Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు
- కార్లపై 90 శాతం అప్పు
- చౌక వడ్డీతో పసిడి లోన్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తమ ఖాతాదారులకు వరుస బంఫర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేయగా.. పండగల సీజన్ నేపథ్యంలో తాజాగా రిటైల్ రుణ గ్రహీతలకు పలు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో రిటైల్ విభాగంలో కార్ల కొనుగోలు దారులకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇస్తుంది. అదే విధంగా కార్లపై 90 శాతం వరకు రుణ పరపతి కల్పిస్తుంది. ఎస్బిఐ యాప్ యోనో ద్వారా కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 25 బేసిక్ పాయింట్ల వడ్డీ రాయితీ అందిస్తుంది. దీంతో కార్ల రుణాలపై 7.5 శాతం వడ్డీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు ప్రస్తుతం పండుగల సీజన్ మొదలైనందున బంగారం రుణాలపై వడ్డీరేటు 75 బేసిక్ పాయింట్లు తగ్గించింది. దీంతో బంగారం తనఖా అప్పులపై 7.5 శాతం వడ్డీ వసూలు చేయనుంది. యోనో యాప్ ద్వారా బంగారం రుణాలకు దరఖాస్తు చేసేవారికి పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగత, పెన్షన్ రుణ ఖాతాదారులకు ప్రాసెసింగ్ ఫీజు రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది కరోనా పోరులో ముందు వరుసలో నిలిచే ఆరోగ్య కార్యకర్తలకు పర్సనల్ రుణాలపై 50 బేసిస్ పాయింట్ల మేరకు ప్రత్యేకంగా వడ్డీ రాయితీ అందిస్తుంది. వ్యక్తిగత రుణాలతో పాటు బంగారం, కార్ల రుణాలు తీసుకునే హెల్త్‌కేర్ వర్కర్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ కల్పిస్తుంది. ప్రస్తుతం గృహ రుణాలపై 6.70 శాతం వడ్డీరేటు అమలు చేస్తోంది.
డిపాజిట్లపై అదనపు వడ్డీ
75 ఏండ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా 'ప్లాటినం టర్మ్ డిపాజిట్లు' పేరుతో ప్రత్యేక ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 15 నుంచి వచ్చేనెల 14 వరకు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల గడువుతో చేసే టర్మ్ డిపాజిట్లపై అదనంగా 15 బేసిక్ పాయింట్ల మేర వడ్డీ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో కాలపరిమితిని బట్టి 3.95 శాతం నుంచి 5.60 శాతం వరకు వడ్డీ లభించనుంది. ఎస్బిఐ ఖాతాదారులు తీసుకునే రుణాలపై వారి సొమ్ము ఆదా చేయడానికి ఈ ఆఫర్లు దోహదం చేస్తాయని ఎస్బిఐ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ శెట్టి తెలిపారు. పండగ సంబురాలకు ఇవి అదనం అవుతాయన్నారు.