Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు రంగంలో విస్తృతావకాశాలు: పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్‌పురి
న్యూఢిల్లీ : భారత చమురు, సహజ వాయువు రంగాలను ప్రయివేటుపరం చేయడానికి మోడీ సర్కార్ ఉవ్విల్లూరుతోంది. ఇందుకోసం ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించింది. ఈ రంగంలో ప్రయివేటు పెట్టుబడులకు వీలుగా విదేశీ కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరుస్తున్నట్లు తాజాగా పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి తెలిపారు. భారత చమురు, సహజ వాయువు రంగాల్లో విస్తృతావకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ రంగాల్లో ఉత్పత్తి పెంపునపై పెట్టుబడులు పెట్టాలంటూ దేశీయ, విదేశీ కార్పొరేట్లను అహ్వానించారు. శుక్రవారం ఇన్వెస్టర్లతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. స్వేచ్ఛాయుత విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నారు. చమురు రంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు దిద్దుబాటు చర్యలు చేపడుతామన్నారు. సవాళ్లను అధిగమించే విషయంలో పెట్టుబడిదారులతో కలసి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
భారత్ వేగంగా పెరుగుతోందని.. దీంతో ఇంధన్న డిమాండ్ కూడా పుంజుకుంటుందన్నారు. దీన్ని చేరుకునేందుకు దేశీయంగా అన్వేషణ, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉత్పత్తి, పరిశోధనల్లో దేశ, విదేశీ కంపెనీలు భాగస్వాములు కావాలని పూరి పేర్కొన్నారు. మూడో దశలో భాగంగా 32 చమురు, గ్యాస్ బ్లాక్‌లను వేలం వేసినట్టు పేర్కొన్నారు. ఇంతక్రితం 2018, 2016లో రెండు రౌండ్లలో 54 బ్లాక్‌లను వేలం వేసినట్లు గుర్తు చేశారు. చమురు, గ్యాస్ రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)కు అనుమతిస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ చమురు, గ్యాస్ రంగం కంపెనీల్లో 49 శాతం ఎఫ్‌డిఐలకు అనుమతి ఉంది. కాగా.. దేశంలోనే రెండో అతిపెద్ద చమురు కంపెనీగా ఉన్న బీపీసీఎల్‌ను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడడానికే ఎఫ్‌డీఐ నిబంధనలు సడలించినట్టు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.