Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మాసాల కనిష్టానికి పతనం
- అసియాలోనే అత్యంత పేలవ కరెన్సీ
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ వెలవెల పోతోంది. గత కొన్ని రోజులుగా వరుసగా పడిపోతూ గడిచిన తొమ్మిది మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 75కు పడిపోయింది. గడిచిన మూడు వారాల్లో దాదాపుగా 4 శాతం మేర క్షీణించింది. శుక్రవారం సెషన్ డాలర్‌తో రూపాయి విలువ 74.92 వద్ద ముగిసింది. ఈ ఏడాది ముగింపు నాటికి 76కు దిగజారొచ్చని ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కోవడంతో విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, ఎగిసిపడుతోన్న ద్రవ్యోల్బణం, విత్త లోటు, దిగుమతులు పెరగడం తదితర పరిణామాలు రూపాయిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
మరింత పడిపోవచ్చు..
దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం ప్రారంభం కావడంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు తాజాగా అమలు చేస్తోన్న లాక్డౌన్ నిబంధనలు ఆర్థికవ్యవస్థను మరింత దుర్బర పరిస్థితుల్లోకి నెట్టే అవకాశం ఉందని.. వృద్థి ఏడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. తాము తొలుత అంచనా వేసిన దాని కంటే ఆర్థిక వృద్థి తీవ్రంగా ప్రభావితం అవుతుందని ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, ముంబయి ట్రెజరీ ఆఫ్ హెడ్ వి లక్ష్మణన్ పేర్కొన్నారు. కరోనా ప్రభావంలో ఉన్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరగడంతో వాణిజ్యవేత్తలు డాలర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కరెంట్ అకౌంట్ లోటు పెరగొచ్చన్న భయాలు రూపాయి విలువను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. లాక్డౌన్ నిబంధనలతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి ప్రతికూల వృద్థితో రికార్ట్ కనిష్టాన్ని చవి చూసింది. కాగా 2021-22లో తిరిగి 10.5 శాతం వృద్థిని సాధించొచ్చని ఆర్బిఐ ఇటీవల అంచనా వేసింది. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై మళ్లీ నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతులు భారం కానున్నాయి. ఆ ప్రభావం వస్తు ఉత్పత్తులపై పడుతుంది. కొనుగోళ్లకు అదనంగా కేటాయించడం ద్వారా ప్రజలపై మరింత భారం పడొచ్చు. ముఖ్యంగా పెట్రో, డీజిల్ ధరలు మరింత పెరుగొచ్చు. బంగారం మరింత ప్రియం కావొచ్చు. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, దిగుమతులను తగ్గించుకోవడం, ఎగుమతులను పెంచుకోవడం, ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ధరలను కట్టడి చేయడం, ద్రవ్య పరపతిపై ఆర్బిఐ కఠిన నిర్ణయాలు తదితర చర్యల వల్ల రూపాయి విలువ పెంచుకోవడానికి వీలుందని నిపుణులు సూచిస్తున్నారు.