Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్, ఫ్లిప్ కార్ట్లపై సీసీఐ విచారణ చేయొచ్చు
న్యూఢిల్లీ : కొన్ని అసంబద్ద విధానాలకు పాల్పడుతున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలపై వచ్చిన ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలు పలు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నాయంటూ సీసీఐకి ఢిల్లీ వ్యాపార మహాసంఘం ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీలు కావాలనే కొందరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నాయని ప్రధాన ఆరోపణ. కాగా.. ఆ సంస్థలపై సీసీఐ జరుపుతున్న విచారణను నిలిపేందుకు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, న్యాయమూర్తులు వినీత్ శరణ్, సూర్యకాంత్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీల మీద ప్రాధమిక విచారణ జరపాలంటూ గతంలో కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయలేమని తెలిపింది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దిగ్గజ సంస్థలు తమతంట తామే విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని ఎన్వి రమణ అన్నారు. అందుకు ఆ రెండు కంపెనీలకు నాలుగు వారాల గడువు ఇచ్చారు. అవకతవకలకు పాల్పడ్డాయంటూ ఈ-కామర్స్ సంస్థలపై వచ్చిన ఆరోపణల మీద సీసీఐ విచారణ జరపాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ-కామర్స్ వేదికలు కొందరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నాయని ప్రధాన ఆరోపణ.