Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గడిచిన కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో SIPవిధానంతో పెట్టుబడులు పెట్టే ధోరణి రిటైల్ ఇన్వెస్టర్లలో క్రమంగా పెరుగుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడుల పరిమాణం రూ. 43,921 కోట్లుగా ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ. 96,080 కోట్లకు చేరింది. అయితే మదుపుదారుల్లో, ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లలో ప్రోడక్ట్‌పై అవగాహన లోపించడం వల్ల పెట్టుబడుల విషయంలో పూర్తి స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో SIP విధానంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చేయదగిన, చేయదగని అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే:
ఫండ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు వివిధ ఫండ్ల పెట్టుబడుల వ్యూహాలు, లక్ష్యాలను పోల్చి చూసుకోవడం
మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లన్నీ కూడా తమ పెట్టుబడుల లక్ష్యాలు, వ్యూహాలు, ఫండ్ నిర్వహణ తీరుతెన్నులు, నిధుల కేటాయింపుల వ్యూహం గురించిన వివరాలను వెల్లడిస్తాయి. SIPమార్గంలో పెట్టుబడులు పెట్టే ముందు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం వల్ల ఆయా ఫండ్స్ మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల కాలపరిమితి, రిస్కు సామర్థ్యాలకు అనువైనవా కావా అన్నది బేరీజు వేసుకునేందుకు వీలవుతుంది. ఫండ్స్ పెట్టుబడి లక్ష్యాలు, వ్యూహాలు వంటి వివరాలన్నీ కూడా వాటి ప్రోడక్ట్ లిటరేచర్, కరపత్రాలు, స్కీమ్ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (SID),కీలక పెట్టుబడుల మెమొరాండం (KIM)లో లభిస్తాయి.
డివిడెండ్ ప్లాన్ కాకుండా గ్రోత్ ప్లాన్‌ను ఎంచుకోవడం
చాలా మంది ఇన్వెస్టర్లు SIPమార్గంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ ప్రకటించే డివిడెండ్స్ అదనపు ఆదాయ మార్గం కాగలవని భావించడమే ఇందుకు కారణం. అయితే, మ్యూచువల్ ఫండ్ డివిడెండ్స్ అనేవి ఇన్వెస్టర్లకు చెందిన సొంత ఫండ్ యొక్క నిర్వహణలో ఉన్న అసెట్స్ (AUM) నుంచే చెల్లిస్తారు. ఫలితంగా డివిడెండ్ ప్రకటించిన మ్యూచువల్ ఫండ్ నికర అసెట్ విలువ (NAV), డివిడెండు రికార్డు తేదీ తర్వాత ఆ ఫండ్ చెల్లించిన డివిడెండ్ పరిమాణం మేరకు తగ్గిపోతుంది. పైగా డివిడెండ్ మొత్తాన్ని సదరు ఫండ్ ముఖ విలువ (ఫేస్ వేల్యూ) ఆధారంగా లెక్కిస్తారే తప్పవాటి NAVల ఆధారంగా కాదు. పన్ను ప్రయోజనాలపరంగా చూస్తే గ్రోత్ ఆప్షన్‌తో పోల్చినప్పుడు ఈ ఆప్షన్ అంత ఉపయోగకరం కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు వర్తిస్తాయి.
కాబట్టి పన్నులపరంగా అధిక ప్రయోజనాలతో పాటు కాంపౌండింగ్ ప్రభావంతో పెట్టుబడులు మరింతగా వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న గ్రోత్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం శ్రేయస్కరం.
మీ పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడం
సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు నెలవారీగా చేతిలో మిగిలే అదనపు నిధులన్నింటినీ, గతంలో అత్యుత్తమమైన రాబడులు అందించిన ఏదో ఒకటో రెండో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లోనేపెట్టుబడిగా పెట్టేస్తుంటారు. అయితే, దీనివల్ల మార్కెట్పరంగా ఇన్వెస్టర్‌కు ఎదురయ్యే రిస్కులన్నీ కూడా ఏదో ఒకటో రెండో ఫండ్ నిర్వహణ బృందాలే పర్యవేక్షించడానికి పరిమితమవుతుంది. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ఫండ్‌కి సంబంధించిన మేనేజ్మెంట్ బృందం ఏదైనా తప్పు పెట్టుబడి నిర్ణయం తీసుకున్నా లేక పెట్టుబడి వ్యూహం, రంగం లేదా మీ ఫండ్ థీమ్‌కు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా మిగతా మార్కెట్‌తో పోలిస్తే మీ మ్యుచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో సుదీర్ఘకాలం పాటు అంతగా రాణించకపోవచ్చు.
కాబట్టి మీ డబ్బును ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయడం కాకుండా మీ రిస్కు సామర్థ్యాలను బట్టి వివిధ ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టండి. తద్వారా రిస్కులు తగ్గుతాయి. ఒకవేళ మీ ఫండ్స్‌లో ఏదైనా ఒకదాని పనితీరు సరిగ్గా లేకపోయినా, మీపోర్ట్ఫోలియోలోని మిగతా ఫండ్స్ ఆ లోటును భర్తీ చేయగలుగుతాయి.
ఫండ్స్‌ను ఎంచుకునేందుకుNAVలను పోల్చి చూడటం
కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు సాధారణంగా NAVతక్కువగా ఉండే ఫండ్లు చౌకగా లభిస్తున్నాయని భావిస్తుంటారు. ఫలితంగా SIP మార్గంలో ఇన్వెస్ట్ చేయడానికి వాటిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే, ఫండ్NAV అనేది తక్కువగానో లేదా ఎక్కువగానో ఉండటానికి అనేకానేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకుఒక ఫండ్ NAV అనేది దాని పోర్ట్‌ఫోలియోలోని సాధనాల మార్కెట్ ధరను బట్టి ఉంటుంది. చక్కగా నిర్వహించబడుతున్న స్కీమ్NAV మిగతా ఫండ్స్‌తో పోలిస్తే వేగంగా పెరగవచ్చు. అలాగే, కొత్త ఫండ్స్ స్వల్పకాల వ్యవధిలో ఎదిగే క్రమంలో పాత ఫండ్స్‌తో పోలిస్తే వాటి NAVలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వివిధ మ్యూచువల్ ఫండ్స్‌ను పోల్చి చూసుకునేటప్పుడు NAVలను మాత్రమే పరిగణించకండి. దానికి బదులు ఆయా మ్యూచువల్ ఫండ్స్ గత కాలపు పనితీరు, భవిష్యత్‌లో ఆ కోవకి చెందిన మిగతా ఫండ్స్, ప్రామాణిక (బెంచ్‌మార్క్) సూచీలకు మించి రాబడులు అందించగలిగే అవకాశాలను, కొలమానంగా తీసుకోండి.
మార్కెట్లు బేరిష్‌గా ఉన్నప్పుడు SIPలను ఆపివేయడం
చాలా మంది ఇన్వెస్టర్లు మరింతగా నష్టపోవాల్సి వస్తుందేమోనన్న భయాలతో మార్కెట్లు బేరిష్‌గా ఉన్న పరిస్థితుల్లో SIPలను నిలిపివేస్తుంటారు. అయితే, దీనివల్ల ఈక్విటీ ఫండ్స్‌లో SIP మార్గంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల పొందే అసలైన ప్రయోజనాలను కోల్పోయినట్లవుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమైనప్పుడు, కరెక్షన్లకు లోనైనప్పుడు తక్కువ NAVకే ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయడం వల్ల ఒనగూరే రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. మార్కెట్లు బేరిష్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాణ్యమైన షేర్లు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లతో లభిస్తుంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో SIPలను కొనసాగించడం వల్ల మీ పెట్టుబడి వ్యయాలు తగ్గుతాయి. అలాగే దీర్ఘకాలంలో మీరు మరింత ఎక్కువ రాబడులు అందుకునేందుకు తోడ్పడుతుంది.
కాస్త ఎక్కువ మిగులు నిధులను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు, మార్కెట్లు బేరిష్ ధోరణుల్లో ఉన్నప్పుడు, తమ అసెట్ కేటాయింపుల వ్యూహానికి అనుగుణంగా, SIPలకు అదనంగా విడతలవారీగా కాస్త పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. తద్వారా బేరిష్ మార్కెట్ ధోరణుల నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ విధానం ద్వారా పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా తమ ఆర్థిక లక్ష్యాలను మరింత వేగంగా చేరుకునేందుకు కూడా ఇది తోడ్పడుతుంది.
ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఇటీవలి కాలంలో పనితీరును పరిశీలించడం
చాలావరకు ఇన్వెస్టర్లు, ఫండ్స్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు ఇటీవలి కాలంలో అంటే గడిచిన 1 ఏడాది, 2 ఏళ్లలో అవి కనబర్చిన పనితీరును, అందించిన రాబడులను ప్రాతిపదికగా తీసుకుంటూ ఉంటారు. అయితే, ఒకవేళ అవి ఇటీవలి కాలంలో అద్భుతమైన రాబడులను అందించినా, అది మార్కెట్పరమైన వివిధ అంశాల కారణంగా తాత్కాలిక ధోరణే అయి ఉండవచ్చు. పైగా గతంలో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ నిర్వహణ తీరుతెన్నులు, అప్పటి మార్కెట్ పరిస్థితుల కారణంగా కొన్ని ఫండ్స్, బెంచ్‌మార్క్ సూచీలు అలాగే అదే కోవకి చెందిన ఇతర ఫండ్స్‌తో పోలిస్తే స్వల్పకాలికంగా వెనుకబడి ఉండవచ్చు. కాబట్టి SIP విధానంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఫండ్స్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు అదే కోవకి చెందిన ఇతర ఫండ్స్, బెంచ్‌మార్క్ సూచీలతో పోల్చి చూస్తే గత 5 ఏళ్లుగా అవి ఎలాంటి పనితీరును కనబర్చాయో తెలుసుకోవాలి. పదేళ్ల కాల వ్యవధి తీసుకుంటే మరీ మంచిది. దీనివల్ల కాలగతిలో వివిధ ఆర్థిక పరిస్థితుల్లో ఆయా ఫండ్స్ ఎలా రాణించాయో తెలుసుకునేందుకు వీలవుతుంది.