Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడోసారి వడ్డీ రేట్లు యథాతథం
- ద్రవ్యోల్బణం పెరగొచ్చు
- ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష వెల్లడి
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షలో వరుసగా ఏడోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (భేటీ) శుక్రవారం ముగిసింది. ఇందులోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులు వడ్డీ రేట్లను ఎప్పటిలాగే కొనసాగించాలని సూచించారు. దీంతో రెపోరేటు 4శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత జీడీపీ 9.5శాతం పెరగొచ్చని ఎంపీసీ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా రికవరీకి ఊతమివ్వడంతో పాటు ఆర్ధిక వ్యవస్ధలో స్ధిరత్వం కోసం వడ్డీరేట్లలో మార్పులను చేయలేదన్నారు.
అతి త్వరలోనే డిజిటల్ కరెన్సీ మోడల్‌ను తీసుకురానున్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రబి శంకర్ తెలిపారు. ఈ ఏడాది ముగింపు నాటికే ఈ కరెన్సీని తీసుకురావడానికి ఆర్బీఐ కసరత్తు చేస్తుందన్నారు. 2021-22లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 5.7 శాతానికి పెరగొచ్చని శక్తికాంత దాస్ అంచనా వేశారు. గడిచిన మేలో 6.3 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్బీఐ నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉండొచ్చన్నారు. వెనకటి తేదీ నుంచి విధించే పన్ను (రెట్రో ట్యాక్స్) నోటీసులను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శక్తికాంత్ దాస్ స్వాగతించారు. ఇది సకాలంలో తీసుకున్న నిర్ణయమని ప్రశంసించారు. రెట్రో ట్యాక్స్‌ను తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు.