Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.3 లక్షల కోట్ల విలువ ఫట్..!
- మదుపర్లను మురిపించని కంపెనీ ఏజీఎం
ముంబయి : రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆ కంపెనీ 44వ వార్షిక సాధారణ సరసభ్య సమావేశం (ఏజీఎం) తీసుకున్న నిర్ణయాలు మదుపర్లను మురిపించలేకపోయాయి. వార్షిక సమావేశం ముగిసిన తర్వాత కంపెనీ షేర్లు రెండు సెషన్లలో మూడు శాతం మేర నష్టపోయాయి. శుక్రవారం అమ్మకాల ఒత్తిడితో 2.23 శాతం కోల్పోయి 2,105.40కు పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,34,706.35 కోట్లకు దిగజారింది. కాగా.. రెండు సెషన్లలో దాదాపుగా రూ.1.3 లక్షల కోట్ల మార్కెట్ విలువ కరిగి పోయింది. రాబోయే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ రిలయన్స్ చైర్మెన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియో తరహాలోనే గ్రీన్ ఎనర్జీ మార్కెట్ రూపు రేఖలు మారుస్తామంటూ చెప్పారు. అయితే ఆ మాటలు మదుపర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో రిలయన్స్ షేర్ల ధరలకు మద్దతు లభించలేదు. సమావేశం జరిగిన గురువారం సెషన్లో కూడా రిలయన్స్ షేర్లు విలువను కోల్పోయాయి.
సెన్సెక్స్ 226 పాయింట్ల ర్యాలీ
జులై ఫ్యూచర్ అండ్ అప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సీరిస్ ప్రారంభ కావడంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా లోహ, విత్త, ఫార్మా సూచీల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ 226 పాయింట్లు లేదా 0.43 శాతం పెరిగి 52,925కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 73 పాయింట్లు రాణించి 15,863 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1 శాతం, 0.4 శాతం చొప్పున రాణించాయి.