Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరోనా ఉదృతి తగ్గినా కూడా చాలా చోట్ల ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీంతో… ఆక్సిజన్ డిమాండ్ కొరత తీర్చేందుకు రంగంలోకి దిగిన ఉబర్ ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్‌తో (AMTZ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉబర్.. దేశంలోని 12 నగరాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ఆన్-డిమాండ్ రెంటల్ డెలివరీ సర్వీసుని మొదలుపెడుతోంది.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కోసం కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు చేయాల్సింది ఏంటంటే… మొదటగా O2Home యాప్ డౌన్‌లోన్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాల్సిన వారు అద్దెకు తెప్పించుకుని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం రోజుకి రూ. 300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. అయితే… ఇందుకు అయ్యే రవాణా ఖర్చుని భరించి ఉచితంగానే అందించేందుకు ముందుకువచ్చింది ఉబర్. దీనిద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావాల్సిన పేషంట్లకు రవాణా ఖర్చు మిగిలి ఎంతో ఉపశమనం కలగనుంది. ఆ తర్వాత వారు కేవలం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రోజువారి అద్దె మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం ఈ సర్వీస్ దేశవ్యాప్తంగా 12 నగరాల్లో అంటే… విశాఖపట్నం, లక్నో, హైదరాబాద్, ఇండోర్, కోయంబత్తూర్, గౌహతి, నాగ్‌పూర్, భువనేశ్వర్, బెంగళూరు, పుణె, జైపూర్ మరియు రాయ్పూర్నగరాల్లో అందుబాటులో ఉంది. 90కి పైగా నగరాల్లో విస్తరించి ఉన్న ఉబర్ నెట్వర్క్ ద్వారా రాబోయే రోజుల్లో డజన్ల కొద్దీ నగరాలకు ఈ సేవను అందించేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
AMTZకు ఉపయోగించే వాహనాల ద్వారా ఉబర్ ప్లాట్‌ఫామ్‌లోని డ్రైవర్లకు ఈ సమయంలో అదనపు రైడ్లు వచ్చేందుకు కూడా ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది. ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 'COVID-19 మహమ్మారిని అందరం కలిసి ఎదుర్కొనడం మా లక్ష్యం. మనకు ఎంత సాధ్యమైతే అంతమంది ప్రాణాలను కాపాడడమే ముఖ్యం. అందుకోసం ఉపయోగపడే ఎక్విప్మెంట్ను పెంపొందించుకోవడం చాలా అవసరం. అన్నింటికి మించి ఆరోగ్య రంగంలో, పేదవారికి సేవ చేయడం దేవుడి సేవతో సమానం. ఇప్పుడు ఉబర్ తన విస్తృతమైన మొబిలిటీ నెట్‌వర్క్‌తో అందరికి అందుబాటు ధరలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించడానికి AMTZతో ఒప్పందం కుదుర్చుకోవడం నిజంగా ప్రశంసనీయం. దీనిద్వారా ప్రతి ఇంటికి ఆక్సిజన్ వేగంగా మరియు సమర్ధవంతంగా అందించబడుతుంది. దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ భాగస్వామ్యంలో పాల్గొన్న ఉబర్, AMTZ సంస్థలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా అవసరమైన సమయంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు ప్రజల కోసం ఎలా కలిసి పనిచేస్తారో ఈ ఒప్పందం చాటి చెప్తోంది' అని అన్నారు.