Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ విధానాలకు తోడు కరోనా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించడంతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పడిపోనుందని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఏడాది 2021లో దేశ జీడీపీ 9.6 శాతానికి పరిమితం కానుందని మూడీస్ బుధవారం ఓ రిపోర్ట్‌లో విశ్లేషించింది. ఇంతక్రితం 13.9 శాతం వృద్థి అంచనా వేసింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా చోటు చేసుకోవడం, వైరస్ విజృంభించడం ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురి చేస్తుందని పేర్కొంది. 2022లో 7 శాతం పెరుగొచ్చని తెలిపింది. కాగా 2020 మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో వృద్థి 9.3 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ మైనస్ 7.3 శాతం క్షీణించిన విషయాన్ని గుర్తు చేసింది. కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు నియంత్రణలను సడలిస్తుండటంతో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకుంటాయని పేర్కొంది. ఇప్పటికీ వరకు దేశంలో 3 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వ్యాక్సినేషన్ వేగవంతంపై ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆధారపడి ఉందని మూడీస్ తెలిపింది.