Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాదారుల డిపాజిట్లకు రూ.5 లక్షల బీమా
- డీఐసీజీసీ చట్ట సవరణ
న్యూఢిల్లీ : బ్యాంక్ దివాలా తీస్తే డిపాజిట్‌దారులకు చెల్లించే బీమా మొత్తాన్ని వేగంగా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యాంకులు బోర్డు తిప్పేసినప్పుడూ లేదా ఆర్బీఐ మారటోరియం విధించిన సమయంలో డిపాజిట్‌దారులకు 90 రోజుల్లోగా రూ.5 లక్షల వరకు బీమాను అందించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సవరణ చేసిన డీఐసీజీసీ బిల్లు 2021తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మారటోరియం విధించిన కూడా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్ బీమా వర్తిస్తుందన్నారు. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ. 5లక్షలకు పెంచారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలు ఉండేది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నగదును వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మూడు మాసాల్లోనే పొందడానికి వీలు కల్పించినట్లయ్యింది. భారత్‌లోని అన్ని కేటగిరీల బ్యాంక్‌లతో సహా విదేశీ బ్యాంకు శాఖలు కూడా దీని పరిధిలోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. తాజా చట్టం వల్ల 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులు ఊరట కలుగుతుందన్నారు. సాధారణంగా, బీమా కింద డబ్బు పొందడానికి పూర్తి లిక్విడేషన్ తర్వాత ఎనిమిది నుంచి 10 సంవత్సరాలు పడుతుందని.. కానీ.. కొత్త చట్టం వల్ల ఇప్పుడు మారటోరియం విధించినప్పటికి 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుందని డిపాజిటర్లకు ఈ చట్టం ఉపశమనం ఇస్తుందని మంత్రి తెలిపారు. బ్యాంక్ నష్టాల పాలైనప్పడు ఆర్బిఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు, ఖాతాలు స్తంబింపజేసినప్పడు ఈ బీమా పొందడానికి వీలుందన్నారు. బ్యాంక్‌లు ఆర్థికంగా విఫలమై డిపాజిట్‌దారులకు నగదు చెల్లించలేనప్పుడు బీమా వర్తిస్తుందన్నారు.