Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ అతి తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ప్రభావితమైన రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ఒకటి. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ ఇప్పుడు దాదాపుగా రోజుకు 200కు పైగా కోవిడ్ పాజిటివ్ రోగులను ఫీవర్ క్లీనిక్‌లో పరీక్షిస్తుంది. రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైన తరువాత మొత్తంమ్మీద 150కు పైగా నూతన కేసులకు ఈ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రతి రోజూ 600కు పైగా కోవిడ్ పరీక్షలను ఈ ఆస్పత్రిలో చేస్తున్నారు.
సెకండ్ వేవ్ గురించి మణిపాల్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ క్లీనికల్ సర్వీసెస్ డాక్టర్ సీహెచ్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత వేవ్‌తో ప్రతి వయసు వారూ ప్రభావితమవుతున్నారు. మరీ ముఖ్యంగా 15–30 సంవత్సరాల వయసు గ్రూప్ వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. 2020లో వచ్చిన మొదటి వేవ్‌తో పోలిస్తే కోవిడ్–19 సెకండ్ వేవ్‌లో చిన్నారులు మరియు పెద్ద వయసు వారిపై ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుత వేవ్‌లో ఇన్ఫెక్టివిటీ రేట్ నాలుగు రెట్లు అధికంగా ఉంది. ఊపిరితిత్తులపై ప్రభావం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కారణం చేతనే అధికశాతం మంది రోగులకు ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. సెకండ్ వేవ్‌లో కనిపిస్తున్న అతి సహజ లక్షణాలలో డయేరియా ఒకటి. కోవిడ్–19 పరీక్షల కోసం ఆర్టీ –పీసీఆర్ పరీక్షలను చేయించుకోవడానికి ప్రజలు ప్రాధాన్యతనివ్వాలి. హోమ్ టెస్టింగ్ కిట్లు లేదంటే యాంటీజెన్ టెస్ట్‌లపై ఆధారపడకూడదు. ఎందుకంటే, ఆర్టీ–పీసీఆర్ పరీక్షలతో పోలిస్తే ఈ పరీక్షలలో ఫలితాలు అంత ఖచ్చితంగా ఉండవు. డయాలసిస్ లేదా కీమోథెరఫీ చేయించుకోవాల్సిన రోగులు తమ చికిత్స షెడ్యూల్స్‌ను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం కాదు. అలా చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉండే అవకాశాలూ ఉంటాయి’’ అని అన్నారు.
మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ ‘‘గత కొద్ది వారాలుగా రాష్ట్రంలో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. ఈ పరిస్థితి చాలా విచారకరం. భద్రతా మార్గదర్శకాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండటంతో పాటుగా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ వంతు బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నామనే భరోసాతో ఉండాలి. తరచుగా తలనొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులు, కళ్ల కలక, డయేరియా, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో కష్టం మొదలైన లక్షణాలు ఉన్నాయేమో గమనించండి. ప్రస్తుత వేవ్‌లో అధికంగా కనిపిస్తున్న లక్షణాలు ఇవి. అత్యవసరం లేదంటే తప్పదు అనుకుంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దు. అలా బయటకు వెళ్లాల్సిన సమయంలో మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం మాత్రం ఆచరించాలి. మీకు ఏవైనా లక్షణాలు కనబడితే మీరు హాస్పిటల్ని సందర్శించే ముందుగానే డాక్టర్‌ను ఆన్లైన్లో (వీడియో కాన్సల్టేషన్) సంప్రదించాలి ’’ అని అన్నారు.