, సంరక్షణ హక్కుల పరంగా రాజీపడుతున్నారు. దీనికి పేదరికం, నిరక్ష్యరాస్యత, తగిన మౌలిక వసతులు లేకపోవడమూ కారణమే. అసిస్ట్ ఇండియా ఇప్పుడు పీఎంఐతో భాగస్వామ్యం చేసుకుని ఈ నిరుపేద చిన్నారులకు తగిన రీతిలో పాఠశాల మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటుగా మెరుగైన విద్యను పొందేందుకు తోడ్పడుతుంది. తద్వారా వారు అత్యుత్తమ జీవితం పొందేందుకు తగిన నైపుణ్యాలనూ అందిస్తుంది.అదే సమయంలో వారు పనిచేస్తోన్న వాతావరణానికి బహిర్గతం కాకుండానూ కాపాడుతుంది. మా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, కర్నాటక లోని పాఠశాలల్లో అమలు చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పాఠశాలలకు వెళ్తోన్న చిన్నారుల నడవడికలో గణనీయమైన మార్పులను చూశాము. విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మద్దతునందిస్తున్నారు. చక్కటి సదుపాయాలు, మౌలిక వసతులు కలిగిన పాఠశాలలకు వెళ్లేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. బాల కార్మికులు పట్ల అవగాహన మెరుగుపరచడంలో స్థానిక సమాజాలు మాతో చేతులు కలపడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వారు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు’’అని అన్నారు. భారతదేశంలో భారీ సంఖ్యలో ఆర్ధికంగా చురుకైన చిన్నారులు ఉన్నారు. వీరి సంఖ్య 4.35 మిలియన్లు (5–14 సంవత్సరాలు) గా ఉంటుందని 2011 జన గణన తెలుపుతుంది. అంతర్జాతీయంగా 60%కు బాల కార్మికులు 5–17 సంవత్సరాల వయసులో ఉండటంతో పాటుగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉన్నారు. దీనిలో వ్యవసాయం, చేపలు పట్టడం, ఆక్వా కల్చర్, పశు పోషణ ఉన్నాయి. ఈ బాల కార్మికులలో అధికశాతం చెల్లింపులు జరపని కుటుంబసభ్యులు.